Home ఎడిటోరియల్ ఆరోస్థానం అందలమేనా?

ఆరోస్థానం అందలమేనా?

GSTభారతదేశం ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో ఆరవస్థానానికి చేరుకోవడం వల్ల సాధారణ పౌరుడికి ప్రయోజనాలేమిటి? నిర్మొహమాటంగా చెప్పాలంటే ఏమీ లేవు. భారతదేశంలో తలసరి ఆదాయం కన్నా ఫ్రాన్సులో తలసరి ఆదాయం ఆరు రెట్లు ఎక్కువ. ఈ వాస్తవాన్ని కాదనగలమా? తలసరి ఆదాయం విషయంలో భారతదేశం 123వ స్థానంలో ఉంది. ఫ్రాన్సు 25వ స్థానంలో ఉంది. సగటు ఫ్రెంచ్ పౌరుడికన్నా సగటు భారతీయుడు చాలా పేదవాడు. ఒక ఆర్థికవ్యవస్థ ఎంత పెద్దదన్న లెక్కలు ఆ దేశం పరిమాణం, జనాభా వగైరాలపై ఆధారపడి ఉంటుంది. ఇంత పెద్ద దేశం ఇంత పెద్ద జనాభా వల్ల సాధించే జాతీయోత్పత్తి ఎక్కువగానే ఉండాలి. కాని ఇంత పెద్ద దేశంలో ప్రతి ఒక్క పౌరుడికి ఎంత ఆదాయం లభిస్తుందన్నది దేశంలో ప్రజలు ఎంత సుభిక్షంగా ఉన్నారన్న లెక్క చెబుతుంది.

ప్రపంచబ్యాంకు 2017 సంవత్సరంలో వివిధ దేశాల ఆర్థికవ్యవస్థలకు సంబంధించి ఇచ్చిన సమాచారం ప్రకారం భారతదేశం ప్రపంచంలో ఆరవ అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా నిలిచింది. ఇంతకు ముందు ఈ స్థానంలో ఫ్రాన్స్ ఉండేది. ఇప్పుడది ఏడవస్థానానికి దిగజారింది. భారతదేశ స్థూల జాతీయోత్పత్తి అంటే జిడిపి 2.597 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది. ఫ్రాన్సు జిడిపి 2.582 ట్రిలియన్ డాలర్లు మాత్రమే. ప్రపంచబ్యాంకు డాటా ప్రకారం భారతదేశం ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థికవ్యవస్థల జాబితాలో పైకి ఎగబ్రాకింది. నరేంద్రమోడీ ప్రధానిగా పదవి స్వీకరించడం వల్లనే ఈ ఘనతను సాధించామని బిజెపి 2019 ఎన్నికల్లో చెప్పుకునే అవకాశం దొరికింది. కాని ఈ లెక్కల వ్యవహారాన్ని కాస్త నిశితంగా గమనించవలసి ఉంది. ప్రపంచంలో ఇప్పుడు భారతదేశం కన్నా పెద్ద ఆర్థికవ్యవస్థలు ఏవంటే, అమెరికా, చైనా, జపాన్, జర్మనీ, బ్రిటన్ దేశాలు.
స్థూల జాతీయోత్పత్తి లేదా జిడిపి విషయంలో మూడు సూచికలను ముఖ్యంగా దృష్టిలో పెట్టుకోవాలి. మామూలుగా జిడిపి అంటే ఒక నిర్దిష్ట కాలపరిమితిలో ఒక దేశం లేదా ఒక ప్రాంతం ఉత్పత్తి చేసిన వస్తువులు, సేవల మొత్తం విలువ. దీంతో పాటు తలసరి స్థూల జాతీయోత్పత్తి లేదా జిడిపి పర్ కాపిటా కూడా చూడడం మంచిది. అంటే మొత్తం జిడిపిని దేశజనాభాతో విభజించడం. దీనివల్ల మనకు జీవనప్రమాణాలు తెలుస్తాయి.
ప్రపంచబ్యాంకు 2017 డేటా ప్రకారం ఇండియాలో తలసరి జిడిపి 1,940 డాలర్లు. జిడిపిలో మరో లెక్క జిడిపి పర్చేజంగ్ పవర్ పారిటీ లెక్క (కొనుగోలు శక్తి ప్రకారం జిడిపి). అంతర్జాతీయ మారకం రేటుల ప్రకారం తలసరి ఆదాయం లెక్కించడం ఉంటుంది. ఒక దేశం అత్యధిక జిడిపి కలిగి ఉన్నప్పటికీ జీవనప్రమాణాలు కూడా అత్యధికంగా లేకపోతే ఆ దేశం మిగిలిన దేశాల కన్నా జిడిపి విషయంలో వెనుకబడినట్లే. భారతదేశంలో జీవనప్రమాణాలు చాలా తక్కువ కాబట్టి ఈ విషయంలో అమెరికా, చైనాల తర్వాతి స్థానంలో కనబడుతుంది. ఇక్కడ మనం గమనించవలసిన విషయమేమంటే, దేశ జనాభా దాదాపు 135 కోట్లు. చైనా తర్వాత అతిపెద్ద జనాభా. ఒక్క చైనాను వదిలేస్తే ఈ జాబితాలో మిగిలిన దేశాల జనాభా మన దేశ జనాభాలో సగం కూడా ఉండదు.
అమెరికా జనాభా కేవలం 32 కోట్ల 57 లక్షలు. ఫ్రాన్సు జనాభా అయితే కేవలం ఆరుకోట్ల అరవై తొమ్మిది లక్షలు. 2016లోనే ఫ్రాన్సు జిడిపి పర్ కాపిటా 36,854 డాలర్లు. ఇండియాలో ఇది కేవలం 1,940 డాలర్లు. ఈ తేడా అర్థం చేసుకోవాలి. గత 50 సంవత్సరాలుగా మనం సాధించిన ప్రగతి ఏమిటంటే, 1960లో జిడిపి పర్ కాపిటా 81.3 డాలర్లు. ఇప్పుడు 1,940 డాలర్లు. చైనా, దక్షిణ కొరియా, మలేసియా, బ్రెజిల్ వంటి అనేక దేశాలతో పోల్చితే మన ప్రగతి రేటు చాలా వెనుకబడి ఉంది.
భారతదేశం ప్రపంచ ఆర్థికవ్యవస్థల్లో ఆరవస్థానానికి చేరుకోవడం వల్ల సాధారణ పౌరుడికి ప్రయోజనాలేమిటి? నిర్మొహమాటంగా చెప్పాలంటే ఏమీ లేవు. భారతదేశంలో తలసరి ఆదాయం కన్నా ఫ్రాన్సులో తలసరి ఆదాయం ఆరు రెట్లు ఎక్కువ. ఈ వాస్తవాన్ని కాదనగలమా? తలసరి ఆదాయం విషయంలో భారతదేశం 123వ స్థానంలో ఉంది. ఫ్రాన్సు 25వ స్థానంలో ఉంది. సగటు ఫ్రెంచ్ పౌరుడికన్నా సగటు భారతీయుడు చాలా పేదవాడు. ఒక ఆర్థికవ్యవస్థ ఎంత పెద్దదన్న లెక్కలు ఆ దేశం పరిమాణం, జనాభా వగైరాలపై ఆధారపడి ఉంటుంది. ఇంత పెద్ద దేశం ఇంత పెద్ద జనాభా వల్ల సాధించే జాతీయోత్పత్తి ఎక్కువగానే ఉండాలి. కాని ఇంత పెద్ద దేశంలో ప్రతి ఒక్క పౌరుడికి ఎంత ఆదాయం లభిస్తుందన్నది దేశంలో ప్రజలు ఎంత సుభిక్షంగా ఉన్నారన్న లెక్క చెబుతుంది.
భారతదేశంలో జనాభా చాలా ఎక్కువగా ఉండడం వల్ల తలసరి ఆదాయం తక్కువగా కనిపిస్తుందని వాదించవచ్చు. కాని చైనా జనాభా మనకన్నా ఎక్కువ. చైనా జనాభా 140 కోట్ల కన్నా ఎక్కువ. అక్కడ తలసరి ఆదాయం 16,760 డాలర్లు. ప్రపంచంలో 77వ స్థానంలో ఉంది. భారతదేశం 123వ స్థానంలో ఉందని ఇంతకు ముందే చెప్పుకున్నాం. అంటే మన అభివృద్ధి రేటు ఈ దేశాలతో పోల్చితే చాలా వెనుకబడి ఉంది.
ప్రపంచంలో ఆరవ ఆర్థికవ్యవస్థగా దొరికిన ఈ కొత్త హోదా వల్ల దేశంలో ఉద్యోగావకాశాలు పెరుగుతాయా? బిజెపి ప్రభుత్వం ఈ విషయంలో చేసే వాదన విచిత్రంగా ఉంది. దేశంలో ఉద్యోగాలు తక్కువగా లేవని, కాకపోతే అసంఘటిత రంగాల్లో ఉద్యోగాలు ఉండడం వల్ల ఆ వివరాలు నమోదు కావడం లేదని వాదిస్తుంటారు. దేశంలో 80 శాతం జనాభా వ్యవసాయంపై ఆధారపడి ఉంది. దేశం స్వాతంత్య్రం పొందినప్పుడు జిడిపిలో 50 శాతం వ్యవసాయం వల్లనే సాధ్యమయ్యేది, ఇప్పుడది కేవలం 15 నుంచి 16 శాతానికి పడిపోయింది. అంటే ఉత్పత్తి పెరగలేదు. కాని ఇప్పటికి కూడా వ్యవసాయమే ప్రధాన ఉపాధిగా కొనసాగుతున్నది. దేశంలో పేదలు పేదలగానే మిగిలిపోవడానికి ఇది ఒక కారణం. దేశంలో నిరుద్యోగం పెద్ద సమస్యగా ఉందన్నది కాదనలేని నిజం.
మొన్నటి వరకు ప్రపంచంలోని పేదల్లో అత్యధికులు ఉన్న దేశం కూడా భారతదేశమే. ఇప్పుడు నైజీరియా ఆ స్ధానానికి చేరుకుంది. నైజీరియాలో 8 కోట్ల 70 లక్షల మంది నిరుపేదలుంటే, మన దేశంలో 7 కోట్ల 30 లక్షల మంది ఉన్నారని బ్రూకింగ్స్ స్టడీ ప్రకటించింది. నరేంద్రమోడీ అధికారంలోకి వచ్చినప్పుడు ఉత్పాదక రంగాన్ని అభివృద్ధి చేస్తానని అన్నారు.
భారత జిడిపిలో ఉత్పాదకరంగం, వ్యవసాయరంగాల వాటా నానాటికి తగ్గిపోతోంది. భారత ఆర్థికవ్యవస్థ పెరుగుదలకు కారణం కేవలం సేవారంగమే. 2012లో ఉత్పాదకరంగం వాటా 17.4 శాతం. 2018 నాటికి 18.1 శాతం. పెరుగుదల కేవలం నామమాత్రమే. జిడిపిలో సేవారంగం 2012లో 18.9 శాతం ఉండేది. ఇప్పుడు 21.7 శాతం అయ్యింది. అంటే కేవలం సేవారంగం మాత్రమే పెరుగుదల నమోదు చేసింది. నోట్లరద్దు చేయకుండా ఉన్నట్లయితే ఆర్థికవ్యవస్థ మరింత పెరుగుదల నమోదు చేసి ఉండేదని ఆర్థికవేత్తల అభిప్రాయం.
ఏది ఏమైనా తలసరి ఆదాయం జీవన ప్రమాణాలు చాలా తక్కువగా ఉన్నప్పుడు, నిరుద్యోగం, ఉపాధి లేమి సమస్యలు పీడిస్తున్నప్పుడు, ఉత్పాదక రంగంలో, వ్యవసాయ రంగంలో అభివృద్ధి లేనప్పుడు, ప్రపంచంలోని నిరుపేదల్లో అత్యధికులు నివసిస్తున్న రెండవదేశంగా ఉన్నప్పుడు ప్రపంచ ఆర్థికవ్యవస్థల్లో ఆరవ అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా ఈ కొత్త కిరీటం వల్ల సగటు పౌరుడికి లభించే ప్రయోజనాలేవీ లేవు. రానున్న ఎన్నికల ప్రచారంలో వాడుకోడానికి మాత్రమే ఈ ఆరోస్థానం ఉపయోగపడుతుంది.

* ఎన్.దామోదరరావు