Home ఆఫ్ బీట్ మట్టిలో మాణిక్యాలు

మట్టిలో మాణిక్యాలు

ఆస్ట్రేలియాలోని గోల్డ్ కోస్ట్ వేదికగా జరుగుతున్న 21వ కామన్‌వెల్త్ గేమ్స్‌లో భారత్ తన హవాను కొనసాగిస్తోంది. బరిలో దిగుతున్న ఆటగాళ్లు పతకాలతో దూసుకెళ్తున్నారు. తాజాగా భారత్‌కు చెందిన బాక్సర్ మేరీకోమ్ 49 కిలోల విభాగంలో స్వర్ణపతకాన్ని సొంతం చేసుకుంది. భారత బాక్సర్ గౌరవ్ సోలంకి కూడా పసిడి పతకాన్ని సాధించాడు. బాక్సింగ్‌లో 52 కిలోల కేటగిరీలో గౌరవ్ స్వర్ణ బాటపట్టాడు. షూటర్ సంజీవ్ రాజ్‌పుత్ పురుషుల 50మీ రైఫిల్ త్రీ పొజిషన్స్‌లో స్వర్ణం తెచ్చుకున్నాడు. వీరిలో చాలా మంది క్రీడాకారులు మట్టిలో మాణిక్యాలే. వీరి ఆశయాల సాధనకు ఏమాత్రం పేదరికం అడ్డుకాలేదు. సంకల్పం ముందు కష్టాలన్నీ దిగదుడుపుగా మారాయి. మొత్తం 11 రోజుల ఈ పోటీలో మొదటి 9 రోజుల్లోనే భారత అథ్లెట్లు 16 స్వర్ణాలు, 8 రజతాలు, 10 కాంస్య పతకాలతో సహా గెలిచారు. మొత్తం 34 పతకాలు సాధించి పతకాల పట్టిక మూడో స్థానంలో మన దేశం నిలిచింది. మొత్తం 221 మంది సభ్యుల జట్టుతో కామన్వెల్త్ గేమ్స్ బరిలోకి దిగిన భారత అథ్లెట్స్ కనీసం 20 బంగారు పతకాలు లక్షంగా పెట్టుకుని యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు.

గుంటూరు జిల్లాలోని స్టూవర్టుపురానికి చెందిన రాగాల వెంకట రాహుల్ కామన్వెల్త్ క్రీడల వెయిట్ లిఫ్టింగ్‌లో స్వర్ణం సాధించిన తెలుగుతేజం. తండ్రి మధు ఆశయాల్ని నిలబెట్టి ఊరికి ఓ గుర్తింపు తెచ్చాడు.  స్టూవర్టు పురం గ్రామానికున్న ప్రతికూల గుర్తింపునే మార్చేశాడు రాహుల్. పేద రికాన్ని బిడ్డల కోసం ఎదుర్కొన్నాడు రాహుల్ తండ్రి. తను కన్న కలలను తన కొడుకులతో సాకారం చేసుకునేందుకు శ్రమించాడు. తానే గురువుగా మారి కుమారులకు శిక్షణ ఇచ్చాడు. అతని కష్టం వృథా పోలేదు. కామ న్వెల్త్ క్రీడల్లో స్వర్ణం సాధించిన తొలి పురుష వెయిట్‌లిఫ్టర్‌గా గెలిచి రాహుల్ తండ్రి కోరికతీర్చాడు.   

మధ్య తరగతి వ్యక్తి అయిన రాహుల్ తండ్రి మధు ఎంతో కష్టపడి రూ.25 లక్షలతో కట్టుకున్న అందమైన ఇంటిని కొడుకుల క్రీడా భవిష్యత్తు కోసం అమ్మేశాడు. రాహుల్, వాళ్ల అమ్మ నీలిమ, సోదరుడు వరుణ్, సోదరి మధుప్రియ.. ఎవరికీ ఆ ఇల్లు అమ్మడం ఇష్టం లేదు. ఒకేసారి పెద్ద ఇంటి నుంచి పూరి గుడిసెలోకి మారడంతో ఆ కుటుంబం చాలా అవస్థలు పడింది. కటిక నేలపై కుటుంబమంతా నిద్రపోయింది. సౌకర్యాలన్నింటినీ వదలినా భవిష్యత్తు మీద ఆశతో వారంతా కష్టాలన్నిటినీ భరించారు. చివరకు రెండెకరాల పొలం కూడా అమ్ముకోవాల్సి వచ్చింది.
మధు స్వతహాగా వెయిట్‌లిఫ్టర్. కబడ్డీలో రాష్ట్రస్థాయిలో 14 బంగారు పతకాలు సాధించాడు. అయితే పేదరికం అతని ఆటకు అడ్డు వచ్చింది. వెయిట్‌లిఫ్టింగ్ కిట్ కొనాలంటే రూ.5 లక్షలు అవుతుందని తెలిసి స్థోమత లేక ఆటకు వీడ్కోలు పలికాడు. అప్పుడే అనుకున్నాడు తన సంతానాన్ని వెయిట్‌లిఫ్టింగ్ వైపు మళ్లించాలని. రాహుల్ పుట్టిన తర్వాత అతణ్ని వెయిట్‌లిఫ్టింగ్ ఛాంపియన్ చేయాలని కంకణం కట్టుకున్నాడు. చిన్న చిన్న ప్లేట్లతో ఇంట్లోనే సాధన చేయించేవాడు. ఐదారేళ్ల వయసొచ్చాక చీరాలలోని ఓ వ్యాయామశాలలో చేర్పిద్దామని తీసుకెళ్తే అక్కడున్న వాళ్లు.. ఇంత చిన్న పిల్లవాణ్ని ఎందుకు తీసుకు వచ్చావ్.. పిల్లాడి జీవితాన్ని నాశనం చేద్దామనుకుంటున్నావా అని మధుపై కోప్పడ్డారు. వాళ్ల మాటలు పట్టించుకోని అతను రాహుల్‌కు సొంతంగా శిక్షణ ఇవ్వడం మొదలెట్టాడు. 2008లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ క్రీడా పాఠశాల ఎంపిక కోసం తీసుకెళ్లాడు. అయితే అక్కడ ఎంపికవ్వలేదు. రాష్ట్ర స్థాయి పోటీల్లో పతకం సాధిస్తే అప్పుడు తీసుకుంటామని చెప్పడంతో.. కొడుకును శ్రీకాకుళంలో జరిగిన పోటీలకు తీసుకెళ్లాడు. అక్కడ క్రీడా పాఠశాల విద్యార్థులను వెనక్కినెట్టి మరీ రాహుల్ పసిడి సాధించాడు. అతని ప్రతిభను గుర్తించిన కోచ్ మాణిక్యాల రావు ప్రోత్సహించాడు. వరుణ్ కూడా అన్నలాగే అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్నాడు. ప్రస్తుతం క్రీడా పాఠశాలలో చదువుతున్న అతను గతేడాది కామన్వెల్త్ యూత్, జూనియర్ ఛాంపియన్‌షిప్‌లో పసిడి నెగ్గాడు. ప్రస్తుతం పటియాలాలోని జాతీయ శిక్షణ శిబిరంలో సాధన చేస్తున్న అతను.. వచ్చే నెలలో ఉజ్బెకిస్థాన్‌లో జరగనున్న టోర్నీ కోసం సిద్ధమవుతున్నాడు. రాహుల్ చెల్లి మధుప్రియ కూడా వెయిట్‌లిఫ్టింగ్‌లో శిక్షణ తీసుకుంది. జాతీయస్థాయి పోటీల్లో ఎనిమిది సార్లు పాల్గొని పతకాలు కూడా గెలిచింది. అయితే ప్రస్తుతం అగ్రికల్చర్ బీఎస్సీ చదువుతున్న ఆమె చదువుపైనే దృష్టి పెట్టింది. తను చదివే విశ్వవిద్యాలయంలో వెయిట్‌లిఫ్టింగ్ క్రీడకు సంబంధించి ఎలాంటి వసతులు లేకపోవడం, పైగా అమ్మ చనిపోవడంతో ఆమె వెయిట్‌లిఫ్టింగ్‌ను వదిలేసింది.
2016లో రాహుల్ వాళ్లమ్మ నీలిమ క్యాన్సర్‌తో చనిపోయింది. అప్పుడు పటియాలాలోని జాతీయ శిక్షణ శిబిరంలో సాధన చేస్తున్న రాహుల్ ఆ వార్త విని తట్టుకోలేకపోయాడు. రేపటి నుంచి అమ్మ ఉండదు అనే ఆలోచనతో ఊపిరి ఆగినంత పనైంది రాహుల్‌కు. అమ్మను తలుచుకుంటూ రోజూ ఏడ్చేవాడు. ఈ సమయంలో మధు.. కొడుక్కి ధైర్యం చెప్పాడు. ఇలా ఏడుస్తూ కూర్చుంటే అమ్మ సంతోషించదు.. తన కోసం పతకాలు సాధించి చూపించు అని రాహుల్‌లో ఆత్మవిశ్వాసాన్ని నింపాడు. కామన్వెల్త్ పతకం గెలిచిన తర్వాత ఈ క్షణంలో అమ్మ ఉంటే ఎంత సంతోషంగా ఉండేదో అని అనిపించిందని చెబుతున్న రాహుల్… 2014 కామన్వెల్త్‌లో కచ్చితంగా పతకం గెలుస్తా అని అమ్మకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాడు. అమ్మ కాలి మెట్టెను మెడలో లాకెట్‌గా వేసుకోవడంతో అమ్మ ఎప్పుడూ తనతో ఉన్నట్లు అనిపిస్తోందని అంటున్నాడు. అమ్మ, నాన్నల చిత్రాలను గుండెపై పచ్చబొట్టు వేయించుకున్నాడు.

టీ అమ్మే కుర్రాడు..

sprs

కామన్వెల్త్‌లో సత్తా చాటిన తెలంగాణ కుర్రాడు హుసాముద్దీన్… పేద కుటుంబం నుంచి వచ్చిన ఈ యువ బాక్సర్.. ఒకప్పుడు టీలు కూడా అమ్మాడు. అతని నాన్న షంషుద్దీన్ కూడా బాక్సరే. బాక్సర్‌గా కెరీర్ కొనసాగించలేక కుటుంబం కోసం టీస్టాల్ నడిపేవాడు. హుసాముద్దీన్ తండ్రికి సాయంగా ఉంటూ టీలు అమ్మేవాడు. ఆరుగురు అన్నదమ్ములున్న ఆ కుటుంబంలో అందరూ బాక్సర్లే కావడం విశేషం. ఒకవైపు టీ అమ్ముతూ.. చిన్న చిన్న పనులు చేస్తూ తండ్రికి సాయంగా ఉంటూనే హుసాముద్దీన్.. అతని సోదరులు తండ్రి దగ్గర బాక్సింగ్‌లో కోచింగ్ తీసుకునేవాళ్లు. హుసాముద్దీన్ బాక్సింగ్‌లో వేగంగా ఎదిగాడు. 2009 జాతీయ జూనియర్ ఛాంపియన్‌షిప్‌లో కాంస్యంతో సత్తా చాటిన అతను.. జాతీయ సీనియర్ టోర్నీలోనూ స్వర్ణంతో మెరిశాడు. 2012 టామెర్ కప్, 2014లో చైనా ఓపెన్, 2015 ప్రపంచ మిలటరీ క్రీడల్లో పతకాలతో సత్తా చాటాడు.

వ్యవసాయం నుంచి.. 

spr

జీతురాయ్.. భారత షూటింగ్ స్టార్ జీతురాయ్ కామన్వెల్త్ క్రీడల్లో పసిడితో మెరిశాడు  . నిజానికి జీతు స్వస్థలం నేపాల్. అక్కడ తండ్రికి వ్యవసాయంలో సాయం చేసేవాడు. బంగాళాదుంపలు, మొక్కజొన్న పండించడం అతనికెంతో ఇష్టం.  భారత సైన్యంలో ఉద్యోగం రావడం జీతు కెరీర్‌ను మార్చేసింది. అతనిలోని ఒక అద్భుతమైన షూటర్ ఉన్నాడన్న సంగతి వెలుగు చూసింది. మొదట్లో సైన్యంలో ఉన్నా కాబట్టి గన్ పట్టుకున్నా అనుకునేవాడు.  సీనియర్ల ప్రోత్సాహంతో షూటింగ్‌పై గురి కుదిరింది. తాను బక్క పలచగా ఉండడంతో బాగా బరువుండే రైఫిల్‌కు బదులు.. పిస్టల్ అయితే రాణించగలనని భావించాడు. ఆర్మీ మారక్స్‌మన్ యూనిట్‌లో సభ్యుడిగా ఉండే జీతు 2009 వరకు సాధారణ షూటర్ మాత్రమే. కానీ ఆశించినంతగా అతను రాణించకపోవడంతో తిరిగి పంపించేశారు. ఐతే నేపాల్ రైఫిల్స్‌లోకి వచ్చాక అతను అనూహ్యంగా మెరుగయ్యాడు. 2013లో మూడు ప్రపంచకప్ పతకాలు గెలవడంతో జీతు పేరు మార్మోగింది. 2014 కామన్వెల్త్, ఆసియా క్రీడల్లో 50 మీ పిస్టల్ విభాగంలో స్వర్ణాలతో మెరిశాడు జీతు. 2016 ఒలింపిక్స్‌లో ఒత్తిడి తట్టుకోలేక రాణించలేకపోయిన ఈ షార్ప్ షూటర్.. 2020 ఒలింపిక్స్‌లో సత్తా చాటుతాననే నమ్మకంతో ఉన్నాడు.

పేదరికంలో ఉన్నా..

sprts

కామన్వెల్త్ క్రీడల్లో వెయిట్‌లిఫ్టింగ్‌లో స్వర్ణం గెలిచిన పూనమ్ యాదవ్ స్వస్థలం వారణాసి.కరణం మల్లేశ్వరిలాగే తానూ దేశం గర్వించే ప్రదర్శన చేయాలనే లక్ష్యం పెట్టుకున్న పూనమ్ విజయం వెనక ఎన్నో కష్టాలున్నాయి. వెయిట్‌లిఫ్టర్‌కు పోషకాహారం తప్పనిసరి. కానీ ఆ ఖర్చులు కూడా భరించే స్థితిలో ఉండేది కాదు ఆమె కుటుంబం. విదేశాల్లో జరిగే టోర్నీలకు పంపేందుకు డబ్బులు లేక ఇంట్లో పాడి గేదెను కూడా అమ్ముకోవాల్సి వచ్చింది. పూనమ్ 2014 గ్లాస్గో కామన్వెల్త్‌లో కూడా పాల్గొంది. కాంస్య పతకాన్ని గెలుచుకుంది. తమ అమ్మాయి పతకం గెలిచినా.. ఆ సంతోషాన్ని పంచుకునేందుకు స్వీట్లు కూడా కొనలేని పరిస్థితి అప్పట్లో ఆ కుటుంబానిది. 2014 కామన్వెల్త్ క్రీడల ప్రదర్శనతో వారణాసి రైల్వే స్టేషన్‌లో టిక్కెట్ కలెక్టర్ ఉద్యోగాన్ని సంపాదించిన పూనమ్.. చాలా వరకు తమ కుటుంబ అప్పులు తీర్చింది.  ఇప్పడు స్వర్ణం గెలవడంతో ఆమె కుటుంబం ఆనందానికి అవధుల్లేవు.  ఆమెకు నలుగురు అక్కాచెల్లెళ్లు, ఇద్దరు సోదరులు ఉన్నారు. సోదరులిద్దరూ  జాతీయ స్థాయి హాకీ ఆటగాళ్లు.

అనారోగ్యాన్ని అధిగమించాడు

spt

కామన్వెల్త్ 2014 క్రీడలకు కొన్ని రోజుల ముందు.. ఆ టోర్నీకి అర్హత సాధించిన ఓ బ్యాడ్మింటన్ ఆటగాడు గోపీచంద్ అకాడమీలో కఠోర సాధన చేస్తున్నాడు. అలా సాధన చేస్తుండగా ఒక రోజు అతను హఠాత్తుగా స్పృహ కోల్పోయి, కుప్పకూలాడు. ఆసుపత్రికి తరలిస్తే మెదడు సంబంధిత వ్యాధి అన్నాడు. ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తే ప్రమాదం తప్పింది. ఇప్పుడు అదే ఆటగాడు ప్రపంచ మేటి షట్లర్లలో ఒకడిగా ఎదిగాడు. రెండేళ్లుగా అనితర సాధ్యమైన విజయాలు సాధిస్తున్నాడు. తాజాగా కామన్వెల్త్ క్రీడల్లోనూ అదరగొట్టాడు. భారత బ్యాడ్మింటన్ చరిత్రలోనే ఎవరికీ సాధ్యం కాని రీతిలో పురుషుల నంబర్‌వన్ ర్యాంకునూ అందుకున్నాడు. అతనే కిదాంబి శ్రీకాంత్.
నాలుగేళ్ల కిందట శ్రీకాంత్ తీవ్ర అనారోగ్యానికి గురై ఐసీయూలో చేరిన విషయం బ్యాడ్మింటన్ వర్గాల్లో చాలామందికి తెలియదు. ఎందుకంటే అప్పటికతను పేరొందిన ఆటగాడేమీ కాదు. ఇప్పుడు బ్యాడ్మింటన్‌ను అనుసరించేవాళ్లలో శ్రీకాంత్ పేరు తెలియని వారుండరు. 2014 కామన్వెల్త్ క్రీడల్లో శ్రీకాంత్ పెద్దగా రాణించలేదు. అయితే అదే ఏడాది చైనా ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నీలో ఫైనల్ చేరాడు. టైటిల్ గెలవాలంటే ప్రపంచ బ్యాడ్మింటన్ చరిత్రలోనే అత్యంత గొప్ప ఆటగాడైన లిన్ డాన్‌ను ఓడించాలి. కళ్లు చెదిరే ఆటతో డాన్‌ను ఓడించి ప్రకంపనలు రేపాడు శ్రీకాంత్. అయితే తర్వాత అతను అంచనాల్ని అందుకోలేకపోయాడు. అయినా నిరాశ చెందలేదు. ఫిట్‌నెస్‌లో ఉన్నత ప్రమాణాల్ని అందుకున్నాడు. రెండేళ్లుగా నిలకడగా విజయాలు సాధిస్తూ భారత పురుషుల బ్యాడ్మింటన్‌ను అత్యున్నత స్థాయికి తీసుకెళ్లాడు. గత ఏడాది ఏకంగా నాలుగు సూపర్ సిరీస్ టైటిళ్లు సాధించి ఔరా అనిపించాడు. రెండో ర్యాంకుకు ఎదిగాడు. తాజాగా కామన్వెల్త్ క్రీడల్లో సత్తా చాటి అగ్రస్థానాన్ని కూడా అందుకున్నాడు.
శ్రీకాంత్ అన్న నందగోపాల్ కూడా షట్లరే. అతడితో పాటు స్టేడియానికి వస్తూ బ్యాడ్మింటన్‌పై ఆసక్తి పెంచుకున్నాడు. సాధన మొదలుపెట్టాడు. ముందు వైజాగ్‌లో శిక్షణ తీసుకున్న శ్రీకాంత్.. ఆ తర్వాత హైదరాబాద్‌కు వచ్చి గోపీచంద్ అకాడమీలో చేరాడు. శ్రీకాంత్ ప్రతిభను త్వరగానే గుర్తించాడు గోపీ. ముందు డబుల్స్‌తో మొదలుపెట్టిన శ్రీకాంత్.. తర్వాత గోపీ సలహాతోనే సింగిల్స్‌కు మారాడు. శ్రీకాంత్‌ది వ్యవసాయ కుటుంబం. ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రం. అయినప్పటికీ కొడుకుల్ని ఆటలో కొనసాగనిచ్చారు. వారికి అండగా నిలిచారు తల్లిదండ్రులు.

ఒకప్పుడు కట్టెలమ్మింది..

sprt

మీరాబాయి చాను గోల్డ్‌స్ట్ కామన్వెల్త్ క్రీడల్లో అలవోకగా బరువులెత్తి పసిడి పతకం సాధించిన వెయిట్‌లిఫ్టర్. చిన్నప్పుడు ఇంట్లో వంట కోసం ఆమె కట్టెలెత్తిన సంగతి ఎవరికీ తెలియదు. ఇంఫాల్‌కు 20 కి.మీ దూరంలో ఉన్న నాంగ్‌పొక్ కాక్‌చింగ్ గ్రామంలోని బీద కుటుంబంలో పుట్టింది చాను.. బాల్యంలో ఎన్నో కష్టాలు పడింది. ఇంట్లో ఆరుగురు సంతానంలో చానుయే చిన్నది. వంట చెరుకు కోసం తన సోదరులతో కలిసి అడవికి వెళ్లేది. తనకన్నా నాలుగేళ్లు పెద్ద అయిన సోదరుడు సెనతోంబా ఎత్తలేని బరువును కూడా ఆమె సులభంగా ఎత్తేది. ఎప్పుడూ ప్రశాంతంగా ఉండడం.. సవాళ్లను ఎదుర్కోవడం మీరాకు చిన్నప్పటి నుంచే అలవాటైంది. వెయిట్‌లిఫ్టింగ్‌పై మక్కువతో ఈ ఆటలోకి వచ్చిన మీరా నాన్న చిరుద్యోగి.. దీంతో ఆ పెద్ద కుటుంబం ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడింది. 2014 గ్లాస్గో కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణం గెలవడంతో మీరా కుటుంబం ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడింది. తాజాగా ప్రపంచ ఛాంపియన్ కావడం, గోల్డ్‌స్ట్‌లో క్రీడల రికార్డు సృష్టిస్తూ స్వర్ణం గెలవడంతో మీరా కుటుంబం ఆనందంలో మునిగిపోయింది.

గెలుపే లక్షంగా…

sp

కామన్‌వెల్త్ క్రీడల్లో భారత అమ్మాయిల స్వర్ణ జోరు కొనసాగుతూనే ఉన్నది. తన గురి తప్పదని నిరూపిస్తూ షూటర్ హీనా సిద్ధూ 25మీ పిస్టల్ విభాగంలో పసిడి పతకం సాధించింది. 38పాయింట్ల ఫైనల్ స్కోరు నమోదు చేసి రికార్డు సృష్టించింది. షూటింగ్‌లో భారత్‌కు ఇది మూడో స్వర్ణం. కాగా, సిద్ధూ ఖాతాలో రెండో పతకం. అంతకు ముందు 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో రజతం సాధించిన సంగతి తెలిసిందే. మెగా టోర్నీల్లో 25 మీటర్ల పిస్టల్ విభాగంలో సిద్ధూకు స్వర్ణం దక్కడం ఇదే తొలిసారి. ట్రిగ్గర్‌ను నొక్కే వేలికి నొప్పి ఉన్నప్పటికీ అది షాట్‌పై ఎటువంటి ప్రభావం చూపలేకపోయింది. అంతకు ముందు సిల్వర్ మెడల్ సాధించినపుడు కూడా ట్రిగ్గర్ వేలు బాగా బాధించింది. ఈసారి మాత్రం నా వేలిని ముట్టుకోకండి అని ఫిజియోకు చెప్పాను. గెలుపే లక్ష్యంగా ఆటను కొనసాగించాను. అదృష్టవశాత్తు వేలి గాయం నన్నేమీ ఇబ్బందిపెట్టలేదు అని పసిడి సాధించిన అనంతరం సిద్ధూ తెలిపింది.

అత్యంత పిన్న వయసులో స్వర్ణం 

game

యువ సంచలనం అనిష్  కామన్వెల్త్ క్రీడల్లో రికార్డులతో హోరెత్తించాడు 15 ఏళ్ల షూటర్ అనీష్ బాన్‌వాల్. అద్భుత ప్రదర్శనతో పసిడి పతకం సాధించి సత్తా చాటాడు.   25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ విభాగంలో 15 ఏళ్ల అనీష్ బాన్‌వాల్ స్వర్ణం గెలిచి ఈ క్రీడల్లో పసిడి గెలిచిన పిన్న వయస్కుడిగా చరిత్ర సృష్టించాడు. అతను మను బాకర్ (16 ఏళ్లు) రికార్డును అధిగమించాడు. ఫైనల్లో 30 పాయింట్లు సాధించి కామన్వెల్త్ రికార్డును కూడా తిరగరాశాడు ఈ హరియాణా కుర్రాడు. ఫేవరెట్లు ఎవెగ్లెవెస్కీ (ఆస్ట్రేలియా), సామ్ గోవిన్ (ఇంగ్లాండ్)ను వెనక్కి నెట్టి బాన్‌వాల్ పసిడి పతకం ఎగరేసుకుపోయాడు.