Home ఎడిటోరియల్ దూరమవుతున్నరష్యా?

దూరమవుతున్నరష్యా?

ed

సోవియట్ యూనియన్ కాలం నుంచి భారతదేశానికి రష్యాతో బలమైన స్నేహసంబంధాలున్నాయి. కాని ఇటీవలి అంతర్జాతీయ పరిణామాలను పరిశీలిస్తుంటే రష్యా మనకు దూరమవుతుందా అనిపిస్తోంది. అమెరికాతో పాటు అనేక పాశ్చాత్యదేశాలు దాదాపు 126 మంది రష్యా దౌత్యవేత్తలను బహిష్కరించాయి. రష్యాకు చెందిన మాజీ గూఢచారి, ఆయన కుమార్తె ఇద్దరిని విషవాయువు ప్రయోగించి బ్రిటన్ లో హతమార్చే ప్రయత్నం జరిగింది. ఈ సంఘటన తర్వాత ఈ బహిష్కరణలు జరిగాయి. రెండవ ప్రపంచయుద్ధం నాటి వాతావరణం మరలా అలుముకుంటోందా అనే అభిప్రాయానికి లేశమైన తావు కలగడం సహజం. అమెరికాతో పాటు 18 దేశాలు రష్యా దౌత్యవేత్తలను బహిష్కరిస్తే, యూరపుకు చెందిన ఆస్ట్రియా మాత్రం తటస్థంగా ఉంది.
రష్యాకు చెందిన రిటైర్డ్ మిలిటరీ ఇంటిలిజెన్స్ అధికారి 66 సంవత్సరాల స్క్రిపాల్ ఆయన కుమార్తె యూలియాలపై విషవాయు ప్రయోగం బ్రిటన్ లో జరిగింది. రెండవ ప్రపంచయుద్ధం తర్వాత ఇలా విషవాయు ప్రయోగం ఇదే మొదటిసారి. డబుల్ ఏజెంట్ ను హతమార్చడానికి రష్యా ప్రయత్నించినందువల్ల అమెరికా దాని మిత్రదేశాలు కలిసి రష్యా దౌత్యవేత్తలను బహిష్కరించాయి. అమెరికాతోను, రష్యాతోను సంబంధాలు కలిగి ఉన్న ఇండియాకు మాత్రం ఈ విషయమై అమెరికా ఎలాంటి సందేశమూ పంపలేదు. ఇండియాతో తమకు పటిష్టమైన సంబంధాలున్నాయని, ఇండియాకు ఈ విషయమై ఎలాంటి సందేశమూ పంపడం లేదని అమెరికా అధికారులు అన్నారు. అమెరికా పాశ్చాత్యదేశాలు తీసుకున్న చర్యకు సమానమైన స్థాయిలో రష్యా ప్రతిస్పందించింది. అమెరికాకు చెందిన 60 మంది దౌత్యవేత్తలతో సహా పాశ్చాత్యదేశాలు ఎంతమంది రష్యా దౌత్యవేత్తలను బహిష్కరించాయో తామూ అంతే సంఖ్యలో బహిష్కరిస్తున్నామని ప్రకటించింది.
అమెరికా రష్యాల మధ్య ఇప్పుడు సంబంధాలు దిగజారుతున్నాయి. రష్యాలో పుతిన్ మరోసారి ఎన్నికయ్యాడు. ఈసారి 76 శాతం ఓట్లతో … మరో ఆరు సంవత్సరాల పాటు రష్యా పగ్గాలు ఆయన చేతుల్లోనే ఉంటాయి. స్టాలిన్ తర్వాత సుదీర్ఘకాలం అధికారంలో కొనసాగిన నాయకుడు పుతిన్. నిజానికి ఈ ఎన్నికల్లో ఆయన తప్ప మరెవ్వరూ గెలిచే అవకాశం కూడా లేదు. ఆయనకు పోటీగా ఉన్న ముఖ్యమైన నాయకుడు అలెక్సీ నవాల్నీ ఎన్నికల్లో పాల్గొనకుండా నిషేధం, అణిచివేతలతో పుతిన్ తిరిగి అధికారంలోకి వచ్చారన్నది అందరికీ తెలిసిన వాస్తవమే. అమెరికా పెత్తనాన్ని అడ్డుకునే నాయకుడిగాను, రష్యాను మరోసారి గొప్పదేశంగా నిలబెట్టే నాయకుడిగాను ఆయనకు రష్యన్లలో పేరున్న మాట కూడా వాస్తవమే. విచిత్రమేమిటంటే, మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనేదే అమెరికాలో ట్రంప్ నినాదం కూడా.
ఇండియా ఫస్ట్ అని చెప్పిన భారత ప్రధాని నరేంద్రమోడీ మాటలు కూడా ఈ సందర్భంగా గుర్తొస్తాయి. మరోవైపు చైనాలో జింగ్ పింగ్ జీవితకాల అధ్యక్షుడిగా మారిపోయాడు. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే ప్రస్తుత ప్రపంచ రాజకీయాల్లో నియంతృత్వం బలపడుతున్న సూచనలున్నాయి. పుతిన్ అధికారంలోకి రాగానే ప్రధాని మోడీ ఆయన్ను అభినందిస్తూ ట్వీట్ చేశారు. కాని మారుతున్న ప్రపంచ రాజకీయాల తీరుతెన్నులు భారత నాయకులు గమనించడం అవసరం.
గత సంవత్సరం జూన్‌లో భారత ప్రధాని రష్యాను సందర్శించారు. ఆ తర్వాత రష్యా చైనా యుద్ధనౌకలు కలిసి బాల్టిక్ సముద్రంలో విన్యాసాలు చేశాయి. చైనా అధ్యక్షుడు రష్యా సందర్శించాడు. రష్యా ఆయనకు ఆర్డర్ ఆఫ్ సెయింట్ అండ్రూ బిరుదుతో సత్కరించింది. చైనా, రష్యాలు దగ్గరవుతుంటే మరోవైపు రష్యాకు ఇండియాకు దూరం పెరుగుతుందన్నది గమనించాలి. అమెరికాకు దగ్గరయ్యే ప్రయత్నాలు రష్యాను దూరం చేస్తున్నాయా అన్నది కూడా గమనించాలి.
మరోవైపు రష్యా పాకిస్తాన్ వైపు కూడా మొగ్గు చూపిస్తుందన్నది మరిచిపోరాదు. చైనాతో దగ్గరవ్వడానికి పాకిస్తాన్ పట్ల మెతగ్గా వ్యవహరిస్తుండవచ్చు. కశ్మీర్ సమస్యపై రష్యా అనేకసార్లు ఐక్యరాజ్యసమితిలో భారతదేశానికి అనుకూలంగా వీటో ప్రయోగించింది. కాని నేడు పరిస్థితి మారుతుందనిపిస్తోంది. డిసెంబరులో ఇస్లామాబాద్ లో జరిగిన ఆరు దేశాల స్పీకర్ల సమావేశం సంయుక్త తీర్మానంలో కశ్మీర్ విషయంలో పాకిస్తాన్ వాదనను సమర్ధింస్తూ అఫ్గనిస్తాన్, చైనా, ఈరాన్, పాకిస్తాన్, రష్యా, టర్కీ సంతకాలు చేశాయి.
ఐక్యరాజ్యసమితి భద్రతామండలి తీర్మానాల ప్రకారం భారత పాకిస్తాన్ దేశాలు శాంతియుతంగా కశ్మీరు సమస్యను పరిష్కరించుకోవాలన్న మాటలు ఈ తీర్మానంలో ఉన్నాయి. అంతేకాదు, డిసెంబరులో రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ భారత పర్యటనకు వచ్చినప్పుడు చైనా ప్రాజెక్టు బెల్ట్ అండ్ రోడ్డును సమర్ధిస్తూ మాట్లాడారు. ఈ ప్రాజెక్టు విషయంలో భారతదేశం తన ప్రయోజనాలకు అనుగుణంగా సహకరించవచ్చని అన్నారు. అమెరికా, ఇండియా, జపాన్, ఆస్ట్రేలియా నాలుగు దేశాలు ఇండో పసిఫిక్ కూటమి విషయంలోను తన అసంతృప్తిని ఆయన దాచుకోలేదు.
అమెరికా ఎన్నికల్లో ట్రంప్ కు రష్యా సహకరించిందన్న ఆరోపణల తర్వాత ట్రంప్ ప్రభుత్వం రష్యా విషయమై తీసుకుంటున్న కఠిన నిర్ణయాలు, పాశ్చాత్యదేశాల వైఖరి వీటన్నింటి దృష్ట్యా రష్యాకు చైనా అవసరం ఉంది. ప్రస్తుతం రష్యా, చైనాల మధ్య పటిష్టమైన చరిత్రలోనే ఎన్నడూ లేనంత దగ్గరి సంబంధాలున్నాయని స్వయంగా చైనా అధ్యక్షుడు చెప్పాడు. రష్యా తన ప్రాబల్యం పెంచుకోడానికి ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఆర్ధిక వ్యవస్థ సహకరించేలా లేదు. కాబట్టి చైనాపై చాలా విషయాల్లో ఆధారపడక తప్పదు. అమెరికా నాయకత్వంలోని పాశ్చాత్యదేశాలను అడ్డుకోవడం, ఏకధృవ ప్రపంచంగా అమెరికా పెత్తనాన్ని అడ్డుకోవడం ముఖ్యమని రష్యా భావిస్తోంది. చైనా కన్నా ప్రపంచ రాజకీయాల్లో రష్యా వల్లనే ప్రమాదం ఎక్కువని పాశ్చాత్యదేశాలు భావిస్తున్నాయి. చైనా వన్ రోడ్ ప్రాజెక్టుకు పాకిస్తాన్ పూర్తి సహకారం అందిస్తోంది. అందువల్ల రష్యా కూడా పాకిస్తాన్ విషయంలో మెతగ్గా వ్యవహరిస్తోంది.
ఈ పరిస్థితి ఇండియాకు ఇబ్బందికరమైనది. పొరుగున చైనా విస్తరణ ప్రయత్నాల పట్ల ఇండియా అప్రమత్తంగా ఉండవలసి ఉంది. దక్షిణాసియాలో చైనా తన పట్టు పెంచుకుంటూ పోతోంది. హిందూ మహాసముద్రంలో చైనా బలం పెరుగుతోంది. చైనా, పాకిస్తాన్‌ల మధ్య స్నేహం ఇండియాకు కొత్త తలనొప్పిగా మారింది. పాశ్చాత్యదేశాలను ఢీ కొనడానికి రష్యా, చైనా పట్ల మొగ్గు చూపించడం వల్ల రష్యాకు ఎలాంటి నష్టమూ లేదు. కాని చైనాతో స్నేహం కోసం రష్యా పాకిస్తాన్ పట్ల మెతగ్గా వ్యవహరించడం ఇండియాకు ఇబ్బందికరంగా మారవచ్చు. పాకిస్తాన్ తో సంయుక్త సైనిక విన్యాసాలు రష్యా నిర్వహించడం దీన్నే సూచిస్తుంది. అది కూడా యురిలో టెర్రరిస్టుల దాడి తర్వాత ఈ సైనిక విన్యాసాలు జరిగాయి. కాని అఫ్గనిస్తాన్ లో పాకిస్తాన్ ప్రయోజనాలను కాపాడ్డానికి రష్యా ప్రయత్నిస్తుందని విశ్లేషకుల అభిప్రాయం.
రెండు ముఖ్యమైన సమస్యలు ఈ సందర్భంగా మనం దృష్టిలో ఉంచుకోవాలి. న్యూక్లియర్ సప్లయర్ గ్రూపులో భారతదేశం సభ్యదేశంగా మారాలన్న ప్రయత్నాలకు సంబంధించి చైనా తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఈ విషయంలో భారతదేశానికి రష్యా మద్దతుగా మాట్లాడుతున్నట్లు కనిపించినా, భారతదేశాన్ని సభ్యదేశంగా అనుమతిస్తున్నప్పుడు పాకిస్తాన్‌ను కూడా అనుమతించాలన్న సూచన లోపాయికారిగా అందులో ఉంది. రెండవ సమస్య చైనా వన్ బెల్టు రోడ్డు విషయంలో ఇండియాపై పరోక్షంగా ఒత్తిడి తీసుకువచ్చే ప్రయత్నాలు రష్యా చేస్తోంది. ఈ పరిస్థితుల్లో రష్యా, చైనా, పాకిస్తాన్ ల మధ్య మైత్రి పెరుగుతుందన్నది కనబడుతున్న వాస్తవం.
భారతదేశానికి రష్యాతో స్నేహ సంబంధాలు పటిష్టంగా ఉన్నాయన్నది నిజమే, కాని ఈ సంబంధాలు చాలా వరకు రక్షణ రంగానికి సంబంధించినవి మాత్రమే. గ్లోబల్ ఎకానమిలో భారత రష్యాదేశాల మధ్య వాణిజ్య, ఆర్ధిక సంబంధాలు అమెరికాతో పోల్చుకుంటే తక్కువే. రష్యాతో మన స్నేహం చాలా పాతదని చెప్పుకోవడం వల్ల సెంటిమెంటు వాదనలు ప్రపంచ రాజకీయాల్లో పనికి రావు. పుతిన్ నాయకత్వంలో రష్యా ఇప్పుడు కొత్త రష్యాగా భావించాలి. అమెరికా పాశ్చాత్యదేశాలను ఢీకొనడానికి పుతిన్ వెనుకాడ్డం లేదు. సిరియాలో జరిగిందిదే. టర్కీ నాటో సభ్యదేశమైనా రష్యాతో కలిసి పనిచేస్తోంది. ఇరాన్ తోను రష్యా సంబంధాలు మెరుగ్గా ఉన్నాయి.
సిరియాలో అమెరికా చాలా చోట్ల ఎదురుదెబ్బలు తినడానికి కారణం రష్యాయే. పాశ్చాత్యదేశాలతో ఘర్షణాత్మక వైఖరి అవలంబిస్తున్న పుతిన్ పట్ల ఇండియా ఎలా వ్యవహరించాలి. అమెరికా, పాశ్చాత్యదేశాలతో ఇండియాకు ఉన్న సంబంధాల దృష్ట్యా ఇండియా రష్యా పట్ల మొగ్గు చూపించడం కష్టం. దాదాపు రెండు దశాబ్దాల క్రితం 1998లో రష్యా ప్రధాని యూజెనీ ప్రమికోవ్ భారతదేశాన్ని సందర్శించినప్పుడు చైనా, రష్యా, ఇండియాలు కలిసి పాశ్చాత్య పెత్తనాన్ని అడ్డుకోవాలని చెప్పారు. కాని ఇప్పుడు చైనా, ఇండియా ఒకే వేదికపై వచ్చి అమెరికాను అడ్డుకునే ప్రయత్నాలు చేయడం అన్నది కలలో కూడా సాధ్యమయ్యే విషయం కాదు.
డోక్లామ్ విషయంలో రష్యా మౌనం చాలా వాస్తవాలను చెబుతోంది. ఇప్పటి రష్యా పాత రష్యా కాదు. ప్రపంచ రాజకీయాల్లో రష్యా ఘర్షణాత్మక వైఖరి స్పష్టంగా కనబడుతోంది. అమెరికా చేసిన బహిష్కరణలకు జవాబుగా అమెరికా దౌత్యవేత్తలను బహిష్కరించడం మారుతున్న రాజకీయాలకు సూచన. మరోసారి ప్రపంచంలో అగ్రరాజ్యాల మధ్య ప్రచ్ఛన్నయుద్ధ వాతావరణం అలుముకుంటుంది. ప్రచ్ఛన్నయుద్ధ వాతావరణంలో భారతదేశం పలుకుబడిని పెంచింది అలీన విధానమే. మరోసారి నెహ్రూ చెప్పిన అలీన విధానానికి కట్టుబడడమే మంచిది.