Home స్కోర్ సిరీసే లక్ష్యంగా భారత్

సిరీసే లక్ష్యంగా భారత్

దక్షిణాఫ్రికాకు చావోరేవో
డివిలియర్స్‌పైనే
నేడు నాలుగో వన్డే

Kohli

జోహెనస్‌బర్గ్: హ్యాట్రిక్ విజయాలతో దూకుడు మీదున్న టీమిండియా తాజాగా సిరీస్‌పై కన్నేసింది. శనివారం దక్షిణాఫ్రికాతో జరిగే నాలుగో వన్డేలో గెలిచి సిరీస్‌ను సొంతం చేసుకోవాలని తహతహలాడుతోంది. మరోవైపు స్టార్ ఆటగాడు ఎబి.డివిలియర్స్ రాకతో దక్షిణాఫ్రికా కూడా సమరోత్సాహంతో పోరుకు సిద్ధమైంది. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేయగలిగే సత్తా కలిగిన డివిలియర్స్‌పై ఆతిథ్య జట్టు భారీ ఆశలే పెట్టుకుంది. వరుసగా మూడు మ్యాచ్‌లు గెలిచి సిరీస్‌ను సమం చేయాలనే పట్టుదలతో కనిపిస్తోంది. కాగా, ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా పింక్ డ్రెస్‌లో బరిలోకి దిగనుంది. పింక్ డ్రెస్‌లో ఆడిన ఐదు మ్యాచుల్లోనూ గెలిచిన ఘనత సౌతాఫ్రికాకు ఉంది. ఈసారి కూడా ఆ సెంటిమెంట్ కలిసి వస్తుందనే నమ్మకంతో బరిలోకి దిగనుంది. ఇక, వరుస గెలుపులతో కోహ్లి సేన జోరుమీదుంది. కెప్టెన్ కోహ్లి ఇప్పటికే రెండు శతకాలతో సత్తా చాటాడు. ఈసారి కూడా భారీ ఇన్నింగ్స్‌పై కన్నేశాడు. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేయగలిగే సత్తా కలిగిన కోహ్లి జట్టును ముందుండి నడిపిస్తున్న విషయం తెలిసిందే. ఇక, స్పిన్ ద్వయం యజువేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్‌లు మరోసారి విజృంభించేందుకు సిద్ధంగా ఉన్నారు. బుమ్రా, భువనేశ్వర్‌లతో ఫాస్ట్ బౌలింగ్ కూడా బలంగా ఉంది. దీంతో భారత్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది.
రోహిత్ ఈసారైనా…
వరుసగా మూడు మ్యాచుల్లో విఫలమైన ఓపెనర్ రోహిత్ శర్మకు ఈ మ్యాచ్ చావోరేవోగా మారింది. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేయగలిగే సత్తా కలిగిన రోహిత్ దక్షిణాఫ్రికా గడ్డపై ఘోరంగా విఫలమయ్యాడు. మూడు మ్యాచుల్లో కూడా నిరాశ పరిచాడు. అతని వైఫల్యం జట్టును వెంటాడుతోంది. కనీసం ఈ మ్యాచ్‌లోనైనా తన బ్యాట్‌కు పనిచెప్పాల్సిన బాధ్యత రోహిత్‌పై ఉంది. ఇందులో విఫలమైతే జట్టులో స్థానం మళ్లీ మొదటికొస్తోంది. విదేశాల్లో అంతంత మాత్రాంగనే రాణించే రోహిత్ తనపై ఉన్న ముద్రను చెరిపేసుకోవాలని భావిస్తున్నాడు. ఇందుకోసం భారీ ఇన్నింగ్స్‌తో సమాధానం చెప్పాలని సిద్ధంగా ఉన్నాడు. మరోవైపు శిఖర్ ధావన్ తన కెరీర్‌లో వందో వన్డే ఆడనున్నాడు. ఈ సిరీస్‌లో ధావన్ నిలకడగా ఆడుతున్నాడు. ఈ మ్యాచ్‌లో కూడా రాణించి చిరకాలం గుర్తుంచుకునేలా చూసుకోవాలని భావిస్తున్నాడు.
జోరుమీదున్నాడు..
మరోవైపు ఇప్పటికే రెండు సెంచరీలతో ప్రకంపనలు సృష్టించిన కెప్టెన్ విరాట్ కోహ్లి ఈ మ్యాచ్‌లో కూడా చెలరేగేందుకు సిద్ధమయ్యాడు. భీకర ఫాంలో ఉన్న కోహ్లి ఈసారి కూడా జట్టుకు కీలకంగా మారాడు. అతను చెలరేగితే ఈ మ్యాచ్‌లో గెలవడం భారత్‌కు కష్టమేమి కాదు. కిందటి మ్యాచ్‌లో అజేయ శతకంతో కోహ్లి చెలరేగి విషయం తెలిసిందే. సౌతాఫ్రికా బౌలర్లకు కొరకరాని కొయ్యగా మారిన కోహ్లిని కట్టడి చేయడం అనుకున్నంత తేలిక కాదనే చెప్పాలి. తన మార్క్ బ్యాటింగ్‌తో విజృంభిస్తే సఫారీ బౌలర్లకు మరోసారి ఇబ్బందులు ఖాయం. ఇక అజింక్య రహానె, కేదార్ జాదవ్, హార్దిక్ పాండ్య, సీనియర్ ఆటగాడు మహేంద్ర సింగ్ ధోనిలు కూడా తమ బ్యాట్‌కు పని చెప్పాల్సిన సమయం అసన్నమైంది. మూడో వన్డేల్లో వీరంత నిరాశ పరిచారు. కానీ, ఈసారి సత్తా చాటేందుకు సిద్ధంగా ఉన్నారు.
అందరి కళ్లు ఇద్దరిపైనే…
అసాధారణ బౌలింగ్‌తో సౌతాఫ్రికా బ్యాటింగ్ లైనప్‌ను కుప్పకూల్చుతున్న భారత స్పిన్ ద్వయం కుల్దీప్ యాదవ్, చాహల్‌లు ఈసారి కూడా విజృంభించేందుకు సిద్ధంగా ఉన్నారు. మూడు వన్డేల్లో కూడా ఈ ద్వయం అద్భుతంగా రాణించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో కూడా జట్టు వీరిపైనే ఆశలు పెట్టుకుంది. పిచ్ పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకుంటూ వీరిద్దరు వికెట్ల పంట పండిస్తున్నారు. కుల్దీప్‌తో పోల్చితే చాహల్ కాస్త మెరుగ్గా బౌలింగ్ చేస్తున్నాడు. ఈసారి కూడా అదే జోరును కొనసాగించేందుకు సిద్ధమయ్యాడు. కుల్దీప్ కూడా మూడో వన్డేలో నాలుగు వికెట్లు తీసి సత్తా చాటాడు. నాలుగో వన్డేలోనూ చెలరేగేందుకు తహతహలాడుతున్నాడు. బుమ్రా, హార్దిక్, భువనేశ్వర్, కేదార్‌లతో భారత బౌలింగ్ చాలా బలంగా ఉంది. దీంతో ఈసారి కూడా సౌతాఫ్రికాకు కష్టాలు తప్పక పోవచ్చు.
డివిలియర్స్
గాయం వల్ల తొలి మూడు వన్డేలకు దూరంగా ఉన్న విధ్వంసక బ్యాట్స్‌మన్ డివిలియర్స్ నాలుగో వన్డేలో బరిలోకి దిగనున్నాడు. ఇది సౌతాఫ్రికాకు ఊరట కలిగించే అంశమే. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేయగలిగే సత్తా డివిలియర్స్‌కు ఉంది. అంతేగాక భారత్‌పై అతనికి కళ్లు చెదిరే రికార్డు కూడా ఉండనే ఉంది. ఈ పరిస్థితుల్లో భారత బౌలర్లు ఏమాత్రం నిర్లక్షంగా వ్యవహరించిన భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. ఇక, హాషిం ఆమ్లా, కెప్టెన్ మార్‌క్రామ్, డుమిని, డేవిడ్ మిల్లర్, మోరిస్ తదితరులు కూడా తమ సామర్థం మేరకు రాణించాల్సి ఉంది. లేకుంటే వరుసగా నాలుగో ఓటమి చవిచూడడం ఖాయం. కాగా, మోర్కెల్, రబడా, ఎన్‌గిడి, ఫెలూక్‌వాయో, మిల్లర్, మోరిస్ తదితరులతో దక్షిణాఫ్రికా బౌలింగ్ బలంగా ఉంది. డివిలియర్స్ చేరికతో జట్టు ఆత్మవిశ్వాసం రెట్టింపు అయ్యింది. ఈ నేపథ్యంలో నాలుగో వన్డేలో విజయమే లక్షంగా సఫారీ సిద్ధమైంది.