Home తాజా వార్తలు 29 అమెరికా వస్తువులపై సుంకం పెంపు

29 అమెరికా వస్తువులపై సుంకం పెంపు

US india

 

ఈ నెల 16 నుంచి అమలు
యుఎస్‌పై భారత్ ప్రతీకార చర్య

న్యూఢిల్లీ : అమెరికా టారిఫ్‌ల పెంపునకు ప్రతీకారంగా భార త్ కూడా చర్యలు చేపట్టింది. అనేకసార్లు గడువును పొడిగించిన తర్వాత 29 అమెరికా ఉత్పత్తులపై అదనపు కస్టమ్స్ సుం కాన్ని విధించాలని భారత్ నిర్ణయించింది. సుంకం పెంచిన వాటిలో బాదం, వాల్‌నట్, పప్పు ధాన్యాలు ఉన్నాయి. ఈ పెంపు ఈ నెల 16 నుంచి అమల్లోకి రానుంది. ఈమేరకు ఆర్థిక మంత్రిత్వశాఖ నోటిఫికేషన్‌ను జారీ చేయనుందని అధికారులు తెలిపారు. భారత్ తీసుకున్న తాజా నిర్ణయంతో 29 ఉత్పత్తులను ఎగుమతి చేస్తున్న అమెరికా వ్యాపారులపై భారం పడనుంది. అయితే ఈ దిగుమతుల నుంచి భారత్ అదనంగా 217 మిలియన్ డాలర్ల (రూ.1,514 కోట్ల) రెవెన్యూను పొం దనుంది. స్టీలు, అల్యూమీనియం ఉత్పత్తులపై పన్నును పెంచు తూ అమెరికా నిర్ణయం తీసుకోవడంతో 2018 జూన్ 21న భారత ప్రభుత్వం కూడా ప్రతీకారంగా కొన్ని వస్తువులపై పన్నులను పెంచుతామని ప్రకటించింది. ఈ నిర్ణయంపై అమెరికాకు భారత్ సమాచారం కూడా అందించింది.

గతేడాది మార్చి నెలలో స్టీల్, అల్యూమీనియంపై పన్నును 10 శాతం నుంచి 25 శాతానికి పెంచుతూ అమెరికా నిర్ణయం తీసుకుంది. ఈ వస్తువులను దిగుమతి చేసుకునే ప్రధాన దేశాల్లో భారత్ ఒకటి, అయితే అమెరికా నిర్ణయం వల్ల భారత్‌పై 240 మిలియన్ డాలర్ల ప్రభావం పడనుంది. ప్రతీకారంగా అమెరికాకు ఎగుమతి చేసే వస్తువులపై పన్నును పెంచుతామని భారత్ ప్రకటించినప్పటికీ యుఎస్ ఏమైనా పరిష్కారం చూపుతుందేమోననే ఆశతో పలుమార్లు గడువును పొడిగిస్తూ వచ్చింది. ఇరు దేశాల మధ్య చర్చలు జరిగినప్పటికీ ఎలాంటి ఫలితం రాలేదు. తదనంతరం ఈ చర్యలు కూడా నిలిచిపోవడం, జిఎస్‌పి(ప్రాధాన్యతల సాధారణ వ్యవస్థ) కార్యక్రమం కింద భారత్ ఎగుమతిదారులకు ప్రోత్సాహకాలను రద్దు చేస్తూ అమెరికా మళ్లీ నిర్ణయం తీసుకుంది. జూన్ 5 నుంచి ఇది అమల్లోకి వచ్చింది. దీంతో భారత్ నుంచి ఎగుమతి చేసే 5.5 బిలియన్ ఉత్పత్తులపై ప్రభావం పడనుంది. ఈ పరిణామాలను చూసిన భారత్ కూడా అమెరికాపై ప్రతీకారంగా 29 వస్తువులపై పన్నులను పెంచాలని నిర్ణయించింది.

మేలో 4 శాతం పెరిగిన ఎగుమతులు

మే నెలలో దేశీయ ఎగుమతుల వృద్ధి 30 బిలియన్ డాలర్లతో 3.93 శాతం వృద్ధిని సాధించింది. కెమికల్స్, ఫార్మాస్యూటికల్స్, ఇంజినీరింగ్ వంటి రంగాల్లో ఆరోగ్యకరమైన వృద్ధితో మే నెలలో ఎగుమతులు పెరిగాయి. ఈమేరకు కేంద్ర వాణిజ్య మంత్రిత్వశాఖ శుక్రవారం గణాంకాలను వెల్లడించింది. మే నెలలో దిగుమతులు కూడా 45.35 బిలియన్ డాలర్లతో 4.31 శాతం పెరిగాయి. దీంతో గత నెలలో వాణిజ్య లోటు 15.36 బిలియన్ డాలర్లకు చేరింది. ఎగుమతులు, దిగుమతుల మధ్య తేడానే వాణిజ్య లోటు.. 2018 మే నెలలో ఈ లోటు 14.62 బిలియన్ డాలర్లుగానే ఉంది. చమురు దిగుమతులు 12.44 బిలియన్ డాలర్లతో 8.23 శాతం పెరగ్గా, చమురు యేతర దిగుమతులు 32.91 బిలియన్ డాలర్లతో 2.9 శాతానికి పెరిగాయి. బంగారం దిగుమతులు 4.78 బిలియన్ డాలర్లతో 37.43 శాతం పెరిగాయి.

India to impose retaliatory tariff on 29 US items