Search
Monday 19 November 2018
  • :
  • :
Latest News

ప్రత్యామ్నాయ ఇంధనమే శరణ్యం

petrolచమురు ఎక్కువగా వినియోగించుకునే దేశాలలో భారత్ ప్రపంచంలో మూడో స్థానంలో ఉంది. పారిశ్రామిక దేశాలలో చమురు వినియోగం తగ్గుతున్న దశలో మన దేశంలో చమురు వినియోగం అంతకంతకూ పెరుగుతోంది. వచ్చే రెండు దశాబ్దాల వరకు భారత్ కు భారీగా చమురు ఎగుమతి చేయవచ్చునని చమురు ఎగుమతి చేసే దేశాలు భావిస్తున్నాయి. మన దేశానికి అవసరమైన చమురులో ఇప్పటికే 80 శాతం దిగుమతులమీదే ఆధారపడుతున్నాం. దేశంలో చమురు ఉత్పత్తి తగ్గుతున్న దశలో అంతర్జాతీయ మార్కెట్ లో చమురు ధరల్లో ఎగుడుదిగుడు వల్ల మనం ఇబ్బందుల్లో కూరుకుపోయే ప్రమాదం ఉంది. గత మూడు సంవత్సరాలుగా అంతర్జాతీయ మార్కెట్ లో ముడి చమురు ధర తగ్గడం వల్ల పరిస్థితి మెరుగ్గానే ఉన్నా భవిష్యత్తులో విపత్కర పరిస్థితులు ఎదురు కావచ్చు.
2013-14లో ఒక పీపా ముడి చమురు ధర 105 డాలర్లు ఉండేది. 2015-16లో ఆ ధర 46 డాలర్లకు పడిపోయింది. ధరలు తగ్గడానికి కొద్ది నెలల ముందే నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ధర తగ్గినా ప్రభుత్వం సుంకాలు పెంచి ఆదాయం పెంచుకుందే తప్ప తక్కువ ధరల వల్ల ప్రజలకు ప్రయోజనం లేకుండా చేసింది. అంటే వినియోగదారులు పీపా ముడి చమురు ధర 100 డాలర్ల కన్నా ఎక్కువ ఉన్నప్పుడు ఎంత చెల్లించారో, ధర బాగా తగ్గిన సమయంలో కూడా పెట్రోల్, డీసెల్ కు మునుపటి లాగే ఎక్కువ ధరే చెల్లించాల్సి వచ్చింది. మనం దిగుమతి చేసుకునే ముడి చమురు ధర అక్టోబర్ 31న పీపాకు 59 డాలర్లు ఉంది. ఇది జులై 31న 51.2 డాలర్లు ఉండేది. ఈ సమయంలోనూ ప్రభుత్వం సుంకాలు పెంచింది. కాని ప్రతిపక్ష పార్టీల ఒత్తిడి వల్ల ఆ ప్రతిపాదన విరమించుకోవాల్సి వచ్చింది.
అంతర్జాతీయ మార్కెట్ లో చమురు ధర తగ్గడానికి పెట్రోలియం ఎగుమతి చేసే (ఓపెక్) దేశాలే కారణం. ప్రధానంగా ప్రపంచంలోకెల్లా ఎక్కువ చమురు ఉత్పత్తి చేసే సౌదీ అరేబియా వల్లే ధర తగ్గింది. 2011-2014 మధ్య చమురు ధరలు ఎక్కువగా ఉండడం వల్ల అమెరికా సంప్రదాయేతర శిలాజ ఇంధనాల ఉత్పత్తి కోసం ఎక్కువ పెట్టుబడులు పెట్టింది. ఈ రకం ఇంధనాన్ని షేల్ ఆయిల్ అంటారు. ఈ చమురు వెలికి తీయడానికి గండ శిలల్లోకి అథ్యధిక పీడనంతో ద్రవ పదార్థాలను పంపిస్తారు. అప్పుడు చమురు, గ్యాస్ వెలికి వస్తాయి. ఇంతకు ముందు షేల్ ఆయిల్ వెలికి తీయడం ఖర్చుతో కూడుకున్న వ్యవహారం అనుకునే వారు. ఒక స్థాయికన్న ధర తక్కువ ఉంటే గిట్టుబాటయ్యే వ్యవహారం కాదనుకునే వారు. 2014 మధ్యలో చమురు ధరలు తగ్గినప్పటికీ ఓపెక్ దేశాలు చమురు ఉత్పత్తి తగ్గించి ధరల తగ్గుదలను నివారించడానికి ప్రయత్నించలేదు. అమెరికా ఉత్పత్తి చేస్తున్న షేల్ ఆయిల్ గిట్టుబాటు కాని వ్యవహారంగా మార్చడం కోసమే ఉత్పత్తి తగ్గించలేదు. ధరలు తక్కువగా ఉన్నప్పటికీ మెరుగైన ఉత్పత్తి విధానాలను అనుసరించడం వల్ల షేల్ ఆయిల్ ఉత్పత్తి కొనసాగింది. ఉత్పత్తి దార్లు ధర పెరిగే దాకా వేచి చూశారు.
చివరకు చమురు ధరలు బాగా తగ్గడం వల్ల ఓపెక్ దేశాల మీద ప్రభావం తప్పలేదు. ఆ దేశాల బడ్జెట్లు ప్రధానంగా చమురు మీద ఆధారపడినవే. దీని ఫలితంగా 2016 ఆఖరులో ఓపెక్ దేశాలు చమురు ఉత్పత్తుల మీద పరిమితులు విధించాయి. చమురు ఎక్కువగా సరఫరా లేని పరిస్థితి తీసుకు రావడం వల్ల ధరలు పెరిగాయి. అప్పటి నుంచి చమురు ధరలు క్రమంగా పెరుగుతున్నాయి.
చమురు కోసం దుగుమతుల మీదే ఎక్కువగా ఆధారపడవలసి రావడం వల్ల భారత్ వేర్వేరు దేశాల నుంచి చమురు దిగుమతి చేసుకోవడం ప్రారంభించింది. మన దేశం ఇప్పటికీ ఓపెక్ దేశాల నుంచే చమురు ఎక్కువగా దిగుమతి చేసుకుంటోంది. 2017 జనవరి నుంచి జులై వరకు అందుబాటులో ఉన్న గణాంకాల ప్రకారం చమురు దిగుమతి కోసం 13, 500 మిలియన్ డాలర్లు ఎక్కువగా ఖర్చు పెట్టవలసి వచ్చింది. అంటే దిగుమతి వ్యయం 42 శాతం పెరిగింది. గత సంవత్సరం మన దేశం ఓపెక్ దేశాలు కాని దేశాల నుంచి 2,491 మిలియన్ డాలర్ల విలువగల చమురు దిగుమతి చేసుకుంది.
అంటే చమురు విలువలో 64.8 శాతం ఎక్కువగా భరించవలసి వచ్చింది. ఓపెక్ దేశాలలో చమురు ఉత్పత్తిపై పరిమితి విధించినందువల్ల అవి తమ ఎగుమతులను తగ్గించుకోవాల్సి వచ్చింది. దిగుమతులపై పరిమితులు ఈ ఏడాది జనవరి ఒకటి నుంచి అమలులోకి వచ్చాయి. ఈ సందర్భంగా మనం అమెరికా నుంచి చమురు దిగుమతి చేసుకోవడం పెరిగింది. ఈ దిగుమతులు భారీగా లేకపోయినా అమెరికాలో షేల్ ఆయిల్ ఉత్పత్తి పెరిగినందువల్ల అక్కడి నుంచి దిగుమతి చేసుకున్నందువల్ల ఓపెక్ దేశాలతో మనం బేరమాడడానికి అవకాశం పెరిగింది.
మెరుగైన సామర్థ్యం, ప్రత్యామ్నాయ ఇంధనాల కోసం ప్రయత్నం వల్ల అంతర్జాతీయ చమురు మార్కెట్ల మీద ప్రభావం పడక తప్పదు. దీని వల్ల అంతర్జాతీయంగా చమురుకు గిరాకీ శాశ్వతంగా తగ్గుతుందేమోనన్న ఆందోళన కలిగింది. వర్ధమాన దేశాలలో చమురుకు బదులు ఇతర ఇంధనాల వినియోగం అనుకున్న దాని కన్న తక్కువే ఉంది. ముఖ్యంగా రోడ్డు రవాణా రంగంలో ప్రత్యామ్నాయ ఇంధనం వాడకం ప్రభావం ప్రధానంగా రవణా రంగంపై ఉంటుంది. మనం ఈ విషయంలో ప్రత్యామ్నాయ ఇంధనాన్ని పాక్షికంగానే వాడుతున్నాం. కాలుష్య రహితమైన ఇంధనం వాడడం, సొంత వాహనాల వాడకాన్ని తగ్గించడం వల్ల నగరాల్లో కాలుష్యం తగ్గుతుంది.
మన నగరాలలో ప్రపంచంలోని ఇతర నగరాల కన్నా ఎక్కువ. మన దేశంలో చమురుకు గిరాకీ ఎక్కువ ఉన్నందువల్ల, దిగుమతుల మీదే అధికంగా ఆధారపడుతున్నందువల్ల శిలాజ ఇంధనాల వాడకం తగ్గించడానికి మార్గాలు అన్వేషించవలసిన అవసరం ఉంది. ఈ పని చేయడం అర్థిక దృష్టితో చూసినా, ప్రర్యావరణ దృష్టితో చూసినా చాలా ప్రాధాన్యం ఉన్నదే. ఇప్పుడు మనం తీసుకునే ఆర్థిక నిర్ణయం వల్ల భావితరాల భవిష్యత్తు మెరుగు పడడమే కాక మన పరిస్థితి కూడా బాగుంటుంది.

                                                                                                                                                                      * (ఇ.పి.డబ్ల్యు. సౌజన్యంతో)

Comments

comments