Home తాజా వార్తలు ఒకే ఒక్కడు..

ఒకే ఒక్కడు..

India vs Australia

 

తడబడిన బ్యాటింగ్, ఆదుకున్న పుజారా, భారత్ 250/9, ఆస్ట్రేలియాతో తొలి టెస్టు

అడిలైడ్: ఫాస్ట్ పిచ్‌లపై ఆడలేమనే బలహీనతను భారత బ్యాట్స్‌మెన్ మరోసారి నిరూపించారు. ఆస్ట్రేలియాతో గురువారం ప్రారంభమైన తొలి టెస్టులో టీమిండియా తడబడింది. అయితే మిస్టర్ డిపెండబుల్, నయా వాల్ చటేశ్వర్ పుజారా (123) చిరస్మరణీయ శతకంతో భారత్ పరువును కాపాడాడు. పుజారా చారిత్రక ఇన్నింగ్స్ ఆడడంతో భారత్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి 9 వికెట్ల నష్టానికి 250 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా బౌలర్లు సమష్టిగా రాణించి భారత్‌కు తక్కువ స్కోరుకే పరిమితం చేయడంలో సఫలమమ్యారు. భారత జట్టులో పుజారాతో పాటు రోహిత్ శర్మ (37), అశ్విన్ (25), రిషబ్ పంత్ (25) తప్ప మిగతావారు ఘోరంగా విఫలమయ్యారు. ఒక దశలో భారత్ స్కోరు 150 దాటడమే కష్టమని అనిపించగా పుజారా పోరాట పటిమతో స్కోరు 250కి చేరింది. ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మకు తుది జట్టులో చోటు కల్పించారు. తెలుగుతేజం హనుమ విహారికి జట్టులో స్థానం లభించలేదు. ఇరు జట్ల మధ్య నాలుగు టెస్టు మ్యాచ్‌లు జరుగనున్నాయి.

ప్రారంభంలోనే…
టాస్ గెలిచి బ్యాటింగ్ చేపట్టిన టీమిండియాకు ప్రారంభంలోనే కష్టాలు మొదలయ్యాయి. ప్రాక్టీస్ మ్యాచ్‌లో అదరగొట్టిన ఓపెనర్లు మురళీ విజయ్, లోకేశ్ రాహుల్‌లు ఘోరంగా విఫలమయ్యారు. కొంతకాలంగా పేలవమైన ఫామ్‌తో సతమతమవుతున్న రాహుల్ ఈసారి కూడా నిరాశ పరిచాడు. నిర్లక్షంగా ఆడి వికెట్‌ను పారేసుకున్నాడు. హాజిల్‌వుడ్ వేసిన ఇన్నింగ్స్ రెండో ఓవర్‌లోనే రాహుల్ పెవిలియన్ చేరాడు. అతను రెండు పరుగులు మాత్రమే చేశాడు. అప్పటికీ జట్టు స్కోరు మూడు పరుగులు మాత్రమే. ఇక, జట్టును ఆదుకుంటాడని భావించిన మరో ఓపెనర్ మురళీ విజయ్ కూడా నిరాశ పరిచాడు. స్టార్క్ వేసిన అద్భుత బంతికి ఔటయ్యాడు. ఈ సమయంలో జట్టులోకి వచ్చిన కెప్టెన్ విరాట్ కోహ్లి కూడా నిరాశే మిగిల్చాడు. మూడు పరుగులు మాత్రమే చేసి కమిన్స్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. దీంతో భారత్ 19 పరుగులకే కీలకమైన మూడు వికెట్లు చేజార్చుకుంది. భారీ ఆశలు పెట్టుకున్న సీనియర్ ఆటగాడు అజింక్య రహానె కూడా జట్టుకు అండగా నిలువలేక పోయాడు. 13 పరుగులు చేసి హాజిల్‌వుడ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. దీంతో 41 పరుగులకే భారత్ నాలుగు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో చిక్కుకుంది.

రోహిత్‌తో కలిసి..
ఈ దశలో ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే బాధ్యతను మిస్టర్ డిపెండబుల్ పుజారా తనపై వేసుకున్నాడు. అతనికి రోహిత్ శర్మ అండగా నిలిచాడు. ఇద్దరు కలిసి ప్రత్యర్థి బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ వికెట్ల పతనాన్ని అడ్డుకున్నారు. పుజారా తన మార్క్ డిఫెన్స్‌తో ప్రత్యర్థి బౌలర్ల సహనాన్ని పరీక్షించాడు. మరోవైపు రోహిత్ చూడచక్కని షాట్లతో అలరించాడు. చాలా కాలం తర్వాత టెస్టు జట్టులోకి వచ్చిన రోహిత్ ఒక దశలో భారీ స్కోరు సాధించడం ఖాయంగా కనిపించింది. అయితే మూడు సిక్సర్లు, రెండు ఫోర్లతో 37 పరుగులు చేసిన రోహిత్‌ను నాథన్ లియాన్ పెవిలియన్ బాట పట్టించాడు. దీంతో 44 పరుగుల ఐదో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది.

పుజారా ఒంటరి పోరాటం..
సహచరులు ఒక్కోక్కరే పెవిలియన్ బాట పడుతున్నా పుజారా మాత్రం తన పోరాటాన్ని కొనసాగించాడు. ప్రత్యర్థి బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ ముందుకు సాగాడు. అతనికి రిషబ్ పంత్, రవిచంద్రన్ అశ్విన్‌లు అండగా నిలిచారు. యువ ఆటగాడు పంత్ ఆడింది కొంత సేపే అయినా దూకుడును ప్రదర్శించాడు. సమన్వయంతో బ్యాటింగ్ చేయాల్సిన సమయంలో భారీ షాట్ల జోలికి వెళ్లి వికెట్‌ను పారేసుకున్నాడు. ధాటిగా ఆడిన పంత్ రెండు ఫోర్లు, ఒక సిక్సర్‌తో 25 పరుగులు చేసి లియాన్ చేతికి చిక్కాడు. తర్వాత వచ్చిన అశ్విన్ అండతో పుజారా ముందుకు సాగాడు. చిరస్మరణీయ బ్యాటింగ్‌ను కనబరిచిన పుజారా ఆరు ఫోర్లు, ఒక సిక్సర్‌తో సెంచరీని పూర్తి చేశాడు. మరోవైపు అశ్విన్ కూడా మారథాన్ ఇన్నింగ్స్‌తో పుజారాకు సహకారం అందించాడు. చివరికి 76 బంతుల్లో ఒక ఫోర్‌తో 25 పరుగులు చేసి కమిన్స్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. ఇషాంత్ శర్మ (4)ను స్టార్ క్లీన్‌బౌల్డ్ చేశాడు. ఇక, కీలక ఇన్నింగ్స్ ఆడిన పుజారా 246 బంతుల్లో ఏడు ఫోర్లు, సిక్స్‌తో 123 పరుగులు చేసి రనౌటయ్యాడు.

స్కోరుబోర్డు

భారత్ మొదటి ఇన్నింగ్స్: లోకేశ్ రాహుల్ (సి) ఫిచ్ (బి) హాజిల్‌వుడ్ 2, మురళీ విజయ్ (సి) పైన్ (బి) స్టార్క్ 11, చటేశ్వర్ పుజారా రనౌట్ 123, విరాట్ కోహ్లి (సి) ఖ్వాజా (బి) పాట్ కమిన్స్ 3, అజింక్య రహానె (సి) హాండ్స్‌కొంబ్ (బి) హాజిల్‌వుడ్ 13, రోహిత్ శఱ్మ (సి) మార్కస్ హారిస్ (బి) నాథన్ లియాన్ 37, రిషబ్ పంత్ (సి) పైన్ (బి) లియాన్ 25, రవిచంద్రన్ అశ్విన్ (సి) హాండ్స్‌కొంబ్ (బి) పాట్ కమిన్స్ 25, ఇషాంత్ శర్మ (బి) స్టార్క్ 4, మహ్మద్ షమి (బ్యాటింగ్) 6, ఎక్స్‌ట్రాలు 1, మొత్తం 87.5 ఓవర్లలో 250/9.

బౌలింగ్: మిఛెల్ స్టార్క్ 194632, జోష్ హాజిల్‌వుడ్ 19.53522, పాట్ కమిన్స్ 193492, నాథన్ లియాన్ 282832, ట్రావిస్ హెడ్ 2120.

India vs Australia First Test

Telangana Latest News