Home ఎడిటోరియల్ సంపాదకీయం: బలపడిన సాంప్రదాయక మైత్రి

సంపాదకీయం: బలపడిన సాంప్రదాయక మైత్రి

Sampadakeeyam-Logoసోవియట్ యూనియన్ కాలంలో పరిఢవిల్లిన భారత్ స్నేహ-సహకార సంబంధాలు ఆ యూనియన్ కూలిపోయిన అనంతరం రష్యాతో సన్నగిల్లు తున్న వాస్తవం నిరాకరించలేనిది. భారత ప్రభుత్వం పశ్చిమదేశాల్లో ముఖ్యంగా అమెరికాలో కొత్తమిత్రులను వెదుక్కుంటూ తన విదేశాంగ విధానం ప్రాధాన్యతను అటు సారించింది. ప్రభావవంతమైన అన్ని దేశాలతో వ్యూహాత్మక సంబంధాలనే విధానంతో అమెరికాకు సన్నిహిత మిత్రుడు అన్నంతగా దగ్గరైంది. డాక్టర్ మన్మోహన్‌సింగ్ పాలనాకాలంలో కుదుర్చుకున్న పౌర అణుశక్తి సహకార ఒప్పందం (1 2 3) ఆ మలుపును స్పష్టం చేయగా, నరేంద్రమోడీ ప్రభుత్వం ఇటీవల సంతకాలు చేసిన లాజిస్టిక్స్ ఒప్పందం (మన దేశ నావికా, వైమానిక స్థావరాలను అమెరికా వినియోగించుకునేందుకు అనుమతించిన తొట్టతొలి ఒప్పందం) ఆ బంధాన్ని పరాకాష్టకు తీసుకెళ్లింది. అలాగే ఫ్రాన్స్‌తో రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందం ఖరారు చేసుకుంది. సాంప్రదాయకంగా మన రక్షణరంగం రష్యాతో ముడివడి ఉన్నప్పటికీ భారతప్రభుత్వం ఆ దేశంతో సంబంధాలు సన్నగిల్ల చేస్తున్నదనే భావన బలపడుతున్న దశలో గోవాలో అద్భుతం జరిగింది. రష్యా అధ్యక్షుడు పుతిన్, భారత ప్రధాని నరేంద్రమోడీ వార్షిక సమావేశంలో సంతకాలు జరిగిన 16 ఒప్పందాలు కొత్త అధ్యాయం తెరిచాయి. రక్షణ ఒప్పందాల విషయంలో పురాతన మిత్రునిలో భారతప్రభుత్వం తిరిగి సంపూర్ణ విశ్వాసం ఉంచినట్లు విదితమైంది. రష్యానుండి కొనుగోలులో సుదూర గురి కలిగిన గగనతల రక్షణ వ్యవస్థ అయిన ఎస్-400 ట్రింఫ్ మిస్సిలీలు (విలువ రూ.39వేలకోట్లు), కమోవ్ 226టి హెలికాప్టర్లు, నాలుగు క్రివాక్ తరగతి అగోచర యుద్ధ నౌకలు ఉన్నాయి. హెలికాప్టర్లతో పాటు యుద్ధనౌకలను కూడా మనదేశంలోనే నిర్మిస్తారు. తమిళనాడులోని కుడంకుళంలో తొలి యూనిట్ పని ప్రారంభించిన అణు విద్యుత్కేంద్రంలో మరో రెండు యూనిట్లను రష్యా నిర్మిస్తుంది. అణు సహకార ఒప్పందాన్ని ఒత్తిడిచేసి సాధించుకున్న అమెరికా- తమ కార్పొరేట్ల గొంతెమ్మ కోర్కెల కారణంగా (మనదేశం వంగినా బోర్లా పడమంటున్నాయి) ఎనిమిదేళ్లు గడిచినా ఒక్క అణు విద్యుత్కేంద్రం నిర్మాణం మొదలుపెట్టలేదు.

తాజా ఒప్పందాలతో రష్యా తిరిగి క్రియాశీల భాగస్వామిగాముందుకు వచ్చింది. మోడీ వ్యాఖ్యలు రష్యాతో మైత్రి ప్రాధాన్యతను వక్కాణించాయి. “భారతదేశ ప్రధాన రక్షణ, వ్యూహాత్మక భాగస్వామిగా రష్యా కొనసాగుతుంది. ఫుతిన్‌తో నా సమావేశం రాను న్న సంవత్సరాల్లో గాఢమైన రక్షణ, ఆర్థిక సంబంధాలకు పునాదులు వేసింది” అన్నారు. ఒక రష్యన్ సామెతను సందర్భోచితంగా ఉట్టంకించారు:“ఇద్దరు కొత్త మిత్రుల కన్నా ఒక పాత మిత్రుడు మేలు”. సోవియట్ యూనియన్ కీలకరంగాల్లో భారతదేశ స్వావలంబన కృషికి పెద్ద ఎత్తున సహాయపడటమే కాక ఆపత్కాలంలో అండగా నిలబడిన సందర్భాలు గుర్తుచేసుకోదగినవి. కశ్మీర్ సమస్యపై అనేక పర్యాయాలు ఐరాసలో భారత్ కు రక్షగా నిలిచింది. బాంగ్లాదేశ్ విముక్తి సందర్భంలో 1971లో పాకిస్థాన్‌తో యుద్ధ సమయంలో అమెరికా సప్తమ నౌకాదళం పాకిస్థాన్ పక్షాన మన సముద్రజలాల్లోకి బయలుదేరగా నిరోధించింది సోవియట్ హెచ్చరికే. మనదేశంలో ఆయిలు అన్వేషించ టంతోపాటు పుష్కలంగా సరఫరా చేసిందీ ఆ దేశమే. అందువల్ల అత్యంత కీలకమైన రక్షణ, ఇంధన రంగాల్లో ఇరుదేశాల బంధం వ్యూహాత్మక సంబంధాల్లో కీలకపాత్ర వహించింది. వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం (భారత్) ఇంధనం పుష్కలంగా ఉన్న దేశం(రష్యా) మధ్య వృద్ధిచెందే సహకారం భారత దేశ అభివృద్ధిపై గొప్ప ప్రభావం చూపుతుంది. సైబీరియాలో కొన్ని బావుల్లో ఇప్పటికే పెట్టు బడి పెట్టిన ఒఎన్‌జిసి విదేశ్ మరికొన్ని బావులు కొనుగోలు చేయనుంది. ఆయిల్ సరఫరా కు సైబీరియానుంచి భారత్‌కు పైపులైన్ (6వేల కిమీలు)ఆలోచన కార్యరూపం దాల్చితే మన ఇంధన కొరత తీరుతుంది. మనదేశంలో రెండవ పెద్ద ప్రైవేటు ఆయిల్ కంపెనీ ఎస్సార్‌ను రష్యా కొనుగోలు చేయటం (రూ.86,726 కోట్లు) అతి పెద్ద ఎఫ్‌డిఐ అవుతుం ది. అయితే మోడీ ప్రభుత్వం అమెరికాతో అనుబంధాన్ని తగ్గించుకుంటుందని అర్థం కాదు. పాకిస్థాన్ నుంచి సాగుతున్న ‘సీమాంతర ఉగ్రవాదం’ విషయంలో భారత్ వైఖరిని రష్యా అధ్యక్షుడు బలపరచటం, పాకిస్థాన్‌తో రక్షణ సంబంధాలు పెట్టుకోబోమని హామీ ఇవ్వటం టెర్రరిజంపై పోరాటంలో భారత్‌కు కొండంత అండ అవుతుంది.