Home తాజా వార్తలు సమరానికి సిద్ధం!

సమరానికి సిద్ధం!

ind

ఆత్మవిశ్వాసంతో భారత్, నేటి నుంచి ఇంగ్లండ్‌తో తొలి టెస్టు

బర్మింగ్‌హామ్: అభిమానులు ఎంతో అతృతగా ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది. ఇంగ్లండ్‌భారత్ జట్ల మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు బుధవారం తెరలేవనుంది. ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా ఎడ్జ్‌బాస్టన్ వేదికగా మొదటి టెస్టు జరుగనుంది. ఇంగ్లండ్‌కు ఇది 1000వ టెస్టు మ్యాచ్ కావవం విశేషం. టెస్టు సిరీస్ కోసం ఇటు భారత్ అటు ఆతిథ్య ఇంగ్లండ్ సమరోత్సాహంతో సిద్ధమయ్యాయి. సిరీస్‌లో ఇరు జట్లకు సమాన అవకాశాలున్నాయి. రెండు జట్లలోనూ ప్రతిభావంతులైన ఆటగాళ్లకు కొదవలేదు. ఈ మ్యాచ్ కోసం ఇప్పటికే ఇంగ్లండ్ తుది జట్టును ప్రకటించింది. భారత్ మ్యాచ్ ప్రారంభానికి ముందు జట్టును ప్రకటించే అవకాశం ఉంది. కాగా, కిందటి సిరీస్‌లలో ఇంగ్లండ్ గడ్డపై అవమానకర రీతిలో పరాజయం పాలైన భారత్ ఈసారి మెరుగైన ఆటను కనబరచాలనే లక్షంతో కనిపిస్తోంది. టెస్టుల్లో నంబర్‌వన్‌గా ఉన్న భారత్ కొంతకాలంగా నిలకడైన విజయాలు సాధిస్తోంది. అంతేగాక గతంతో పోల్చితే ఈసారి భారత్ బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో చాలా బలంగా ఉంది. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే ఆటగాళ్లకు జట్టులో కొదవలేదు. ఇంగ్లండ్‌ను కూడా తక్కువ అంచన వేయలేం. ఆ జట్టులో ప్రపంచ స్థాయి బ్యాట్స్‌మెన్, బౌలర్లు ఉన్నారు. జో రూట్, బట్లర్, బైర్‌స్టోతో అలిస్టర్ కుక్ తదితరులతో ఇంగ్లండ్ బ్యాటింగ్‌లో చాలా బలంగా ఉంది. అంతేగాక జేమ్స్ అండర్సన్, స్టువర్ట్ బ్రాడ్, బెన్ స్టోక్స్‌లతో బౌలింగ్‌లోనూ పటిష్టంగా కనిపిస్తోంది. ఇరు జట్లలోనూ ప్రతిభావంతులైన ఆటగాళ్లు ఉండడంతో సిరీస్ నువ్వానేనా అన్నట్టు సాగడం ఖాయం.
రాహుల్, విజయ్‌లకే ఛాన్స్…
ఈ మ్యాచ్‌లో లోకేష్ రాహుల్, మురళీ విజయ్‌లు ఓపెనర్లుగా దిగే అవకాశాలు అధికంగా ఉన్నాయి. సన్నాహక మ్యాచ్‌లో ఇటు రాహుల్, అటు మురళీ విజయ్‌లు మెరుగ్గా రాణించడమే దీనికి ప్రధాన కారణం. ప్రాక్టీస్ మ్యాచ్‌లో ఓపెనర్‌గా దిగిన ధావన్ ఆడిన రెండు ఇన్నింగ్స్‌లలోనూ ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు. అంతేగాక టి20, వన్డే సిరీస్‌లలో కూడా ఆశించిన స్థాయిలో రాణించలేక పోయాడు. దీంతో పాటు బౌన్సీ పిచ్‌లపై రికార్డు బాగా లేక పోవడంతో ధావన్ పెవిలియన్‌కే పరిమితం అయ్యే అవకాశాలున్నాయి. ఈ పరిస్థితుల్లో రాహుల్, విజయ్‌లు ఇన్నింగ్స్‌ను ప్రారంభించడం దాదాపు ఖాయమనే చెప్పాలి. ఇక, వీరిద్దరూ మెరుగైన ఆరంభాన్ని ఇవ్వాల్సిన అవసరం ఎంతైన ఉంది. వీరు అందించే శుభారంభంపైనే జట్టు భారీ స్కోరు ఆధారపడి ఉంటుందని చెప్పొచ్చు. ఇక, కిందటి ఇంగ్లండ్ పర్యటనలో మురళీ విజయ్ నిలకడగా రాణించాడు. ఈసారి కూడా జట్టు అతని నుంచి ఇటువంటి ప్రదర్శనే ఆశిస్తోంది. రాహుల్ కూడా ఫాంలో ఉండడంతో మంచి శుభారంభం లభిస్తుందనే నమ్మకంతో జట్టు యాజమాన్యం ఉంది.
అందరి కళ్లు కోహ్లిపైనే…
ఇక, సిరీస్‌లో అందరి కళ్లు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లిపైనే నిలిచాయి. కిందటి ఇంగ్లండ్ సిరీస్‌లో విరాట్ చెత్త బ్యాటింగ్‌తో విమర్శలకు గురయ్యాడు. ఆడిన నాలుగు మ్యాచుల్లో ఒక్కసారి కూడా 50 పరుగుల మార్క్‌ను అందుకోలేక పోయాడు. 8 ఇన్నింగ్స్‌లలో కలిపి 150 పరుగులు కూడా సాధించలేదు. దీంతో ఇంటాబయట అప్పట్లో విమర్శలను ఎదుర్కొన్నాడు. కానీ, కెప్టెన్సీ చేపట్టిన తర్వాత కోహ్లి టెస్టుల్లో ఆకాశమే హద్దుగా చెలరేగి పోతున్నాడు. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, శ్రీలంక గడ్డపై పరుగుల వరద పారించాడు. ప్రతి సిరీస్‌లోనూ వరుస సెంచరీలతో హోరెత్తిస్తున్నాడు. ఈసారి కూడా ఇదే జోరును కొనసాగించాలనే లక్షంతో ఉన్నాడు. ఇంగ్లండ్ గడ్డపై ఉన్న చెత్త రికార్డును చెరిపేయాలనే లక్షంతో కోహ్లి సిరీస్‌కు సిద్ధమయ్యాడు. ఎటువంటి బౌలింగ్ లైనప్‌కైన సమస్యలు సృష్టించే సత్తా కోహ్లి సొంతం. ఈ పరిస్థితుల్లో కోహ్లి చెలరేగితే ఇంగ్లండ్‌కు కష్టాలు ఖాయమని విశ్లేషకులు తేల్చి చెబుతున్నారు. భారత్ కూడా విరాట్ నుంచి మెరుగైన బ్యాటింగ్‌ను ఆశిస్తోంది. కోహ్లి తన స్థాయికి తగ్గ బ్యాటింగ్‌ను కనబరిస్తే ఇంగ్లండ్‌ను ఓడించడం భారత్‌కు అసాధ్యమేమి కాదు.
ఇద్దరు కీలకం..
మరోవైపు సిరీస్‌లో భారత్ గెలుపు ఓటములు ఎక్కువగా ఇద్దరు ఆటగాళ్లపైనే ఆధారపడి ఉన్నాయంటే అతిశయోక్తి లేదు. వారిలో ఒకరూ ది నయా వాల్ చటేశ్వర్ పుజారా కాగా, మరోకరూ నిలకడైన ఆటకు మరో పేరుగా చెప్పుకునే అజింక్య రహానె. వీరిద్దరూ సిరీస్‌లో జట్టుకు కీలకంగా మారారు. విదేశి సిరీస్‌లలో రహానెకు అసాధారణ రికార్డు ఉంది. ముఖ్యంగా ఫాస్ట్ పిచ్‌లపై నిలకడగా ఆడడంలో రహానె ఎవరూ సాటిరారు. కొంతకాలంగా వరుస వైఫల్యాలు చవిచూస్తున్న రహానె ఇంగ్లండ్‌పై రాణించడం ద్వారా మళ్లీ గాడిలో పడాలని తహతహలాడుతున్నాడు. పుజారా కూడా ఇదే లక్షంతో ఉన్నారు. భారత్ ఇటీవల సాధించిన విజయాల్లో వీరిద్దరి పాత్ర చాలా కీలకమనే చెప్పాలి. రహానె, విజయ్, పుజారా, కోహ్లిలు నిలకడగా రాణిస్తూ పలు టెస్టు సిరీస్‌లలో భారత్‌ను గెలిపించారు. కాగా, ఈ సిరీస్‌లో కూడా రహానె, పుజారాలపై భారత్ భారీ ఆశలు పెట్టుకుంది. కాగా, ఇద్దరి ఫాం జట్టును కలవరానికి గురి చేస్తోంది. ప్రాక్టీస్ మ్యాచ్‌లో పుజారా రెండు ఇన్నింగ్స్‌లలోనూ విఫలమయ్యాడు. అయితే తొలి టెస్టులో సత్తా చాటాలనే పట్టుదలతో ఉన్నాడు. కాగా, రహానె సన్నాహక మ్యాచ్‌లో పర్వాలేదనిపించాడు. ఈసారి మెరుగైన బ్యాటింగ్‌తో జట్టుకు అండగా నిలువాలనే లక్షంతో సిద్ధమయ్యాడు. రవిచంద్రన్ అశ్విన్, దినేష్ కార్తీక్, హార్దిక్ పాండ్య, రవీంద్ర జడేజా తదితరులతో భారత బ్యాటింగ్ చాలా బలంగా ఉంది. ఉమేశ్ యాదవ్, మహ్మద్ షమిలు కూడా మంచి ఇన్నింగ్స్ ఆడే సత్తా కలిగినవారే. దీంతో భారత్‌కు బ్యాటింగ్‌లో ఢోకా లేదనే చెప్పొచ్చు.
దీటైన లైనప్..
బౌలింగ్‌లో కూడా భారత్ చాలా బలంగా ఉంది. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే ఫాస్ట్ బౌలర్లు, స్పిన్నర్లు భారత్‌కు అందుబాటులో ఉన్నారు. ఇషాంత్ శర్మ, మహ్మద్ షమి, ఉమేశ్ యాదవ్‌లతో కూడా ఫాస్ట్ బౌలింగ్ త్రయం ఎంతటి బ్యాటింగ్ లైనప్‌కైన సమస్యలు సృష్టించడం తథ్యం. ఫాస్ట్ బౌలింగ్‌కు అనుకూలించే ఇంగ్లండ్ పిచ్‌లపై ఈ ముగ్గురు చెలరేగే అవకాశాలున్నాయి. ప్రాక్టీస్ మ్యాచ్‌లో ఇషాంత్, ఉమేశ్‌లు ఇప్పటికే సత్తా చాటారు. తొలి టెస్టుకు ఆతిథ్యమిస్తున్న ఎడ్జ్‌బాస్టన్ గ్రౌండ్‌లో భారత ఫాస్ట్ బౌలర్లు మెరుగైన ప్రదర్శన ఇవ్వడం ఖాయమని విశ్లేషకులు తేల్చి చెబుతున్నారు. వీరితో పాటు హార్దిక్ పాండ్య ఉండనే ఉన్నాడు. అయితే కుల్దీప్‌ను బరిలోకి దించితే పాండ్య పెవిలియన్‌కే పరిమితం కాక తప్పదు. ఇక, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాలు జట్టుకు కీలకంగా మారారు. ముఖ్యంగా ప్రపంచంలోనే అత్యుత్తమ స్పిన్నర్‌గా, మ్యాచ్ విన్నర్‌గా పేరు తెచ్చుకున్న అశ్విన్‌పై జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. ఈ మ్యాచ్‌లో అశ్విన్ విజృంభిస్తే ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్‌కు కష్టాలు ఖాయం. కాగా, కుల్దీప్, జడేజా, పాండ్యల మధ్య తుది జట్టులో చోటు ఎవరికి దక్కుతుందో ఇంకా తేలలేదు. కుల్దీప్ దిగితే జడేజా పెవిలియన్‌కే పరిమితం కాక తప్పదు.
చారిత్రక విజయం కోసం…

englnd
ఇదిలావుండగా చారిత్రక 1000వ మ్యాచ్ ఆడుతున్న ఆతిథ్య ఇంగ్లండ్ తొలి టెస్టులో విజయం సాధించాలనే పట్టుదలతో ఉంది. భారత్‌పై తిరుగులేని రికార్డు కలిగిన ఇంగ్లండ్ ఈసారి కూడా ఆ సంప్రదాయాన్ని కొనసాగించాలనే లక్షంతో ఉంది. కిందటిసారి సొంత గడ్డపై భారత్‌పై జరిగిన రెండు సిరీస్‌లలో కూడా ఇంగ్లండ్ భారీ విజయాలు అందుకుంది. అయితే భారత గడ్డపై మాత్రం ఇంగ్లండ్ ఘోర పరాజయాలు తప్పలేదు. అప్పట్లో ఎదురైన పరాజయాలకు ఈసారి బదులు తీర్చుకోవాలనే లక్షంతో ఇంగ్లండ్ పోరుకు సిద్ధమైంది. టెస్టు క్రికెట్ చరిత్రలోనే 1000వ మ్యాచ్ ఆడుతున్న తొలి జట్టుగా ఇంగ్లండ్ రికార్డు సృష్టించనుంది. ఈ చారిత్రక మ్యాచ్‌లో గెలిచి తీపి జ్ఞాపకంగా ఉంచుకోవాలనే లక్షంతో ఉంది.
తిరుగులేదు…
బ్యాటింగ్‌లో ఇంగ్లండ్‌కు తిరుగులేదనే చెప్పాలి. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే ఆటగాళ్లకు జట్టులో కొదవలేదు. మాజీ కెప్టెన్ అలిస్టర్ కుక్, ప్రస్తుత సారథి జోయ్ రూట్, వైస్ కెప్టెన్ జోస్ బట్లర్, డేవిడ్ మలాన్‌లతో ఇంగ్లండ్ బ్యాటింగ్ చాలా బలంగా ఉంది. ప్రపంచంలోనే ఉత్తమ ఆటగాళ్లలో ఒకరిగా కొనసాగుతున్న కుక్, రూట్‌లు ఈసారి కూడా చెలరేగేందుకు సిద్ధంగా ఉన్నారు. వీరిద్దరూ విజృంభిస్తే భారత బౌలర్లకు కష్టాలు ఖాయం. ఇక, వికెట్ కీపర్ బైర్‌స్టో కూడా కొంతకాలంగా నిలకడగా రాణిస్తున్నాడు. ప్రపంచంలోనే అత్యుత్తమ ఆల్‌రౌండర్‌గా పరిగణించే బెన్ స్టోక్స్ రూపంలో జట్టుకు పదునైన అస్త్రం అందుబాటులో ఉంది. బ్యాట్‌తో, బంతితో అతనికి తిరుగులేదు. డేవిడ్ మలాన్ కూడా బ్యాటింగ్‌లో నిలకడగా రాణిస్తున్నాడు. ఇక, జోస్ బట్లర్ కొంతకాలంగా ఆకాశమే హద్దుగా చెలరేగి పోతున్నాడు. వన్డేల్లో మెరుపు బ్యాటింగ్‌తో జట్టుకు సిరీస్ సాధించి పెట్టాడు. టెస్టుల్లోనూ సత్తా చాటాలనే పట్టుదలతో కనిపిస్తున్నాడు. మరోవైపు ప్రపంచంలోనే అత్యుత్తమ ఫాస్ట్ బౌలర్లుగా కొనసాగుతున్న స్టువర్ట్ బ్రాడ్, జేమ్స్ అండర్సన్‌లు ఉండనే ఉన్నారు. టెస్టుల్లో వీరికి అసాధారణ రికార్డు ఉంది. ఇంగ్లండ్ సాధిస్తున్న విజయాల్లో వీరిద్దరూ చాలా కీలక పాత్ర పోషిస్తున్నారు. భారత్‌పై కూడా చెలరేగేందుకు సిద్ధంగా ఉన్నారు. ఆదిల్ రషీద్ రూపంలో మరో మెరుగైన అస్త్రం ఇంగ్లండ్‌కు అందుబాటులో ఉంది. ఆదిల్ చెలరేగితే భారత బ్యాట్స్‌మెన్‌కు కష్టాలు ఖాయం. కాగా, రెండు జట్లు కూడా విజయమే లక్షంగా పెట్టుకోవడంతో ఐదు మ్యాచ్‌లు కూడా హోరాహోరీగా సాగడం ఖాయమని విశ్లేషకులు అంటున్నారు. బలబలాల్లో సమవుజ్జీలుగా కనిపిస్తున్న భారత్, ఇంగ్లండ్‌లలో ఎవరూ సిరీస్ గెలుస్తారో ముందే చెప్పడం చాలా కష్టం. బరిలోకి దిగితే కానీ పరిస్థితి ఎలా ఉంటుందో అంచనా వేయలేం.