Home అంతర్జాతీయ వార్తలు సుంకాలలో ఇండియా దండి : ట్రంప్

సుంకాలలో ఇండియా దండి : ట్రంప్

 

Donald Trump

 

వాషింగ్టన్ : భారతదేశం అత్యధిక సుంకాల దేశం అని అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ విమర్శించారు. అమెరికా ఉత్పత్తులపై వంద శాతం పన్నుల విధింపు గురించి భారత్‌పై ట్రంప్ ఇంతకు ముందు కూడా మండిపడ్డారు. అత్యంత ప్రతిష్టాత్మక హేర్లీ డేవిడ్‌సన్ మోటార్ సైకిళ్లపై కూడా భారతదేశం దండిగా సుంకాలకు దిగుతోందని ట్రంప్ విమర్శించారు. ఇక్కడ జరిగిన రిపబ్లికన్ ఎంపీల కమిటీ వార్షిక స్ప్రింగ్ డిన్నర్‌లో ట్రంప్ ప్రసంగించారు. ఇండియా ఇప్పుడు టారీఫ్ కింగ్ అయిందని, అమెరికా సరుకులపై ఎడాపెడా పన్నులు బాదేస్తున్నారని ట్రంప్ ఈ సందర్భంగా అన్నారు. భారత టారీఫ్ విధింపుల వ్యవస్థలో లోపాలు ఉన్నాయని, దీనిని తాను ప్రధాని మోడీకి పలుసార్లు చెప్పానని ట్రంప్ వెల్లడించారు.

తమ దేశపు బైక్‌లకు భారత్‌లో అత్యధికంగా సుంకాలు పడుతాయని, అయితే భారతదేశం నుంచి ఇక్కడికి వారి సైకిళ్లు పంపిస్తారని, వాటిపై ఇక్కడ సుంకం పడదని చెప్పారు. వారి ధోరణి సరిగ్గా లేదని, విపరీత స్థాయిలో వ్యవహరిస్తున్నారని, కనీసం ఇచ్చిపుచ్చుకునే ధోరణిని అయినా పాటించాలి కదా? అని ప్రశ్నించారు. ఇతర దేశాలతో వాణిజ్య సమతూకానికి తమ అధికార యంత్రాంగం అన్ని జాగ్రత్తలు తీసుకొంటోందని, చైనాతో వాణిజ్యపర చర్చలు సజావుగా సాగుతున్నాయని తెలిపారు. తమ ప్రభుత్వ ట్రేడ్ పాలసీలు సత్ఫలితాలను ఇస్తున్నాయని, ఈ దిశలో ఇప్పుడు ఇండియా టారిఫ్‌లదే సమస్యగా మారిందని తెలిపారు.

 

India is Highest Taxing Nation in the World: Trump