Home తాజా వార్తలు టీ20ల్లో టీమిండియా అరుదైన రికార్డు!

టీ20ల్లో టీమిండియా అరుదైన రికార్డు!

India thrash Ireland by 143 runs for biggest T20I win

డబ్లిన్: టీ20ల్లో టీమిండియా మరో అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. డబ్లిన్‌లో శుక్రవారం రాత్రి ఐర్లాండ్‌తో జరిగిన చివరిదైన రెండో టీ20 మ్యాచ్‌లో కోహ్లీ సేన 143 పరుగుల తేగాతో బంపర్ విక్టరీ నమోదు చేసింది. టీ20ల్లో భారత జట్టుకు ఇదే అతిపెద్ద విజయం. ఇంతకుముందు గతేడాది డిసెంబరులో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో 93 పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ రికార్డును తిరగరాసింది. ఇక నిన్నటి మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 213 భారీ స్కోర్ చేసింది. కెఎల్ రాహుల్(36 బంతుల్లో 70 పరుగులు: 6×6, 4×3), సురేష్ రైనా(45 బంతుల్లో 69 పరుగులు: 6×3, 4×5) రాణించారు. అలాగే చివరలో యువ ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యా 9 బంతుల్లో 4 సిక్స్, ఒక ఫోర్ సాయంతో 32 పరుగులతో వీరవిహారం చేశాడు. దీంతో భారత్ ఆతిథ్య జట్టుకు 214 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్ధారించింది. అనంతరం భారీ టార్గెట్‌తో బ్యాటింగ్‌కు దిగిన ఐర్లాండ్ జట్టు 70 పరుగులకే కుప్పకూలింది. దాంతో కోహ్లీసేన ఏకంగా 143 పరుగుల తేడాతో భారీ విజయం సాధించి అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకుంది. ఈ విజయంతో రెండు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌ను 2-0 తేడాతో భారత్ క్లీన్‌స్వీప్ చేసింది.