Search
Friday 21 September 2018
  • :
  • :
Latest News

భారత్ రికార్డు విజయం

kohli

కోహ్లి శతకం, రాణించిన ధవన్, మళ్లీ చెలరేగిన స్పిన్నర్లు
మూడో వన్డేలోనూ సఫారీ చిత్తు

కేప్‌టౌన్: దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో వన్డేలో భారత్ 124 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో ఆరు మ్యాచ్‌ల సిరీస్‌లో టీమిండియా 30 ఆధిక్యాన్ని అందుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 303 పరుగులు చేసింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా 40 ఓవర్లలో 179 పరుగులకే కుప్పకూలి ఘోర పరాజయాన్ని చవిచూసింది. స్పిన్ ద్వయం యజువేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్‌లు మరోసారి చెలరేగడంతో భారత్‌కు రికార్డు విజయం దక్కింది. ఈ విజయంతో భారత్ చరిత్ర సృష్టించింది. సౌతాఫ్రికా గడ్డపై వరుసగా మూడు మ్యాచ్‌లు గెలిచి కొత్త రికార్డును నెలకొల్పింది. భారీ లక్షంతో బ్యాటింగ్‌కు దిగిన సౌతాఫ్రికాకు రెండో ఓవర్లోనే షాక్ తగిలింది. బుమ్రా తన తొలి బంతికే హాషిం ఆమ్లాను వెనక్కి పంపాడు. అయితే తర్వాత వచ్చిన డుమినితో కలిసి కెప్టెన్ మార్‌క్రామ్ ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లాడు. ఇద్దరు భారత బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ ముందుకు సాగారు. ఒకవైపు వికెట్‌ను కాపాడుకుంటూనే స్కోరు వేగం తగ్గకుండా చూశారు. అయితే మార్‌క్రామ్ (32)ను కుల్దీప్ వెనక్కి పంపి సౌతాఫ్రికా వికెట్ల పతనానికి శ్రీకారం చుట్టాడు. కీలక ఇన్నింగ్స్ ఆడిన డుమినిన 4 ఫోర్లతో 51 పరుగులు చేసి చాహల్ బౌలింగ్ ఔటయ్యాడు. తర్వాత సఫారీలు మళ్లీ కోలుకోలేదు. చాహల్, కుల్దీప్‌లు నాలుగేసి వికెట్లు పడగొట్టి సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌ను 179 పరుగులకే పరిమితం చేశారు.
చెలరేగిన కోహ్లి, ధావన్
అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన భారత్‌ను ఓపెనర్ ధావన్, కెప్టెన్ విరాట్ కోహ్లిలు ఆదుకున్నారు. మరో ఓపెనర్ రోహిత్ శర్మ (0) ఖాతా తెరవకుండానే తొలి ఓవర్‌లోనే ఇంటిదారి పట్టాడు. అయితే కోహ్లి, ధావన్‌లు అద్భుత బ్యాటింగ్‌తో జట్టును ఆదుకున్నారు. ఇద్దరు సౌతాఫ్రికా బౌలర్లు సమర్థంగా ఎదుర్కొంటూ స్కోరును పరిగెత్తించారు. చెలరేగి ఆడిన ధావన్ 12 ఫోర్లతో 76 పరుగులు చేశాడు. మరోవైపు కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడిన కోహ్లి 159 బంతుల్లో 12 ఫోర్లు, రెండు సిక్సర్లతో అజేయంగా 160 పరుగులు చేశాడు. ఈ క్రమంలో కోహ్లి తన ఖాతాలో 34వ వన్డే శతకాన్ని నమోదు చేశాడు. కోహ్లి రాణించడంతో భారత్ స్కోరు 303కు చేరింది.

Comments

comments