Home స్కోర్ సిరీస్‌పై కన్నేసిన కోహ్లిసేన!

సిరీస్‌పై కన్నేసిన కోహ్లిసేన!

Team-India

నేడు ఆస్ట్రేలియాతో రెండో టి20 మ్యాచ్
గెలుపు కోసం స్మిత్‌సేన ఆరాటం

గువాహటి: వరుస విజయాలతో ఆధిపత్యాన్ని కనబరుస్తూ తిరుగులేని జట్టుగా అవతరించిన టీమిండియా ఇప్పుడు మరో సిరీస్‌పై కన్నేసింది. విదేశాల్లో వరుసగా సిరీస్‌లు గెలిచి విజయకేతనం ఎగురవేసిన భారత్.. శ్రీలంక సొంతగడ్డపై క్లీన్‌స్వీప్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు భారత పర్యటనకు వచ్చిన పర్యాటక జట్టు ఆస్ట్రేలియాపై కూడా సిరీసులు గెలిచి అదే సంప్రదాయాన్ని కొనసాగించాలని ఉవ్విళ్లూరుతోంది. ఇప్పటికే ఆస్ట్రేలియాతో పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ఐదు వన్డేల సిరీస్‌లో వరుసగా 41 తో సిరీస్‌ను టీమిండియా కైవసం చేసుకుంది. ఇక మూడు మ్యాచ్‌ల ట్వింటి 20 సిరీస్‌లో భాగంగా రాంచీ వేదికగా జరిగిన తొలి టి20 మ్యాచ్‌లో 9 వికెట్లతో గెలిచిన భారత్ బోణీ కొట్టి 10 తో సిరీస్‌లో పై చేయి సాధించింది. వర్షం కారణంగా డక్ వర్త్ లూయిస్ ప్రకారం నిర్దేశించిన ఆరు ఓవర్లలో 48 పరుగుల లక్ష్యాన్ని భారత్ ఛేదించి అదరహో అనిపించుకుంది. మంగళవారం ఆస్ట్రేలియాతో బార్సపారా స్టేడియంలో జరిగే రెండో టి20 మ్యాచ్‌లో కూడా విజయం కోసం కోహ్లిసేన సన్నద్ధమవుతోంది. ఇప్పటికే గువాహటి చేరుకున్న భారత్, ఆస్ట్రేలియా జట్లు ప్రాక్టీస్ సెషన్‌లో నిమగ్నమయ్యాయి. ఈ మ్యాచ్‌లో భారత క్రికెట్ జట్టు సిరీస్ గెలవాలని ఎదురుచూస్తుండగా, ఆస్ట్రేలియా ఆటగాళ్లు మాత్రం ఎలాగైన మ్యాచ్ గెలిచి సిరీస్‌ను భారత్‌కు దక్కకుండా మూడో మ్యాచ్ వరకు సజీవంగా ఉంచుకోవాలని ఆరాటపడుతోంది. గతంలో రంజీ ట్రోఫీ సీజన్‌లకు అతిథ్యమిచ్చిన బార్సపారా స్టేడియం తొలిసారి అంతర్జాతీయ మ్యాచ్‌కు అతిథ్యం ఇవ్వడం విశేషం. ఈ మ్యాచ్‌లో భారత్ గెలిస్తే ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ గెలుచుకోవడం ఖాయం.

వార్నర్, ఫించ్‌లే కీలకం..
రెండో టి20 మ్యాచ్‌లో ఆస్ట్రేలియాలో ఎలాంటి మార్పులు లేకుండానే బరిలోకి దిగే అవకాశాలు ఉండగా, ఆసీస్ జట్టును ఆదుకోవాల్సిన సారథి స్టీవ్‌స్మిత్ భుజం గాయంతో సిరీస్‌కు దూరంకావడం ఆ జట్టుకు తీరని లోటుగా మారింది. కానీ, స్మిత్ స్థానంలో సారథిగా బాధ్యతలను తలకెత్తుకున్న ఆస్ట్రేలియా ఓపెనర్, వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్, అరోన్ ఫించ్ బ్యాటింగ్ ఈ మ్యాచ్‌లో కీలకం కానుంది. ఈ నేపథ్యంలో మ్యాచ్ అంతా వీరిద్దరిపైనే ఆధారపడి ఉంది. పటిష్టమైన బౌలింగ్‌తో రాణిస్తున్న భారత స్పిన్నర్ల మాయాజాలం ఆసీస్‌కు సవాల్ మారుతోంది. ఈ సిరీస్‌లో భారత స్పిన్ దిగ్గజాలను ఎదుర్కోవడం ఒక వంతు అయితే, ఫీల్డింగ్‌లో భారత్‌ను కట్టడి చేయడంలో కూడా ఆసీస్ ఆచితూచి అడుగులు వేయాల్సిన కఠినమైన పరిస్థితిగా కనిపిస్తోంది. ఈ గడ్డు పరిస్థితుల్లో తిరిగి పుంజుకోవడం కంగారులకు కష్టంతో కూడుకున్న పనే అవుతుంది. అయితే ఆసీస్ జట్టులో గ్లెన్ మ్యాక్స్‌వెల్ తిరిగి ఫాంలోకి రావడం ఆసీస్‌కు ఊరటనిచ్చే అంశమే మరి. మ్యాక్స్‌వెల్ ఇప్పటివరకు ఆడిన మూడు వన్డే ఇన్నింగ్స్‌లలో 39, 14, 5 స్కోరు సాధించగా, అంతర్జాతీయ టి20లో 17 పరుగులు సాధించాడు. వన్డే సిరీస్‌లో ఆసీస్ బౌలర్లలో ఏకంగా 10 వికెట్లు తీసిన నాథన్ కౌల్టర్ నైల్ తోపాటు పేసర్ జాసన్ బెహ్రన్ డార్ఫ్‌లు రాంచీ టెస్టులో తమ స్థాయికి తగిన సత్తా చాటి ఆకట్టుకున్నారు. రెండో టి20 మ్యాచ్‌లో రాణిస్తే ఆసీస్‌కు కొంత మేరకు ఊరట కలిగించనుంది.

నెహ్రాకు చోటు దక్కితే..
ఆస్ట్రేలియాతో వన్డేల సిరీస్‌కు దూరమైన అనంతరం భారత ఓపెనర్ శిఖర్ దావన్ మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్‌లో చోటు దక్కిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాంచీలో జరిగిన తొలి టి20 మ్యాచ్‌లో ధావన్ జట్టు విజయంలో తనదైన పాత్రను పోషించాడు. ఈ మ్యాచ్‌లో కెప్టెన్ కోహ్లితో ధావన్ స్వల్ప లక్ష ఛేదనలో ఇరువురు స్కోరుబోర్డును పరుగులు పెట్టించి అజేయంగా నిలిచారు. దీంతో రెండో మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ప్రధానంగా భారత్ టాప్ ఆర్డర్‌పైనే దృష్టిపెట్టనున్నట్టు కనిపిస్తోంది. భారత జట్టులో స్వల్ప మార్పులు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. భారత పేసర్ ఆశిష్ నెహ్రాను తుది జట్టులోకి తీసుకోవాలనే యోచనలో కోహ్లి ఉన్నట్టు కనిపిస్తున్నాడు. ఒకవేళ నెహ్రాను తుదిజట్టులోకి తీసుకుంటే పేసర్ భువనేశ్వర్ కుమార్, జస్‌ప్రీత్ బ్రమాలలో ఒకరిని తప్పించే అవకాశం ఉంది. పేసర్లకు బదులుగా స్పిన్నర్‌ల విషయానికి వస్తే యుజవేంద్ర చాహల్-, చైనామన్ కుల్‌దీప్ యాదవ్‌లలో ఒకరిని రిజర్వ్ బెంచ్‌కు పరిమితం చేసే అవకాశాలు లేకపోలేదు. ఇప్పటికే వరుస పరాజయాలతో సతమతం అవుతున్న స్మిత్‌సేనకు తొలిసారి అంతర్జాతీయ మ్యాచ్‌కు ఆతిథ్యమిస్తున్న గువహటి పిచ్ కలిసివస్తుందా లేదా, మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్‌ను కోహ్లిసేన దక్కించుకుంటుందో చూడాలి మరి.

తుది జట్లు (అంచనా):
భారత జట్టు: విరాట్ కోహ్లి (కెప్టెన్), శిఖర్ ధావ న్, రోహిత్ శర్మ, మనీష్ పాడే, మహేంద్ర సింగ్ ధోనీ, కేదార్ జాదవ్, హార్దిక్ పాండ్య, భువనేశ్వర్ కుమార్, జస్‌ప్రీత్ బ్రుమా, కుల్‌దీప్ యాదవ్, య జువేంద్ర చాహల్, అశీష్ నెహ్రా, దినేశ్ కార్తీక్, కెఎల్ రాహుల్, అక్షర్ పటేల్.
ఆస్ట్రేలియా జట్టు: డేవిడ్ వార్నర్ (కెప్టెన్), జాసన్ బెహ్రెన్ డార్ఫ్, డానియల్ క్రిస్టియన్, నాథన్ కౌల్టర్ నైల్, ఆరోన్ ఫించ్, ట్రావిస్ హెడ్, మోజిస్ హెన్రిక్యూస్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, టిమ్ పైనీ, కేన్ రిచర్డ్‌సన్, ఆడమ్ జంపా, మార్కూస్ స్టోనిస్, ఆండ్రూ టై.