Home స్కోర్ ఇంగ్లండ్ దే గెలుపు

ఇంగ్లండ్ దే గెలుపు

India lost in the first Test

చెలరేగిన స్టోక్స్, తొలి టెస్టులో భారత్ ఓటమి

హైలైట్స్:

200 ఈ మ్యాచ్‌లో కోహ్లి చేసిన పరుగులు
7 మ్యాచ్‌లో అశ్విన్ పడ గొట్టిన వికెట్లు
17 రెండు ఇన్నింగ్స్‌లలో కలిపి రహానె, రాహుల్ చేసిన పరుగులు
3 భారత్ 200లోపు స్కోరును ఛేదించడంలో విఫలం కావడం ఇది మూడో సారి

బర్మింగ్‌హామ్: ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్టులో భారత్ ఓటమి పాలైంది. బౌలర్లు ఆధిపత్యం చెలాయించిన ఈ మ్యాచ్‌లో భారత్ 194 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కూడా ఛేదించలేక పోయింది. అసాధారణ ఆటను కనబరిచిన ఆతిథ్య ఇంగ్లండ్ జట్టు చారిత్రక 1000వ టెస్టులో 31 పరుగుల తేడాతో జయకేతనం ఎగుర వేసింది. కెప్టెన్ విరాట్ కోహ్లి (51), హార్దిక్ పాండ్య (31) కాస్త పోరాడినా జట్టును మాత్రం గెలిపించలేక పోయారు. బెన్‌స్టోక్స్ నాలుగు వికెట్లు తీసి ఇంగ్లండ్‌కు చారిత్రక విజయాన్ని అందించాడు. ఆల్‌రౌండ్‌షోతో అదరగొట్టిన శామ్ కరన్‌కు మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు లభించింది. ఈ విజయంతో ఇంగ్లండ్ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 10 ఆధిక్యాన్ని అందుకుంది.

ప్రారంభంలోనే…
110/5 ఓవర్‌నైట్ స్కోరుతో శనివారం నాలుగో రోజు బ్యాటింగ్ చేపట్టిన భారత్‌కు ప్రారంభంలోనే ఎదురు దెబ్బ తగిలింది. దినేష్ కార్తీక్ (20)ను అండర్సన్ ఔట్ చేసి ఇంగ్లండ్‌కు పైచేయి అందించాడు. అప్పటికే భారత్ స్కోరు 112 పరుగులు మాత్రమే. ఈ దశలో హార్దిక్ పాండ్యతో కలిసి కెప్టెన్ విరాట్ కోహ్లి ఇన్నింగ్స్‌ను పటిష్ట పరిచేందుకు ప్రయత్నించాడు. ఇద్దరు కలిసి ఇంగ్లండ్ బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ ముందుకు సాగారు. వీరిద్దరూ కుదురుకున్నట్టే కనిపించింది. అయితే కీలక సమయంలో బెన్‌స్టోక్స్ భారత్‌కు కోలుకోలేని దెబ్బ తీశాడు. అద్భుత బంతితో విరాట్‌ను వెనక్కి పంపాడు. కీలక ఇన్నింగ్స్ ఆడిన కోహ్లి 93 బంతుల్లో 4 ఫోర్లతో 51 పరుగులు చేశాడు. ఆ వెంటనే మహ్మద్ షమి (0) కూడా ఔటయ్యాడు. ఈ వికెట్ కూడా స్టోక్స్ ఖాతాలోకే వెళ్లింది. మరోవైపు ఇషాంత్ 11 పరుగులు చేసి వెనుదిరిగాడు. అతన్ని రషీద్ వెనక్కి పంపాడు. కాగా, భారత్ గెలుపుపై ఆశలు చిగురింప చేసిన హార్దిక్ 61 బంతుల్లో 4 ఫోర్లతో 31 పరుగులను కూడా స్టోక్స్ ఔట్ చేశాడు. దీంతో భారత్‌కు 31 పరుగుల తేడాతో ఓటమి తప్పలేదు. ఇంగ్లండ్‌ను రెండు ఇన్నింగ్స్‌లలోనూ తక్కువ స్కోరుకే పరిమితం చేసినా బ్యాటింగ్ వైఫల్యంతో టీమిండియాకు ఘోర పరాజయం తప్పలేదు. సునాయాసంగా గెలవాల్సిన మ్యాచ్‌లో కోహ్లి సేన చేజేతులా ఓటమిని కొని తెచ్చుకుంది. కాగా, భారత జట్టు ఓటమితో అభిమానుల్లో నిరాశ నెలకొంది. చెత్త బ్యాటింగ్‌తో భారత్‌కు పరాజయం తెచ్చి పెట్టిన బ్యాట్స్‌మన్‌పై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

బ్యాటింగే కొంప ముంచింది…
తొలి టెస్టులో ఓటమికి బ్యాటింగ్ వైఫల్యమే కారణం. గెలవాల్సిన మ్యాచ్‌లో పరాజయం పాలు కావడం బాధాకరం. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ అసాధారణ పోరాట పటిమను కనబరిచింది. ఒత్తిడిని సైతం తట్టుకుంటూ మ్యాచ్‌లో నిలిచింది. తాము మాత్రం చెత్త బ్యాటింగ్‌తో ఓటమి పాలయ్యాం. షాట్ల ఎంపిక ఏమాత్రం బాగాలేదు. ఈ ఓటమి తమకు గుణపాఠం లాంటిది. రానున్న మ్యాచుల్లో మరింత మెరుగ్గా రాణించేందుకు ప్రయత్నిస్తాం. బౌలర్లు అసాధారణ రీతిలో రాణించడం కలిసి వచ్చే అంశం. రెండు ఇన్నింగ్స్‌లలోనూ ఇంగ్లండ్‌ను తక్కువ స్కోరుకే పరిమితం చేయడంలో బౌలర్లు సఫలమయ్యారు. బ్యాటింగ్ గాడిలో పడితే ఇంగ్లండ్‌ను ఓడించడం కష్టమేమి కాదు.
                                                                                                                             – టీమిండియా కెప్టెన్ కోహ్లి

సమష్టి విజయమిది…
చారిత్రక మ్యాచ్‌లో విజయం సాధించడం ఎంతో ఆనందంగా ఉంది. ఈ మ్యాచ్‌లో భారత్ నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. తీవ్ర ఒత్తిడిలోనూ తమ ఆటగాళ్లు సమష్టిగా రాణించారు. కలిసి కట్టుగా పోరాడడం వల్లే విజయం సాధ్యమైంది. ఫాస్ట్ బౌలర్లు అద్భుతంగా రాణించారు. బ్యాట్స్‌మెన్ కూడా బాగానే ఆడారు. ఈ మ్యాచ్‌లో శామ్ కరన్ ఆకాశమే హద్దుగా చెలరేగి పోయాడు. జట్టు విజయంలో అతని పాత్ర వేల కట్టలేనిది. ఈ విజయం జట్టు ఆత్మవిశ్వాసం రెట్టింపు చేసింది. ఇక, టీమిండియా కెప్టెన్ కోహ్లి పోరాట పటిమను ఎంత పొగిడిన తక్కువే. ఒత్తిడిలోనూ అతను అసాధారణ రీతిలో రాణించాడు. రానున్న మ్యాచుల్లో భారత్ నుంచి గట్టి పోటీ ఎదురు కావడం ఖాయం.
                                                                                                                          -ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్