Home ఎడిటోరియల్ రాష్ట్రపతి ఇజ్రాయిల్ పర్యటన దేనికి సంకేతం?

రాష్ట్రపతి ఇజ్రాయిల్ పర్యటన దేనికి సంకేతం?

Pranabదేశ ప్రధానమంత్రిగా గత సంవత్సరం మే మాసంలో ప్రమాణస్వీకారం చేసిన నరేంద్రమోడీ, పక్షంరోజులలోపే ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో సంభాషించారు. దీనిపై ట్వీట్‌లో మోడీ ఇలా చెప్పారు. “నేను ప్రధాని నెతన్యాహుతో మాట్లాడాను. ఇజ్రాయిల్‌తో మన స్నేహానికి మేము విలువ ఇస్తున్నాం-ఇది భారత, ఇజ్రాయిల్ సంబం ధాల్లో స్వర్ణాధ్యాయం లిఖిస్తుంది”. అక్టోబర్ 13-15 తేదీల్లో రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ ఇజ్రాయిల్ పర్యటనతో మోడీ ప్రభుత్వం “స్వర్ణాధ్యాయాన్ని” ఆరంభించినట్లుంది. ఇజ్రాయిల్‌లో పర్యటించిన తొలి భారత రాజ్యాధినేత ప్రణబ్‌ముఖర్జీయే. అక్టోబర్ 10-15 మధ్య పశ్చిమాసియా పర్యటనలో భాగంగా పాలస్తీనా, జోర్డాన్‌లను సందర్శించిన తొలి భారత రాష్ట్రపతి కూడా ఆయనే. అయితే ఇజ్రా యిల్‌కు రాష్ట్రపతి పర్యటనను ఏర్పాటు చేయటం ద్వారా న్యూఢిల్లీ నిజంగా లక్ష్మణరేఖ దాటింది. పాలస్తీనా రాజ్యస్థాపన లక్షంపట్ల నిబద్ధతను కొన సాగించటంతో నిమిత్తం లేకుండా, ఇజ్రాయిల్ తో సన్నిహితమైన, ప్రవర్ధిత సంబంధం గూర్చి ఇంకెంత మాత్రమూ బిడియపడరాదన్న భారత ప్రభుత్వ నిర్ణయాన్ని అది ఒక రకంగా సంకేతిం చింది.
భారతప్రభుత్వం కొన్ని సంవత్సరాలుగా ఇజ్రా యిల్, పాలస్తీనా రెండింటితో సంబంధాల విషయం లో దౌత్యపరంగా ఆచితూచి అడుగేస్తూ, నేర్పుగా ఇజ్రాయిల్‌తో సన్నిహిత సంబంధాలు నెరుపు తున్నది. అయితే టెల్ అవీవ్‌తో సంబంధాల విష యం లో కొంత బెరుకుతనం కనిపిస్తుండేది. టెల్ అవీవ్‌తో పూర్తిస్థాయి దౌత్యసంబంధాలు 1992లో ఏర్పడి నప్పటికీ, భారతరాజ్య లేక ప్రభుత్వ నేత ఎవ్వరూ ఇజ్రాయిల్‌లో ఇంతకుమునుపు పర్యటించ లేదు. భారతప్రభుత్వం (వాజ్‌పేయిప్రభుత్వం) మా త్రం 2003 సెప్టెంబర్‌లో ఇజ్రాయిల్ ప్రధాని ఎరీల్ షరాన్ అధికారిక పర్యటనకు ఆతిథ్య మిచ్చింది.
ఇజ్రాయిల్‌కు సంబంధించి, భారతప్రభుత్వ ఉన్నతస్థాయి నేత పర్యటన కొరకు దాని దీర్ఘకాల నిరీక్షణ ఫలించింది. ప్రణబ్‌ముఖర్జీ గౌరవార్థం పార్లమెంటు ప్రత్యేక సమావేశంలో ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహు ప్రసంగిస్తూ, “ఇది ఇరుదేశాల మధ్య మైత్రిని ముందుకు గొనిపోవటంలో చరిత్రా త్మకమైన మైలురాయి” అని అభివర్ణించారు. రాను న్న మాసాల్లో ప్రధాని మోడీ ఇజ్రాయిల్‌ను సందర్శి స్తారని విదేశాంగమంత్రి సుష్మాస్వరాజ్ అంతకు మును పు చేసిన ప్రకటన, భారత అగ్రనేతల ఇజ్రా యిల్ పర్యటనపట్ల ఉన్న జంకుగొంకును విడ నాడా లని ప్రభుత్వం నిర్ణయించినట్లు విదితం చేసింది.
ఇజ్రాయిల్‌తో ద్వైపాక్షిక సంబంధాలను బాహా టం చేయాలని న్యూఢిల్లీ నిర్ణయించుకోవ టానికి కారణాలు ఊహించలేనివి కావు. అవి ఆచరణాత్మక దృక్పథం, వ్యూహాత్మక, ఆర్థిక అవస రాలు. ఇజ్రాయిల్ తో రక్షణ, వ్యవసాయం, పశు సంవర్థన, డ్రిప్ ఇరిగేషన్, ఐటి, సైబర్ సెక్యూరిటీ, టెలీకం, ఫార్మాస్యూటికల్స్, సౌరశక్తి తదితర రంగా ల్లో ఇతోధిక సహకారాన్ని భారత్ కోరుకుంటోంది. అంతేగాక, ‘మేక్ ఇన్ ఇండియా’, ‘డిజిటల్ ఇండి యా’, ‘స్మార్ట్ సిటీస్’ వంటి చొరవల్లో ఇజ్రాయిల్ పాల్గొనాలని మోడీ ప్రభుత్వం బలంగా కోరుకుంటోంది.
విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ ప్రకారం, భారత్‌లో ఇజ్రాయిల్ పెట్టుబడులు 300దాకా, ముఖ్యంగా హైటెక్, వ్యవసాయంలో ఉన్నాయి. కొన్ని ఇజ్రాయిల్ కంపెనీలు భారత్‌లో ఆర్ అండ్ డి కేంద్రాలు, ఉత్పత్తి కేంద్రాలు నెలకొల్పాయి. బదు లుగా, భారత కంపెనీలు విలీనాలు, స్వాధీ నాలు (ఎం అండ్ ఎ) ద్వారా ఇజ్రాయిల్‌లో ఉనికి కలిగి ఉన్నాయి.
ఇజ్రాయిల్‌తో ద్వైపాక్షిక సంబంధాల్లో అత్యంత ముఖ్యమైంది రక్షణ రంగం. ఇజ్రాయిల్ ఏటా 100కోట్ల అమెరికన్ డాలర్ల విలువైన ఆయుధాలను భారత్‌కు విక్రయిస్తున్నది. గూఢచారి మిస్సిలీల నుంచి ఆయుధాలు ప్రయోగించే డ్రోన్‌ల వరకు అనేక రకాలున్నాయి. 1999 కార్గిల్ యుద్ధ సమయంలో ఇజ్రాయిల్ అత్యవసర రక్షణ సరఫరా లు పంపిన తదుపరి, రక్షణరంగంలో ఇరుదేశాల సహకారం పుంజుకుంది.
టెల్‌అవీవ్‌తో వృద్ధిచెందుతున్న సంబంధాల గూర్చి భారతప్రభుత్వం ఇంతవరకు గుంభనంగా ఉండటానికి కారణం, పాలస్తీనాతో సాంప్రదా యకంగా ఉన్న సుహృద్భావ, సన్నిహిత సంబంధా లు. పాలస్తీనా ప్రజల ఏకైక, న్యాయబద్ధ ప్రతినిధిగా పాలస్తీనా విముక్తి సంస్థ (పిఎల్‌ఒ)ను గుర్తించిన (1974) తొలి అరబ్‌యేతర రాజ్యం భారత్ అని గుర్తు చేసుకోదగింది. అటు తర్వాత పిఎల్‌ఒ ఢిల్లీలో తన కార్యాలయం తెరిచింది.
ఈ పూర్వరంగంలో, రాష్ట్రపతి ఇజ్రాయిల్ పర్యటన పాలస్తీనియన్‌లలో ఆందోళన కలిగించటం సహజం. దీన్ని దృష్టిలో ఉంచుకునే, రాష్ట్రపతి ముఖర్జీ పాలస్తీనా అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్‌తో సమా వేశంలో “పాలస్తీనా లక్షంపట్ల భారత్ సూత్రబద్ధ తోడ్పాటు”ను పునరుద్ఘాటిం చారు.“…తూర్పు జెరూసలెం రాజధానిగా సర్వసత్తాక, స్వతంత్ర, సుస్థిర, ఐక్యపాలస్తీనా రాజ్యం” ఆవిర్భవించాలని, ఆ దిశగా సంప్రదింపులు ఫలప్రదం కావాలని రాష్ట్రపతి ఆకాంక్షించారు. ఈ దిశలో పాలస్తీనాతో భారత్ కలిసి పనిచేస్తుందని అబ్బాస్‌కు హామీ ఇచ్చారు.
అయినప్పటికీ, పాలస్తీనాకు తోడ్పాటుగా భారత్ పలు ప్రకటనలు చేసినప్పటికీ, ప్రధాని మోడీ విదేశాంగ విధానంలో ఇజ్రాయిల్‌కు ముఖ్యమైన స్థానం పెరుగుతున్నందున, ఈ హామీలు పాలస్తీని యన్‌ల ఆందోళనలను పూర్తిగా ఉపశమింపచేసే అవకాశం లేదు.
హమస్ పాలనలోని గాజా స్ట్రిప్‌పై 2014లో ఇజ్రాయిల్ సైనిక దాడిని ఖండించే నివేదికపై యు.ఎన్. మావనహక్కుల కౌన్సిల్‌లో జులైలో ఓటింగ్‌కు భారత్ గైరుహాజరైంది. అంతర్జాతీయ క్రిమినల్ కోర్టును నెలకొల్పిన రోమ్‌చట్టంపై తాము సంతకం చేయనందున గైరుహాజరైనట్లు భారత ప్రభుత్వం చేసే వాదన సాంకేతికమైనది మాత్రమే. ఇజ్రాయిల్‌వైపు మొగ్గుదలే ఇందుకు అసలు కారణ మన్నది నిరాకరించలేని వాస్తవం. ప్రధాని నెత న్యాహు ఈ వాస్తవాన్ని తమ పార్లమెంటులో ప్రసం గంలో ప్రస్తావించారు. తాను తరచూ ప్రధాని మోడీ తో టెలిఫోన్‌లో మాట్లాడుతున్నట్లు కూడా చెప్పాడు.
భారత్ వైఖరిలో కనిపిస్తున్న స్పష్టమైన మార్పు ఇజ్రాయిల్ చెవులకు సుగమసంగీతం, పాలస్తీనాకు ఎంతమాత్రం కాదు. (ఇన్ఫా)