Home స్కోర్ సిరీస్ పై భారత్ కన్ను

సిరీస్ పై భారత్ కన్ను

India second Vande against England on Saturday

లండన్: వరుస విజయాలతో జోరుమీదున్న టీమిండియా శనివారం ఇంగ్లండ్‌తో జరిగే రెండో వన్డేకు ఆత్మవిశ్వాసంతో సిద్ధమైంది. ఈ మ్యాచ్‌లోనూ గెలిచి వన్డే సిరీస్‌ను సొంతం చేసుకోవాలనే పట్టుదలతో భారత్ ఉంది. మరోవైపు ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలని ఆతిథ్య ఇంగ్లండ్ తహతహలాడుతోంది. సిరీస్‌లో నిలువాలంటే ఈ మ్యాచ్‌లో తప్పక గెలవాల్సిన పరిస్థితి ఇంగ్లండ్‌కు నెలకొంది. దీంతో ఈ మ్యాచ్ ఇంగ్లండ్ జట్టుకు చావోరేవోగా మారింది. కాగా, ఇప్పటికే ట్వంటీ20 సిరీస్‌ను సొంతం చేసుకున్న కోహ్లి సేన వన్డేల్లోనూ అదే సంప్రదాయాన్ని కొనసాగించాలనే లక్షంతో ఉంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో భారత్ చాలా బలంగా ఉంది. దీంతో ఈ మ్యాచ్‌లోనూ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది.
జోరుమీదున్నాడు…
భారత ఓపెనర్ రోహిత్ శర్మ భీకర ఫాంలో ఉన్నాడు. వరుసగా రెండు సెంచరీలతో భారత్‌కు ఒంటిచేత్తో విజయాలు సాధించి పెట్టాడు. ఆఖరి టి20లో అజేయ శతకం సాధించిన రోహిత్ తొలి వన్డేలోనూ సెంచరీతో మెరిశాడు. ఈసారి కూడా జట్టుకు కీలకంగా మారాడు. తన మార్క్ ఆటతో చెలరేగి పోతున్న రోహిత్‌ను కట్టడి చేయడం ఇంగ్లండ్‌కు శక్తికి మించిన పనిగా మారింది. కిందటి మ్యాచ్‌లో రోహిత్ అసాధారణ బ్యాటింగ్‌తో చెలరేగి పోయాడు. ఇక, తొలి వన్డేలో శిఖర్ ధావన్ కూడా రాణించడం భారత్‌కు కలిసి వచ్చే అంశం. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేయగలిగే సత్తా కలిగిన ధావన్ విజృంభిస్తే ఇంగ్లండ్ కష్టాలు రెట్టింపు కావడం ఖాయం. టి20 సిరీస్‌లో విఫలమైన ధావన్ తొలి వన్డేలో రాణించడం ద్వారా మళ్లీ గాడిలో పడ్డాడు. ఈ మ్యాచ్‌లో కూడా మెరుపులు మెరిపించాలనే లక్షంతో ఉన్నాడు. మరోవైపు లోకేష్ రాహుల్ రూపంలో మరో మ్యాచ్ విన్నర్ ఉండనే ఉన్నాడు. తొలి వన్డేలో రాహుల్‌కు బ్యాటింగ్ చేసే అవకాశం పెద్దగా రాలేదు. ఈ మ్యాచ్‌లో అవకాశం లభిస్తే చెలరేగి పోయేందుకు సిద్ధంగా ఉన్నాడు. కెప్టెన్ విరాట్ కోహ్లి కూడా తొలి వన్డేలో మెరుపులు మెరిపించాడు. కోహ్లి ఫాంలోకి రావడం భారత్‌కు అతి పెద్ద ఊరటగా చెప్పాలి. ఈ మ్యాచ్‌లో కూడా రాణించేందుకు సిద్ధమయ్యాడు. మహేంద్ర సింగ్ ధోని, సురేశ్ రైనా, హార్దిక్ పాండ్య తదితరులతో భారత బ్యాటింగ్ చాలా బలంగా ఉంది. దీంతో ఇంగ్లండ్ బౌలర్లకు లార్డ్‌లోనూ ఇబ్బందులు తప్పెలా లేవు.
కుల్దీప్ హల్‌చల్…
ఇంగ్లండ్ పర్యటనలో యువ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ఆకాశమే హద్దుగా చెలరేగి పోతున్నాడు. తొలి ట్వంటీ20లో అద్భుత బౌలింగ్‌ను కనబరిచి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించిన కుల్దీప్ మొదటి వన్డేలోనూ చెలరేగి పోయాడు. ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్‌ను హడలెత్తించిన కుల్దీప్ ఏకంగా ఆరు వికెట్లు పడగొట్టి పెను ప్రకంపనలే సృష్టించాడు. కుల్దీప్‌ను ఎలా ఎదుర్కొవాలో మోర్గాన్ సేనకు అంతుబట్టకుండా మారింది. మరోవైపు కుల్దీప్ ఈ మ్యాచ్‌లోనూ ఇంగ్లండ్ బౌలర్లను హడలెత్తించాలనే లక్షంగా కనిపిస్తున్నాడు. లార్డ్‌లో రాణించడం ద్వారా భారత్‌కు సిరీస్ అందించాలని తహతహలాడుతున్నాడు. ఉమేశ్ యాదవ్, చాహల్, సిద్ధార్థ్ కౌల్ తదితరులతో భారత బౌలింగ్ చాలా బలంగా ఉంది. ఇక, ఆల్‌రౌండ్‌షో అదరగొట్టేందుకు హార్ధిక్ పాండ్య ఉండనే ఉన్నాడు. దీంతో ఈ మ్యాచ్‌లోనూ భారత్‌ను ఎదుర్కొవడం ఇంగ్లండ్‌కు చాలా కష్టమని చెప్పాలి.
ఒత్తిడిలో మోర్గాన్ సేన…
మరోవైపు తొలి మ్యాచ్‌లో ఘోర పరాజయం పాలైన ఇంగ్లండ్ ఒత్తిడిలో కనిపిస్తోంది. సిరీస్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలంటే ఈ మ్యాచ్‌లో తప్పక గెలవాల్సిన స్థితి ఇంగ్లండ్‌ను నెలకొంది. దీంతో చావోరేవో తేల్చుకోవాలని ఇంగ్లండ్ భావిస్తోంది. అయితే కీలక ఆటగాడు అలెక్స్ హేల్స్ గాయం వల్ల సిరీస్‌కు దూరం కావడం ఇంగ్లండ్‌కు పెద్ద ఎదురు దెబ్బగా చెప్పాలి. రెండో టి20లో హేల్స్ అద్భుత బ్యాటింగ్‌తో ఇంగ్లండ్‌ను గెలిపించాడు. ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లోనూ నిలకడగా రాణించాడు. కాగా, గాయం వల్ల అతను సిరీస్‌కు అందుబాటులో లేకుండా పోయాడు. ఇంగ్లండ్ సేనను మరింత కలవరానికి గురి చేస్తోంది. కిందటి మ్యాచ్‌లో ఓడిన ఇంగ్లండ్ ఒత్తిడిని తట్టుకొని ముందుగా వెళ్లడం అనుకున్నంత తేలికకాదు. అయితే సొంత గడ్డపై ఆడుతుండడం, గతంతో పోల్చితే జట్టులో గెలవాలనే తపన పెరగడం జట్టుకు సానుకూల అంశాలు. ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌లో నిలువాలనే ఏకైక లక్షంతో ఇంగ్లండ్ పోరుకు సిద్ధమైంది. బట్లర్, బైర్‌స్టో, మోర్గాన్, రూట్, బెన్‌స్టోక్స్, మొయిన్ అలీ తదితరులతో ఇంగ్లండ్ బలంగానే ఉంది. సమష్టిగా రాణిస్తే భారత్‌ను ఓడించడం అసాధ్యమేమి కాదని చెప్పాలి.