Home జాతీయ వార్తలు ఇండియా-ఇజ్రాయెల్ క్షిపణి సక్సెస్

ఇండియా-ఇజ్రాయెల్ క్షిపణి సక్సెస్

బహుళ వ్యవస్థల నిఘా, ఒడిశా చాందీపూర్ నుంచి ప్రయోగం

missileబాలాసోర్: బహుళ వ్యవస్థల నిఘాతో ఇతర అధు నాతన అమరికలతో కూడిన ఉపరితల- గగన క్షిపణిని భారతదేశం గురువారం విజయవంతంగా ప్రయోగిం చింది. ఒడిశా తీరంలోని ఛాందీపూర్ రక్షణ స్థావరం నుంచి నింగిలోకి దూసుకుపోయిన ఈ క్షిపణిని ఇజ్రా యెల్ సహకారంతో సంయుక్తంగా రూపొందించారు. మధ్య తరహా మిస్సైల్ – ఎంఆర్ – సామ్‌ను సమీకృత ప్రయోగ వేదిక (ఐటిఆర్) నుంచి ప్రయోగించినట్లు రక్షణ పరిశోధనా అభివృద్ధి సంస్థ (డిఆర్‌డిఒ) అధికారి తెలిపారు. ఐటిఆర్‌లో అమర్చిన మొబైల్ లాంచర్ నుంచి దీనిని ఉదయం 8. 15 గంటలకు ప్రయోగిం చారు. ఇది నిర్ణీత లక్షాలను ఛేదించిందని , సకల విధాలుగా విజయవంతం అయిందని డిఆర్‌డిఒ అధి కారి వెల్లడించారు. ఐటిఆర్ లాంఛ్‌ప్యాడ్ 3 నుంచి దీనిని తగు విధమైన రాడార్ సంకేతాలు అందగానే ప్రయోగించారు. ఉపరితలం నుంచి దీనిని ప్రయో గించగా ఇది గగనతలంలోని మానవరహిత  ఎయిర్ వెహికల్ (యుఎవి) బాన్షీని టార్గెట్‌గా ఎంచుకుని దానిని దిగ్బంధం చేసింది. బంగాళాఖాతం మీదుగా ఎగురుతున్న యుఎవి ఈ మిస్సైల్ ధాటికి గురయిందని అధికారులు తెలిపారు దాడికి దిగే మిస్సైల్‌తో పాటు  బహుళ అంచెల నిఘా , ముప్పును తెలియచేసే రాడార్ (ఎంఎఫ్ స్టార్) , మిస్సైల్స్‌ను నిర్ధేశించే వ్య వస్థలు కూడా సక్రమంగా పనిచేసినట్లు డిఆర్‌డిఒ తెలిపింది. ఎంఎఫ్ స్టార్‌తో కూడిన ఈ మిస్సైల్‌తో వైమానిక ముప్పును సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు వీలేర్పడుతుంది. డిఆర్‌డిఒ ప్రయోగశాలగా  హైదరా బాద్‌లో ఉన్న  ఆర్‌సిఐలో ఈ క్షిపణిని ఇజ్రాయెల్ ఎరోస్పేస్ ఇండస్ట్రీస్ సహకారంతో రూపొందించారు. ఏడాదికి వంద ఇలాంటి క్షిపణులను తయారు చేసేందుకు అవసరమైన కొత్త ఉత్పత్తి విభాగాన్ని భారత్ డైనమిక్స్ లిమిటెడ్ ఇండియాలో  ఏర్పాటు చేశారు. బుధవారమే ఈ క్షిపణి ప్రయోగం జరగాల్సి ఉంది. అయితే దీనిని మరుసటి రోజుకు వాయిదా వేశారు. ఇది ఇలా ఉండగా ఇంతకు ముందు భారతీయ నౌకాదళం వారు ఉపరితల -గగనతల మిసైల్ – ఎల్‌ఆర్ సామ్‌ను విజయవంతంగా ప్రయోగించారు. గత ఏడాది డిసెంబర్‌లో ఐఎన్‌ఎస్ కొల్‌కతా నుంచి పశ్చిమ తీరం వెంబడి దీనిని ప్రయోగించారు. ఇప్పుడు ప్రయోగించిన మధ్య తరహా మిస్సైల్స్‌కు  50 – 70 కిలోమీటర్ల పరిధిలోని టార్గెట్‌ను దెబ్బతీయగలదు. ప్రస్తుతం భారత్‌కు ఉన్న క్షిపణి వ్యవస్థలో ఈ దూరంలో లక్షఛేదన చేసే మిస్సైల్స్ కొరత ఉంది. అత్యంత కీలకమైన రీతిలో భారతదేశం ఇజ్రాయెల్‌తో చేసుకున్న రక్షణ సహకార ఒప్పందంలో భాగంగా ఈ మిస్సైల్స్ తయారీకి రంగం ఏర్పడింది.  ఈ క్షిపణులను భారతీయ త్రివిధ సైనిక బలగాల సేవలకు అందుబాటులోకి తెస్తారు. దీనికి ముందు యుజర్స్ ట్రయల్స్ పూర్తి కావాల్సి ఉంటుంది. ఇది ఇలా ఉండగా ఈ ప్రయోగం నేపథ్యంలో ప్రయోగ కేంద్రానికి సమీపంలోని నాలుగువేల మందిని బాలాసోర్ జిల్లా అధికార యంత్రాంగం సమీపంలోని తాత్కాలిక శిబిరాలకు తరలించింది. మిస్సైల్ ప్రయోగం భద్రతాయుతంగా జరిగేందుకు, స్థానికులకు  ఇబ్బంది కలుగకుండా చేసేందుకు ఈ ఏర్పాట్లు చేశారు. అదే విధంగా  జాలర్లు ఈ ప్రయోగ సమయంలో చేపలు పట్టేందుకు సముద్రంలోకి వెళ్లకూడదని అధికారిక హెచ్చరికలు వెలువడ్డాయి.