Home ఎడిటోరియల్ తూర్పు దిక్కున నవోదయం

తూర్పు దిక్కున నవోదయం

ఆటోమొబైల్ విక్రయాలను వృద్ధి ఇంజిన్‌గా ప్రపంచం పరిగణించినట్లయితే, భారతదేశ ఆర్థికాభివృద్ధిలో తదుపరి దశ ఇప్పటివరకు అలక్షానికి గురైన తూర్పు ప్రాంతం నుంచి గణనీయంగా రానుంది. దేశంలోని పాసింజర్ కార్లు, ఎస్‌యువిలు, ద్విచక్ర, త్రిచక్ర వాహన ఉత్పత్తిదారులెవరినైనా అడగండి తమ టాప్ (అమ్మకం), బాటమ్ (ఉత్పత్తి) లైన్‌కు తూర్పు రాష్ట్రాలు గణనీయంగా తోడ్పడుతున్నాయంటారు. ఆటోమొబైల్ విక్రయాల తాజా ట్రెండ్‌పై ప్రపంచ కన్సల్టెన్సీ సంస్థ కెపిఎంజి నివేదిక ఈ దిశనే చూపుతున్నది. అనేక సంవత్సరాలుగా తమిళనాడు, మహారాష్ట్ర, కర్నాటక, గుజరాత్, హర్యానాలు ఆటోమొబైల్, సెల్‌ఫోన్, టెలీకం సామాగ్రి, డ్రగ్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్, ఎరువులు, రసాయినాలు, వస్త్రాలు, దుస్తులు, పెట్రోలియం శుద్ధికి పారిశ్రామిక కేంద్రాలుగా ఆవిర్భవించాయి. ఢిల్లీ కేంద్రంగాగల జాతీయ రాజకీయ పాలనా యంత్రాంగం తూర్పు భారత్‌ను చాలా కాలంగా అలక్షం చేస్తున్నది. పారిశ్రామిక డీలైసెన్సింగ్, ఆర్థిక సంస్కరణ జరిగినా పరిశ్రమల స్థాపనను ప్రోత్సహించే నిర్ణయాలను ప్రభావితం చేస్తున్నది నిస్సందేహంగా ఈ యంత్రాంగమే.
అయినా, తూర్పు భారత్ ఉక్కు, బొగ్గు, బాక్సైట్, అల్యూమినియం, క్రూడ్ ఆయిలు వంటి ప్రాథమిక ముడి పదార్థాలను దేశానికి అందిస్తూనే ఉంది. అయితే మార్కెట్ గాలి మారుతున్నది. చర్మం ఉత్పత్తిలో 25 శాతంపైగా, ఉక్కు ఉత్పత్తిలో 21.5 శాతం, గనులు, క్వారీల ఉత్పత్తుల్లో 44.1 శాతం, క్రూడ్ ఆయిలు ఉత్పత్తిలో 28.7 శాతం, రసాయినాలు, రసాయినిక ఉత్పత్తుల్లో 10.4 శాతం ఇప్పుడు ఈ ప్రాంతం నుంచే వస్తున్నది. పశ్చిమ బెంగాల్, ఒడిసా, జార్ఖండ్, అసోం సహా తూర్పు రాష్ట్రాలు తమ సొంత బలంతో వృద్ధి చెందుతున్నాయి.
రీజియన్ వారీ ఆటోమొబైల్ విక్రయాలు, పెరుగుతున్న విమాన ప్రయాణాలు, మధ్యస్థాయి బడ్జెట్ విదేశీ విహార యాత్రలు, రియల్ ఎస్టేట్ అభివృద్ధి, పారిశ్రామిక ఉత్పత్తుల మార్కెటింగ్ ప్రధానంగా ఇతర రీజియన్‌లలో ఎక్కువగా ఉన్నప్పటికీ, తూర్పు భారత్ సరికొత్త బలమైన వృద్ధి లక్షణాన్ని అవి రికార్డు చేస్తున్నాయి. తూర్పు భారత్ తక్కువ ఆదాయ రీజియన్ నుంచి మధ్యస్థాయి ఉన్నతాదాయ రీజియన్‌గా నెమ్మదిగా, నిలకడగా పరివర్తనం చెందటానికి దోహదకారి అవుతున్నవేమిటో నీతి ఆయోగ్ సహా జాతీయస్థాయి ఆర్థికవేత్తలకు కచ్చితంగా తెలిసినట్లు అనిపించదు. ఈ రీజియన్‌లో నిలకడగా అభివృద్ధి చెందుతున్నవి వ్యవసాయం, సాంప్రదాయక గనులు, ఖనిజాలు ఆధారిత పరిశ్రమలు, చర్మం, జనుము ఉత్పత్తులు, చిన్న, మధ్య తరహా పారిశ్రామిక ఉత్పత్తులు. అవి ముఖ్యంగా మధ్య, దిగువ స్థాయిల్లో వెచ్చించేందుకు ఆదాయం సమకూర్చుతున్నాయి. కెపిఎంసి తాజా సర్వే ఈ లక్షణాన్ని గుర్తించింది. ఈ రీజియన్‌కు వృద్ధి అవకాశాలు గొప్పగా ఉన్నాయని, అది జాతీయ జిడిపి, ఆదాయానికి గణనీయంగా దోహదకారి అవుతుందని పేర్కొన్నది.
ఆసక్తికరమేమంటే, ప్రోత్సాహకరమైన తూర్పు భారత్ వృద్ధి లక్షణం కారణంగా ఆటోమొబైల్, పౌర విమానయాన పరిశ్రమల దృష్టి కేంద్రీకరణ అటు మరలుతున్నది. ప్యాసింజర్ కార్లు, ద్విచక్ర వాహనాలు, స్పోర్ట్ యుటిలిటీ వెహికల్స్ (ఎస్‌యువిలు) విక్రయాల వృద్ధిరేటు ఈ రీజియన్‌లో అఖిల భారత సగటుకన్నా రెట్టింపు ఉందని సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫాక్చరర్స్ (ఎస్‌ఐఎఎం) తెలియజేసింది. 201718లో తూర్పు రీజియన్‌లో ప్యాసింజర్ కార్లు, టూ వీలర్స్, ఎస్‌యువి విక్రయం వరుసగా 14 శాతం, 24.90 శాతం, 26.40 శాతం వంతున పెరిగింది. అసోంలో ఆటో విక్రయాలు క్రితం సంవత్సరం కన్నా 44 శాతం పెరిగాయి. బెంగాల్, బీహార్, ఒడిసా, అసోం, జార్ఖండ్, ఏడు ఈశాన్య రాష్ట్రాలు దేశం మొత్తం మీద అమ్ముడయిన ప్యాసింజర్ కార్లలో (టూ వీలర్స్ సహా) 15 శాతం వాటా పొందాయి. 201718లో దేశ వ్యాప్తంగా పెరిగిన ఆటో విక్రయాల్లో నాల్గవ వంతు అక్కడ ఉన్నాయి. జిడిపికి తూర్పు భారత్ దోహదం 17 శాతంగా చెప్పబడుతున్నది. ఈ రీజియన్‌కున్న వృద్ధి సామర్థాన్ని పరిగణనలోకి తీసుకుంటూ, ఐదు తూర్పు రాష్ట్రాలు (బెంగాల్, బీహార్, ఒడిసా, అసోం, జార్ఖండ్) ఈశాన్య రాష్ట్రాలతో కలిపి 2035 చివరకు దేశ జిడిపిలో నాల్గవ వంతుకు దోహదకారి అవుతాయని కెపిఎంజి భావిస్తున్నది. మారుతీ సుజుకి, హుండై, టాటా మోటార్స్, ఫోర్డ్, విడబ్లు, బజాజ్ ఆటో, హీరో, టివిఎస్, హోండా ఈ కంపెనీలన్నీ తూర్పు భారత్‌లో పెరుగుతున్న ఆటోమొబైల్ మార్కెట్‌పై దృష్టి పెట్టాయి.
తూర్పు నుంచి విమాన ప్రయాణం కూడా మున్నెన్నడూ లేనంత పెరుగుతున్నది. కోల్‌కత విమానాశ్రయం ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్నట్లు ఎయిర్‌పోర్ట్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ పేర్కొన్నది. 2020 నాటికి విమాన ప్రయాణీకులు అమెరికా, చైనా తర్వాత భారత్‌లో ఎక్కువగా ఉంటారని అది ఊహిస్తున్నది. ఇందులో కోల్‌కతాకు పెద్ద వాటా దక్కుతుంది. రీజినల్ కనెక్టివిటీ పథకం ఉడాన్ పెద్ద ఎత్తున ఆచరణలోకి వస్తే అది విమానయానాన్ని మరింత వృద్ధిలోకి తెస్తుంది. కోల్‌కత విమానాశ్రయం నుంచి ప్రయాణీకుల రవాణా గత సంవత్సరం అనేక ఇతర ప్రసిద్ధి పొందిన విమానాశ్రయాల తలదన్నింది.
201718లో ఢిల్లీ, ముంబయి విమానాశ్రయాల నుంచి ప్రయాణీకుల రవాణా వృద్ధి, అంతకు ముందు సంవత్సరంతో పోల్చితే దాదాపు 14 శాతం పెరిగింది. కాగా కోల్‌కతా నుంచి ఎయిర్ ట్రాఫిక్ దాదాపు 27 శాతం పెరిగింది. అదే సంవత్సరంలో హైదరాబాద్, బెంగళూరు, చెన్నయ్‌ల నుంచి ఎయిర్ ట్రాఫిక్ వృద్ధి వరుసగా 19.6 శాతం, 12.9 శాతం, 10.5 శాతం. గత సంవత్సరం కోల్‌కతా నుంచి దాదాపు 2 కోట్ల మంది విమాన ప్రయాణం చేశారు. తూర్పు భారత్‌లోని చిన్న విమానాశ్రయాలైన భువనేశ్వర్, గువహతి, బగ్‌దోగ్రా, రాంచీల్లో ఎయిర్ ట్రాఫిక్ వృద్ధి వరుసగా 30 శాతం, 23 శాతం, 48 శాతం, 71 శాతం నమోదైంది.
దేశీయ రేటింగ్స్ ఏజెన్సీ స్మెరా రేటింగ్స్ కెపిఎంజి సర్వేతో ఏకీభవిస్తున్నది. 2035 నాటికి దేశ జిడిపి 11.34 ట్రిలియన్ డాలర్లకు చేరుతుందని, అందులో తూర్పు భారత్ వాటా, పశ్చిమ బెంగాల్ అగ్రగామిగా 3 ట్రిలియన్‌ల డాలర్లు (ట్రిలియన్ -= లక్ష కోట్లు) ఉంటుందని స్మెరా అంచనా వేసింది. బెంగాల్, వ్యూహాత్మక భౌగోళికత దాన్ని తూర్పు, ఈశాన్య రాష్ట్రాలకు కీలకమైన కేంద్రం చేస్తున్నది. పశ్చిమబెంగాల్ అభివృద్ధిపై ఈ రాష్ట్రాల పురోగతి ఆధారపడి ఉంటుంది. రీజియన్ జిడిపిలో ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ వాటా 40 శాతం. ఈ రీజియన్‌లో వృద్ధి చెందుతున్న మార్కెట్ పరిమాణం అక్కడ పరిశ్రమలు పెట్టేటట్లు మాన్యుఫాక్చరింగ్ రంగాన్ని ఆకర్షిస్తుంది. అది కాలక్రమంలో ఆర్థిక వ్యవస్థకు ప్రోత్సాహకమవుతుంది. వారి అమ్మకాలు వృద్ధి చెందుతాయి. (ఐపిఎ)

*  నంటూ బెనర్జీ