Home స్కోర్ మరో సిరీస్‌పై భారత్ గురి

మరో సిరీస్‌పై భారత్ గురి

test

జోరుమీదున్న కోహ్లి సేన, లంకకు చెలగాటం
నేటి నుంచి తొలి టెస్టు

కోల్‌కతా: వరుస విజయాలతో దూకుడుమీదున్న టీమిండియా మరో సిరీస్‌పై కన్నేసింది. స్వదేశంలో శ్రీలంకతో జరిగే మూడు మ్యాచ్‌ల టెస్టు పోరాటానికి గురువారం చారిత్రక ఈడెన్ గార్డెన్‌లో తెరలేవనుంది. ఇరు జట్ల మధ్య ఇక్కడ మొదటి టెస్టు మ్యాచ్ జరుగనుంది. ఈ సిరీస్‌లో భారత్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. కిందటి సిరీస్‌లో శ్రీలంకను వారి సొంతగడ్డపై చిత్తు చిత్తుగా ఓడించిన కోహ్లి సేన ఈసారి కూడా అదే జోరును కొనసాగించాలనే పట్టుదలతో ఉంది. పరిస్థితులు కూడా భారత్‌కే అనుకూలంగా ఉన్నాయి. అయితే రంగన హెరాత్ వంటి మ్యాచ్ విన్నర్ బౌలర్ ఉన్న లంకను కూడా తక్కువ అంచనా వేయలేం. ఇటీవలే యూఎఇ వేదికగా పాకిస్థాన్‌తో జరిగిన రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను లంక క్లీన్‌స్వీప్ చేసిన విషయం తెలిసిందే. కెప్టెన్ దినేష్ చండీమల్, ఓపెనర్ దిముత్ కరుణరత్నె, లహిరు తిరిమన్నె, మాథ్యూస్, వికెట్ కీపర్ నిరోశన్ డిక్వెల్లా వంటి ప్రతిభావంతులు లంకకు అందుబాటులో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ఏమాత్రం నిర్లక్షంగా ఆడిన చేదు అనుభవం చవి చూడక తప్పదు.
ఓపెనర్లపై ఉత్కంఠ
ఈ మ్యాచ్‌లో టీమిండియా ఓపెనర్లుగా ఎవరు బరిలోకి దిగుతారన్నది అందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తున్న అంశం. ఓపెనింగ్ స్థానం కోసం శిఖర్ ధావన్, మురళీవిజయ్, కెఎల్.రాహుల్‌ల మధ్య ముక్కోణపు పోటీ నెలకొంది. వీరిలో బరిలోకి దిగే ఇద్దరు ఓపెనర్లు ఎవరన్నది ఇటు కెప్టెన్‌గాని, అటు జట్టు యాజమాన్యంకానీ ప్రకటించలేదు. అయితే విశ్లేషకులు మాత్రం మురళీ విజయ్, కెఎల్.రాహుల్‌లు ఇన్నింగ్స్‌ను ప్రారంభించడం ఖాయమని జోస్యం చెబుతున్నారు. కాగా, తుది జట్టులో ఎవరు ఎంపికైన వారికి ఈ మ్యాచ్ ప్రతిష్టాత్మకమేనని చెప్పాలి. ఇందులో విఫలమైతే తర్వాతి టెస్టులో చోటు సంపాదించడం కష్టమేనని చెప్పాలి. దీంతో చోటు లభిస్తే సత్తా చాటేందుకు ధావన్, రాహుల్, విజయ్ త్రయం తహతహలాడుతోంది.
కోహ్లిపైనే అందరి కళ్లు
అసాధారణ బ్యాటింగ్ ప్రపంచ క్రికెట్‌ను శాసిస్తున్న భారత కెప్టెన్ విరాట్ కోహ్లికి ఈ సిరీస్ ప్రత్యేకంగా మారింది. రానున్న దక్షిణాఫ్రికా సిరీస్ నేపథ్యంలో జట్టు బలబలాలను ఈ సిరీస్ ద్వారా తెలుసుకోవాలనే లక్షంతో ఉన్నాడు. ఈ నేపథ్యంలో సిరీస్‌లో అతని వ్యూహాలు ఎలా ఉంటాయనే దానిపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. అద్భుత కెప్టెన్సీతో భారత్‌కు పలు సిరీస్‌లలో విజయాలు సాధించి పెడుతున్న కోహ్లి ఈసారి కూడా సంప్రదాయాన్ని కొనసాగించాలనే పట్టుదలతో కనిపిస్తున్నాడు. ఇదే క్రమంలో తన బ్యాటింగ్ ఫాంను కొనసాగించేందుకు సిద్ధమయ్యాడు. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేయగలిగే సత్తా కలిగిన కోహ్లి చెలరేగితే లంక బౌలర్లకు కష్టాలు ఖాయం.
జోరుమీదున్న పుజారా

ఇక, సిరీస్‌లో భారత్ ఆశలన్నీ నయా వాల్ చటేశ్వర్ పుజారాపైనే నిలిచాయి. కౌంటీ క్రికెట్‌తో పాటు రంజీ ట్రోఫీలో కూడా నిలకడైన బ్యాటింగ్‌తో ఆకట్టుకున్న పుజారా లంకపై కూడా మెరుపులు మెరిపించేందుకు సిద్ధమయ్యాయి. ఇటీవల భారత్ సాధిస్తున్న సిరీస్ విజయాల్లో పుజారా పాత్ర చాలా కీలకం. పలు మ్యాచుల్లో అతను జట్టు ను ఆదుకున్నాడు. క్లిష్ట సమయాల్లో చిరస్మరణీయ పోరాట పటిమతో జట్టుకు అం డగా నిలువవడంలో పుజారా దిట్టగా పే రు తెచ్చుకున్నాడు. ఈసారి కూడా జట్టు అతనిపై భారీ నమ్మకాన్నే పెట్టుకుంది. సహచరులతో కలిసి ఇన్నింగ్స్‌ను మరమ్మతు చేయడంలో పుజారాకు మరో ద్రవిడ్‌గా పేరు వచ్చింది. ద్రవిడ్‌కు దీ టుగా పుజారా కూడా అంతర్జాతీయ క్రి కెట్‌లో ప్రకంపనలు సృష్టిస్తున్నాడు. ఈ సారీ చెలరేగేందుకు సిద్ధంగా ఉన్నాడు.
రహానె x రోహిత్
మరోవైపు మిడిలార్డర్‌లో స్థానం కోసం రోహి త్ శర్మ, వైస్ కెప్టెన్ అజింక్య రహానె మధ్య తీవ్ర పోటీ నెలకొంది. తుది జట్టులో స్థానం కోసం ఇద్దరు తీవ్రంగా పోరాడాల్సిన స్థితి ఏర్పడింది. అయితే టెస్టుల్లో కాస్త మెరుగైన రికార్డును కలిగిన రహానెకు తొలి టెస్టు ఆడే అవకాశం దక్కడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో రోహిత్ పెవిలియన్‌కే పరిమితం కాక తప్పదు. కాగా, కోహ్లి, పుజారా, వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా, ఆల్‌రౌండర్లు అశ్విన్, జడేజాలతో భారత బ్యాటింగ్ చాలా బలంగా ఉంది.
అశ్విన్, జడేజాలకు కీలకం..
కాగా, చాలా రోజుల విశ్రాంతి తర్వాత మళ్లీ అంతర్జాతీ య క్రికెట్ ఆడుతున్న భారత ప్రధాన బౌలర్లు రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాలకు ఈ సిరీస్ చాలా కీలకంగా మారింది. జడేజా ఒకసారి వన్డే జట్టుకు ఎంపికైనా అతని కి తుది జట్టులో ఆడే అవకాశం దక్కలేదు. మరోవైపు అ శ్విన్ మాత్రం శ్రీలంకతో టెస్టు సిరీస్ ముగిసిన తర్వాత భారత్‌కు ప్రాతినిథ్యం వహించడం ఇదే తొలిసారి. ఈ నేపథ్యంలో అతను ఎలా బౌలింగ్ చేస్తాడనే దానిపై ఆసక్తి నెలకొంది. చాలా రోజుల తర్వాత మళ్లీ టెస్టు మ్యాచ్ జరుగుతుండడం, వన్డేలు, టి20లలో అతనికి విశ్రాంతి క ల్పించడం తదితర కారణాలతో అశ్విన్‌కు సరైన ప్రాక్టీస్ లభించలేదు. రంజీల్లో కూడా ఆడింది తక్కువే. అయితే అశ్విన్ మాత్రం రాణిస్తాననే నమ్మకంతో ఉన్నాడు. జడేజా కూడా ఇదే లక్షంతో ఉన్నాడు. కాగా, యువ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌కు తుది జట్టులో స్థానం లభించడం కష్టంగా కనిపిస్తోంది. రానున్న దక్షిణాఫ్రికా సిరీస్ నేపథ్యంలో లంకపై ముగ్గురు ఫాస్ట్ బౌలర్లతో బరిలోకి దిగాలని కెప్టెన్ కోహ్లి భావిస్తున్నాడు. దీంతో కుల్దీప్ ఈ మ్యాచ్‌లో ఆడడం క ష్టంగా కనిపిస్తోంది. మరోవైపు ఫాస్ట్ బౌలింగ్ విభాగంలో ఉమేశ్ యాదవ్, మహ్మద్ షమిలు బరిలోకి దిగడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే మూడో బౌలర్ స్థానం కోసం ఇషాంత్ శర్మ, భువనేశ్వర్‌ల మధ్య పోటీ నెలకొంది. రంజీల్లో రాణించడం ద్వారా ఇషాంత్ జోరుమీదున్నాడు. మరోవైపు భువనేశ్వర్ వన్డేలు, టి20లలో సత్తా చాటి టెస్టు జట్టులో స్థానం దక్కించుకున్నాడు. వీరిలో ఎవరికి తుది జట్టులో స్థానం దక్కుతుందనే ఇంకా తేలాల్సి ఉంది.

లంకకు సవాలు
కిందటి సిరీస్‌లో భారత్ చేతిలో ఘోర పరాజయం చవిచూసిన శ్రీ లంకకు ఈ సిరీస్ చాలా క్లిష్టంగా మారింది. వరుస విజయాలతో ప్ర పంచ క్రికెట్‌లో ఎదురులేని శక్తిగా మారిన భారత్‌ను ఎదుర్కొవడం లంకకు అంత సులువు కాదు. ఈ సిరీస్‌లో మెరుగైన ప్రదర్శన కనబరచాలంటే లంక సర్వం ఒడ్డి పోరాడక తప్పదు. కెప్టెన్ చండీమల్, మాజీ కెప్టెన్ మాథ్యూస్, ఓపెనర్ కరుణరత్నె, వికెట్ కీపర్ డిక్వెల్లా, మిడిలార్డర్ ఆటగాడు తిరిమన్నెపై లంక భారీ ఆశలు పెట్టుకుంది. కిందటి పాకిస్థాన్ సిరీస్‌లో కరుణరత్నె, సమరవిక్రమ, డిక్వెల్లా అసాధారణ రీతిలో చెలరేగి పోయారు. దీంతో లంక టెస్టు సిరీస్‌లో క్లీన్‌స్వీప్ సాధించింది. ఈసారి కూడా లంక భారీ ఆశలతో బరిలోకి దిగుతోంది. ప్రాక్టీ స్ మ్యాచ్‌లో టాప్ ఆర్డర్ రాణించడం లంకకు ఊరటనిచ్చే విషయం. ఇక బౌలింగ్‌లో లంక ఆశలన్నీ సీనియర్ బౌలర్ రంగన హెరాత్‌పైనే ఆధారపడి ఉన్నాయి. హెరాత్‌పైనే లంక ఆశలు పెట్టుకుంది. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేయగలిగే సత్తా కలిగిన హెరాత్ చెలరేగితే భారత బ్యాట్స్‌మెన్‌కు కష్టాలు ఖాయం. అయితే కిందటిసారి సొంత గడ్డపై భారత్‌తో జరిగిన సిరీస్‌లో హెరాత్ ఆశించిన విధంగా రాణించలేక పోయాడు. సురంగ లక్మల్, దిల్రువన్ పెరీరా, ధనంజయ డిసిల్వా, విశ్వఫెర్నాండోలతో లంక బౌలింగ్ కాస్త బలంగానే ఉంది. అయితే అనుభవలేమి వీరికి ప్రతికూలంగా మారనుంది. కాగా, సమష్టి పోరాటంతో భారత్‌కు గట్టి పోటీ ఇవ్వాలనే లక్షంతో లంక యువ జట్టు టెస్టు సమరానికి సిద్ధమైంది.

జట్ల వివరాలు:
భారత్: విరాట్ కోహ్లి (కెప్టెన్), అజింక్య రహానె (వైస్ కెప్టెన్), శిఖర్ ధావన్, మురళీ విజయ్, కెఎల్.రాహుల్, చటేశ్వర్ పుజారా, రోహిత్ శర్మ, వృద్ధిమాన్ సాహా, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమి, ఇషాంత్ శర్మ, భువనేశ్వర్ కుమార్, ఉమేశ్ యాదవ్.
శ్రీలంక: దినేష్ చండీమల్ (కెప్టెన్), కరు ణరత్నె, ధనంజయ డిసిల్వా, సదీరా సమ రవిక్రమ, మాథ్యూస్, లహిరు తిరిమన్నె, రంగన హెరాత్, సురంగ లక్మల్, దిల్రువన్ పెరీరా, లహిరు గమాగె, లక్షన్ సండాకన్, విశ్వ ఫెర్నాండో, దసున్ శనకా, డిక్వెల్లా, రోశన్ సిల్వా.