Home ఎడిటోరియల్ అవినీతి లేని సమాజంతోనే భారతావనికి భవిష్యత్

అవినీతి లేని సమాజంతోనే భారతావనికి భవిష్యత్

corruption

గాంధీ మహాత్ముడు కలగన్న ఆదర్శ భారతదేశాన్ని సాధించడానికి దేశ పౌరులంతా ఒక్క తాటిపై నిలిచి సమైక్యంగా మహోద్యమం సాగించాలి. దుర్భర దారిద్య్రం, అవినీతి, నిరక్షరాస్యత, నల్లధనం, స్త్రీ పురుష విచక్షణ, బలహీన వర్గాలపై జరుగుతున్న దాడులు, పారిశుద్ధ లేమి వంటివి దేశాన్ని పట్టి పీడిస్తున్న సమస్యలపై భారత ప్రజలంతా సంఘటితంగా పోరాటం చెయ్యాలి. దేశ ప్రగతికి అవరోధంగా వున్న ఈ సమస్యలు స్వాతంత్య్రం వచ్చి 7 దశాబ్దాలు దాటిన తర్వాత కూడా నేటికీ ఏదో స్థాయిలో సజీవంగా ఉండటం దేశాభివృద్ధికి అవరోధంగా పరిణమించింది. ఎలాటి విచక్షణకు, అసమానతలకు తావులేని రామరాజ్యాన్ని గాంధీజీ కోరుకున్నారు. మహాత్ముడి కలలను నిజం చేయడానికి జాతి జనులంతా పట్టుదలతో కృషి చేయాలి.
మహాత్ముడి ఆదర్శాలను నిజం చెయ్యడానికి దేశంలో అన్ని రంగాలలో ఎదురవుతున్న అవినీతికి వ్యతిరేకంగా దేశ పౌరులంతా సంఘటితంగా ఉద్యమించాలి. రాజకీయ అవినీతి, ప్రభుత్వ, వ్యాపార రంగాలలోని అవినీతిని నిర్మూలించడానికి కఠిన చట్టాలు రూపొందించాలి. అవినీతికి పాల్పడ్డవారు ఎంత పెద్ద హోదాలో వున్నా త్వరగా విచారణ జరిపి న్యాయస్థానాలలో కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలి. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 ప్రకారం చట్టం ముందు భారత పౌరులందరు సమానులే. పౌరులందరికి హోదాతో నిమిత్తం లేకుండా సమాన హక్కులు, సమాన అవకాశాలు కల్పించవలసిన బాధ్యత ప్రభుత్వానిదేనని స్పష్టంగా
చెప్పబడింది.
గత 7దశాబ్దాల నుండి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్ ద్వారా వివిధ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తున్నప్పటికీ దానికి అనుగుణంగా ఆచరణలో అభివృద్ధి జరగటం లేదు. ఇప్పటికి దేశంలో సుమారు 22 శాతం ప్రజలు దారిద్య్ర రేఖకు దిగువనే జీవిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి ఏటా కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నప్పటికీ దేశంలోని మెజార్టి శాతం ప్రజలు పేదరికం, నిరుద్యోగం, ఆదాయ, ఆర్థిక అసమానతలు ఎదుర్కొంటున్నారు. దీనికి మన దేశ రాజకీయ, ఆర్థిక, సామాజిక వ్యవస్థలో, ప్రభుత్వ యంత్రాంగంలో కొన్ని దశాబ్దాలుగా వేళ్లూనుకుపోయిన అవినీతే ప్రధాన కారణం.
ప్రజల సంక్షేమానికి అభివృద్ధికి ఖర్చు పెడుతున్న నిధుల లో సుమారు 3040శాతం దుర్వినియోగం అవుతున్నది. అందువల్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్దేశించిన లక్షాలు నెరవేరడం లేదు.
తెలంగాణ రాష్ట్రంలో కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సాహసోపేతమైన, ఆదర్శమైన నిర్ణయాలు తీసుకొని ఆధునిక పరిపాలనా విధానాలు రూపొందించి పేదలు బడుగు బలహీన వర్గాలు, రైతులు, చేనేత వృత్తులు, చేతివృత్తులు, కులవృత్తుల వారి సంక్షేమానికి రాష్ట్ర బడ్జెట్‌లో అధికశాతం నిధులు కేటాయించి పై వర్గాల సంక్షేమానికి గత 3సం॥ల నుండి వివిధ పథకాలు అమలు చేస్తున్నారు.
పేద, బలహీన, సామాన్య వర్గాల ప్రజల ఆదాయాలు పెరిగాయి. ఇందువల్ల మన తెలంగాణ ముఖ్యమంత్రి నూతన ఆర్థిక విధానాలు రూపొందించి అమలు చెయ్యడం వల్ల రాష్ట్ర వృద్ధి రేటు 21.7 నమోదైంది. దేశంలో మిగతా రాష్ట్రాల కన్నా వేగంగా తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందడం వలన అత్యధిక వృద్ధి రేటు సాధించగలిగాము.
ముఖ్యమంత్రి కెసిఆర్ అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే కరెంటు సమస్యను అధిగమించి కరెంటు కోతలు లేని రాష్ట్రంగా చేసి 24గం॥లు ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, రైతులకు కోటి ఎకరాలకు సాగునీరు అందించే భారీ నీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణం, ఆసరా పెన్షన్లు, ఒంటరి మహిళలకు, చేనేత కార్మికులకు పెన్షన్లు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, విద్యార్థులకు ఫీజు రీ ఇంబర్స్‌మెంట్, గొల్ల కురుమలకు 75 శాతం సబ్సిడీపై గొర్రె ల పంపకం, వచ్చే మే నెల నుండి రైతులందరికీ ఎకరానికి రూ.8000/-లు పెట్టుబడి ఖర్చులు అందచేయనుండడం, బడుగు, బలహీన వర్గాలు, అన్ని కులవృత్తులకు సబ్సిడీలు, ఇతర ఆదర్శ పథకాలు తెలంగాణ రాష్ట్రప్రభుత్వం అమలు చేస్తున్నది.
ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం నల్లధనాన్ని నిర్మూలించడానికి, అవినీతిని తొలగించడానికి తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయం సాహసోపేతమైనది.
నరేంద్రమోడీ ప్రభుత్వం తీసుకున్న ఇంకొక పెద్ద నిర్ణయం వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) అమలు. దీనితో దేశం మొత్తం ఏకీకృత పన్ను విధానం అమలవుతున్నది. జిఎస్‌టి వల్ల తాత్కాలికంగా ప్రభుత్వానికి పన్ను రాబడులు తగ్గినా దీర్ఘకాలంలో రెట్టింపై జిడిపి పెరగగలదు.
దేశంలో పూర్తిగా అవినీతిని అరికట్టాలంటే నగదు రహిత లావాదేవీలు, కాగితపు రహిత పాలన అమలు చెయ్యాలి. రూ.2000/-ల నోటును వెంటనే రద్దు చేయాలి. బినామీ ఆస్తుల నిషేధ చట్టాన్ని ప్రభుత్వం పకడ్బందీగా అమలు పరచాలి. ఉన్నతాదాయ వర్గాల ప్రజలనుండి ఎక్కువశాతం పన్ను పరిధిలోనికి తీసుకురావడానికి వస్తు, సేవల పన్ను విధింపు హేతుబద్దంగా ఉండాలి. పేద, సామాన్య ప్రజలు వినియోగించే నిత్యావసర వస్తువులపై పన్ను విధించరాదు.
నిజాయితీ, అత్యున్నత నైతిక విలువలే దీపాలుగా దేశ
ప్రజలు తమ జీవితాలను గుణాత్మకంగా తీర్చిదిద్దుకోవాలి. రాజకీయ నాయకులు, ప్రభుత్వ ఉద్యోగులు, వాణిజ్యవేత్తలు, పారిశ్రామిక వేత్తలు, వీధి వ్యాపారులు వంటి తేడాలతో నిమిత్తం లేకుండా దేశంలోని ప్రతి ఒక్కరు సమున్నత నైతిక వర్తనకు తిరుగులేని ప్రతీకలుగా నిలువాలి. బాల్యదశలోనే బలమైన నైతిక విలువలకు పునాది పడాలి.