Home తాజా వార్తలు వృద్ధిలో భారత్ జోరు

వృద్ధిలో భారత్ జోరు

India

 మరికొన్ని సంవత్సరాలు కొనసాగుతుంది..
 201819లో వృద్ధి రేటు 7.3 శాతం
 201920లో 7.5 శాతం : ప్రపంచ బ్యాంక్ అంచనా

న్యూఢిల్లీ: అత్యంత వేగంగా అభివృద్ధి దేశాల్లో భారత్ తన సత్తా చాటుతోంది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో భారత్ జిడిపి(స్థూల దేశీయోత్పత్తి) వృద్ధి రేటు 7.3 శాతం నమోదు కానుందని ప్రపంచ బ్యాంక్ అంచనా వేసింది. ఆ తర్వాతి వచ్చే ఆర్థిక సంవత్సరాల్లో 7.5 శాతం వృద్ధి రేటును చూపనుందని వెల్లడించింది. పెట్టుబడులు, వినియోగంలో పెరుగుదలే వృద్దిలో పురోగతికి కారణమని తెలిపింది. మరికొన్ని సంవత్సరాల పాటు భారత్ ఇదే విధమైన వృద్ధి రేటును కొనసాగిస్తుందని గ్లోబల్ ఎకనామిక్ ప్రాస్పెక్టస్‌ని విడుదల చేసిన వరల్డ్ బ్యాంక్ వెల్లడించింది. అదే విధంగా ఈ సంవత్సరంలో ప్రపంచ వృద్ధి రేటు 3 శాతం నుంచి 2.9 శాతానికి తగ్గనుందని, ప్రస్తుతం అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ పరిస్థితి మందగించిందని వరల్డ్ బ్యాంక్ ప్రతినిధి తెలిపారు. చైనా ఆర్థిక వృద్ధి 2019, 2020 సంవత్సరాల్లో 6.2 శాతం, 2021లో 6 శాతంగా ఉండనుందని నివేదికలో ప్రపంచ బ్యాంక్ పేర్కొంది.

జిఎస్‌టి, నోట్ల రద్దు కారణంగా 2017 భారత ఆర్థిక వ్యవస్థ ఒడుదొడుకులకు గురై వృద్ధిరేటు 6.7శాతానికి పరిమితమైనట్లు పేర్కొంది. దేశీయ వృద్ధిలో గతేడాది భారత్ కంటే చైనా ముందుందని, అయితే ఈ ఏడాది మాత్రం చైనా వృద్ధిరేటు మందగిస్తుందని అంచనా వేసింది. ‘వినియోగంలో పెరుగుదల, పెట్టుబడులతో భారత్ వేగంగా వృద్ధి చెందుతోంది. 2018-19 ఆర్థిక వ్యవస్థలో ఆ దేశ వృద్ధిరేటు 7.3 శాతంగా ఉంటుందని మేం అంచనా వేస్తున్నాం. ఇక 2019-20, 2020-21 ఆర్థిక సంవత్సరాల్లో భారత వృద్దిరేటు 7.5శాతంగా ఉండొచ్చు’ అని ప్రపంచ బ్యాంక్ ప్రాస్పెకట్స్ గ్రూప్ డైరెక్టర్ అయాన్ ఖోస్ తెలిపారు.

ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత్ 2019-20 ఆర్థిక సంవత్సరంలోనూ తన స్థానాన్ని నిలుపుకోనుందని ప్రపంచ బ్యాంక్ అంచనా వేసింది. 2017-18లో నమోదైన భారత్ వృద్ధి రేటు 6.7 శాతం కాగా, ఈ ఆర్థిక సంవత్సరం 7.3 శాతానికి చేరవచ్చని, వచ్చే సంవత్సరం 7.5 శాతం వృద్ధి రేటు నమోదు కావచ్చని పేర్కొంది. ఇదే సమయంలో దక్షిణాసియాలో పలు దేశాల్లో ఎన్నికలు జరగనున్నాయని గుర్తు చేసిన వరల్ బ్యాంక్, రాజకీయ అనిశ్చితి ఏర్పడవచ్చని తెలిపింది. ఈ కారణంతో వృద్ధి రేటు మందగించే అవకాశాలున్నాయని హెచ్చరించింది. ఇక ప్రపంచ సగటు వృద్ధి తగ్గవచ్చని అంచనా వేసింది. ఉత్పత్తి రంగం నెమ్మదించడమే ఇందుకు కారణమని అభిప్రాయపడింది.

India Fastest Growing Major Economy in 2018-19