న్యూఢిల్లీ: టిమిండియా మహిళల క్రికెట్ జట్టు కోచ్ పదవి నుంచి వైదొలుగుతున్నట్లు తుషార్ అరోథ్ సంచలన ప్రకటన చేశారు. తన వ్యక్తిగత కారణాల వల్లనే కోచ్ పదవి నుంచి తప్పుకుంటున్నట్లు పేర్కొన్నారు. 2013లో తుషార్ తొలిసారి టీం ఇండియా మహిళ జట్టు కోచ్‌గా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల ఆయన ఆ పదవి నుంచి తప్పుకున్నారు. అయితే ఇంగ్లండ్‌లో జరిగిన ప్రపంచకప్‌కు ముందు కోచ్‌గా ఉన్న పూర్ణిమా రావ్ని తప్పించి ఆమె స్థానంలో తుషార్‌కు తిరిగి కోచ్ బాధ్యతలు అప్పగించారు. పదవిలో ఉన్నప్పుడు కొందరు క్రికెటర్లతో తనకు మంచి అనుబంధం లేదని ఆయన తెలిపారు. అందుకే టీం ఇండియా జట్టు అభివృద్ధి కోసం వాళ్లని.. తమ సౌకర్యాల నుంచి దూరంగా ఉండాలని గతంలో చాలాసార్లు సలహా ఇచ్చినట్లు పేర్కొన్నారు.
గత ఆరు సీజన్ల నుంచి ఆసియా కప్‌లో ఛాంపియన్స్‌గా నిలుస్తున్న టీం ఇండియా మహిళ జట్టుకు ఈ ఏడాది పరాభవం తప్పలేదు. బంగ్లాదేశ్‌తో ఈ సీజన్లో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో భారత మహిళ జట్టు ఘోరంగా ఓడిపోయింది. అయితే తుషార్‌కి జట్టు సభ్యులతో మంచి సమన్వయం లేని కారణంగానే భారత్‌కు ఈ మ్యాచ్‌లో పరాజయం తప్పలేదని టాక్. దీంతో భారత్ జట్టు కోచ్‌గా ఉన్న తుషార్‌పై ఒత్తిడి పెరిగినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే తుషార్ అరోథ్ తన పదవీ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.