Home తాజా వార్తలు ఆసీస్‌తో వన్డే సిరీస్

ఆసీస్‌తో వన్డే సిరీస్

india vs australia odi series 2019

భారత్‌కు చాలా కీలకం

మన తెలంగాణ/క్రీడా విభాగం: ఆస్ట్రేలియాతో జరిగే వన్డే సిరీస్ టీమిండియాకు చాలా కీలకంగా మారింది. ఇంగ్లండ్‌లో ఈ ఏడాది జరిగే వన్డే ప్రపంచకప్‌కు ముందు భారత్ కేవలం 11 మ్యాచ్‌లే ఆడనుంది. ఇందులో మూడు వన్డేలు ఆస్ట్రేలియాలో జరుగుతున్నాయి. మరో ఐదు వన్డేలు న్యూజిలాండ్ వేదికగా జరుగుతాయి. ప్రపంచకప్ ట్రోఫీపై గురిపెట్టిన టీమిండియాకు ఈ సిరీస్‌లు చాలా కీలకంగా మారాయి. ఇప్పటికే ఆస్ట్రేలియా గడ్డపై ట్వంటీ20, టెస్టు సిరీస్‌లను సొంతం చేసుకున్న టీమిండియా వన్డేలకు ఆత్మవిశ్వాసంతో సిద్ధమైంది. ఆస్ట్రేలియాతో జరిగే మూడు వన్డేల సిరీస్‌ను గెలిచి రానున్న ప్రపంచకప్‌కు ఆత్మవిశ్వాసంతో సిద్ధం కావాలనే పట్టుదలతో భారత్ కనిపిస్తోంది. అయితే సొంత గడ్డపై ఆస్ట్రేలియాను ఓడించడం అంత సులువుకాదు. ఒంటిచేత్తో మ్యాచ్ తారుమారు చేసే ఆటగాళ్లకు ఆసీస్ జట్టులో కొదవలేదు. ఈ పరిస్థితుల్లో భారత్ విజయం కోసం సర్వం ఒడ్డి పోరాడక తప్పదు.

టెస్టు సిరీస్‌లో ఆడిన చాలా మంది ఆటగాళ్లు వన్డే సిరీస్‌కు దూరమయ్యారు. పుజారా, రహానె, పంత్ తదితరులు వన్డే సిరీస్‌కు అందుబాటులో లేరు. దీంతో జట్టు బ్యాటింగ్ భారమంతా కెప్టెన్ విరాట్ కోహ్లి, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మపై పడింది. వీరిద్దరూ వన్డేల్లో అసాధారణ ఆటతో చెలరేగుతున్న విషయం తెలిసిందే. ఆస్ట్రేలియా సిరీస్‌లోనూ ప్రకంపనలు సృష్టించాలనే పట్టుదలతో ఉన్నారు. ఇక, ఓపెనర్ శిఖర్ ధావన్ కూడా జట్టుకు కీలకంగా మారాడు. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేయగలిగే సత్తా కలిగిన ధావన్ విజృంభిస్తే భారత్‌కు విజయం నల్లేరుపై నడకే. అయితే నిలకడలేమి ధావన్ ప్రధాన బలహీనత. ఒక మ్యాచ్‌లో సెంచరీతో కదం తొక్కితే మరో మ్యాచ్‌లో ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరుతాడు. ఇలాంటి పరిస్థితుల్లో ధావన్ తన ఆటను మెరుగు పరుచుకునేందుకు ఈ సిరీస్ మంచి అవకాశంగా చెప్పొచ్చు. ఇక, తెలుగుతేజం అంబటి రాయుడుకు కూడా సిరీస్ కీలకంగా మారింది. నాలుగో నంబర్‌లో బరిలోకి దిగుతున్న రాయుడు కొంత కాలంగా నిలకడగా ఆడుతున్నాడు. రానున్న ప్రపంచకప్ నేపథ్యంలో ఆస్ట్రేలియా సిరీస్‌ను సద్వినియోగం చేసుకోవాలనే పట్టుదలతో ఉన్నాడు.

ధోనికి కీలకం

మాజీ కెప్టెన్, సీనియర్ ఆటగాడు మహేంద్ర సింగ్ ధోనికి ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ సిరీస్‌లు చాలా కీలకంగా మారాయని చెప్పాలి. రానున్న ప్రపంచకప్ నేపథ్యంలో ధోని తన బ్యాటింగ్‌ను మెరుగు పరుచుకోవాల్సిన అవసరం ఎంతైన ఉంది. కొంతకాలంగా ధోని బ్యాటింగ్‌లో విఫలమవుతున్నాడు. రిషబ్ పంత్ రూపంలో ధోనికి పెద్ద ప్రమాదం పొంచి ఉంది. ఏమాత్రం విఫలమైనా పంత్‌ను జట్టులోకి తీసుకోవడం ఖాయం. ఇటీవల ఆస్ట్రేలియాతో ముగిసిన టెస్టు సిరీస్‌లో పంత్ అసాధారణ ఆటతో ప్రకంపనలు సృష్టించిన విషయం తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో ధో ని స్థానానికి గట్టి పోటీ నెలకొంది. ధోని జట్టులో స్థానాన్ని కాపాడుకోవాలంటే నిలకడగా ఆడక తప్పదు. ఏ మాత్రం విఫలమైనా జట్టులో చోటు కోల్పోవడం తథ్యం. ఇక, ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య కూడా చాలా రోజుల తర్వాత మళ్లీ బరిలోకి దిగుతున్నాడు. రానున్న ప్రపంచకప్ నేపథ్యంలో పాండ్య తన ఆటను మెరుగు పరుచుకునేందుకు ఈ సిరీస్ ఓ వరంగా చెప్పొచ్చు.

బంతితో బ్యాట్‌తో అత ను రాణించాల్సిన అవసరం ఉంది. కేదార్ జాదవ్, దినేశ్ కార్తీక్, లోకేశ్ రాహుల్ తదితరులకు కూడా ఈ సిరీస్ పరీక్షగా మారింది. అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని జట్టును స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలని వారు భావిస్తున్నారు. ఇక, ఖలీల్ అహ్మద్, సిరాజ్, భువనేశ్వర్, షమిలకు కూడా ఆస్ట్రేలియా సిరీస్ కీలకంగా మారింది. ఇందులో రాణించి ప్రపంచకప్ బెర్త్‌ను సొంతం చేసుకోవాలని భావిస్తున్నారు.

భారత పర్యటనకు ఆస్ట్రేలియా

టీమిండియాతో ఐదు వన్డేలు

ముంబయి: ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు వచ్చే నెలలో భారత్‌లో పర్యటించ నుంది. ఈ సిరీస్‌లో ఆస్ట్రేలియా ఐ దు వన్డేలు, మరో ట్వంటీ20 మ్యాచుల్లో భారత్‌తో తలపడుతుం ది. ఫిబ్రవరి 24 బెంగళూరులతో తొ లి టి20, 27న విశాఖపట్నంలో రెండో టి20 జరుగుతుంది. అంతేగాక మార్చి రెండు నుంచి 13 వరకు ఐదు వన్డేలు జరుగుతాయి. మార్చి రెండున హైదరాబాద్‌లో తొలి వన్డే, 5న నాగ్‌పూర్‌లో రెండో వన్డే, మార్చి 8న రాంచీలో మూడో వన్డే, 10న మొహాలీలో నాలుగో వన్డే జరుగుతుంది. ఇక, చివరి వన్డే మార్చి 13 ఢిల్లీలో నిర్వహిస్తారు. కాగా, సిరీస్ వివరాలను బిసిసిఐ గురువారం అధికారికంగా ప్రక టించింది. రానున్న ప్రపంచకప్ నేపథ్యంలో ఈ సిరీస్ ఇరు జట్లకు చాలా కీలకంగా మారనుంది.

india vs australia odi series 2019

Telangana Latest News