Home స్కోర్ ఫైనలే లక్ష్యంగా టీమిండియా

ఫైనలే లక్ష్యంగా టీమిండియా

inda

 నేడు బంగ్లాదేశ్‌తో పోరు, ముక్కోణపు టోర్నీ

కొలంబో: ముక్కోణపు ట్వంటీ20 టోర్నమెంట్‌లో వరుస విజయాలతో దూకుడుమీదున్న టీమిండియా బుధవారం బంగ్లాదేశ్‌తో జరిగే మ్యాచ్‌కు ఆత్మవిశ్వాసంతో సిద్ధమైంది. ఇందులోనూ గెలిచి ఫైనల్‌కు దూసుకెళ్లాలనే పట్టుదలతో భారత్ ఉంది. మరోవైపు కిందటి మ్యాచ్‌లో భారత్ చేతిలో ఎదురైన ఓటమికి బదులు తీర్చుకోవాలని బంగ్లాదేశ్ తహతహలాడుతోంది. ఆతిథ్య శ్రీలంకపై భారీ స్కోరును ఛేదించి జోరుమీదున్న బంగ్లాదేశ్ సమరోత్సాహంతో పోరు కు సిద్ధమైంది. భారత్‌పై కూడా గెలిచి ఫైనల్ రేసులో నిలువాలనే పట్టుదలతో ఉంది. రెండు జట్లు కూడా విజయమే లక్షంగా పెట్టుకోవడంతో పోరు రసవత్తరంగా సాగడం ఖాయం. కాగా, శ్రీలంకపై బ్యాటిం గ్, బౌలింగ్ విభాగాల్లో భారత్ సమష్టిగా రాణించింది. ఈసారి కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగించేందుకు సిద్ధమైంది. అయితే కెప్టెన్ రోహిత్ శర్మ వైఫల్యం జట్టును వెంటాడుతోంది. ఇప్పటి వరకు ఆడిన మూడు మ్యాచుల్లోనూ రోహిత్ విఫలమైన విషయం తెలిసిందే. ఈసారి కూడా రోహిత్ ఎలా ఆడుతాడో అంతు బట్టడం లేదు. కాగా, ముష్ఫికుర్ రహీం, తమీమ్ ఇక్బాల్, మహ్మదుల్లా, లిటన్ దాస్ తదితరులతో బంగ్లాదేశ్ బ్యాటింగ్ చాలా బలంగా ఉంది. దీంతో ఈ మ్యాచ్‌లో కూడా భారీ స్కోర్లు నమోదు కావడం ఖాయంగా కనిపిస్తోంది.
శుభారంభం లభించేనా!
ఈ టోర్నమెంట్‌లో ఆశించిన స్థాయిలో రాణించడంలో విఫలమవుతున్న భారత కెప్టెన్ రోహిత్ శర్మ కనీసం ఈసారైన బ్యాట్‌ను ఝులిపిస్తాడా లేదా అనేది అందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తోంది. వరుస వైఫల్యాల నేపథ్యంలో రోహిత్ ఇంటాబయట విమర్శల తో సతమతమవుతున్నాడు. అతని వైఫల్యం జట్టుకు ప్రతికూలంగా మారింది. దక్షిణాప్రికా సిరీస్ నుంచి రోహిత్ పేలవ ప్రదర్శన కొనసాగుతూనే ఉంది. ఈ టోర్నీలో కూడా అతను నిరాశే మిగిల్చాడు. కోహ్లి, ధోని వంటి సీనియర్లు విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో రోహిత్‌పై జట్టు భారీ ఆశలే పెట్టుకుంది. అ యితే రోహిత్ మాత్రం అందరి అంచనాలను తారుమారు చేస్తూ పేలవమైన బ్యాటింగ్‌తో సతమతమవుతున్నాడు. అయితే ఈ మ్యాచ్‌లో రాణించడం ద్వా రా విమర్శకులకు గట్టి సమాధానం చెప్పాలని భావిస్తున్నాడు. ఇక, కిందటి మ్యాచ్‌లో ధావన్ కూడా విఫలమయ్యాడు. తొలి రెండు మ్యాచుల్లో అద్భుతం గా రాణించిన ధావన్ లంకపై విఫలమయ్యాడు. అ యితే ఈసారి బంగ్లాపై భారీ ఇన్నింగ్స్ ఆడేందుకు తహతహలాడుతున్నాడు. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేయగలిగే సత్తా కలిగిన ధావన్ విజృంభిస్తే బంగ్లా బౌలర్లకు కష్టాలు తప్పక పో వచ్చు. ఇక, సీనియర్ ఆటగాడు సురేశ్ రైనా కూడా మరింత మెరుగ్గా రాణించాల్సిన అవసరం ఉంది. ఇప్పటి వరకు ఆశించిన స్థాయిలో రాణించడంలో రైనా విఫలమయ్యాడనే చెప్పాలి. అతని వైఫల్యం జట్టును వెంటాడుతోంది. కిందటి మ్యాచ్‌లో కీలక సమయంలో ఔటై నిరాశ పరిచాడు. ఈసారి బ్యాట్‌కు పని చెప్పాల్సిన బాధ్యత రైనాపై ఉంది.
జోరుమీదున్న పాండే..
మరోవైపు మనీష్ పాండే నిలకడైన బ్యాటింగ్ కనబరుస్తుండడం భారత్‌కు ఊరటనిచ్చే అంశం. కిందటి మ్యాచ్‌లో మనీష్ పాండే అద్భుత బ్యాటింగ్‌తో జట్టును గెలిపించాడు. ఈసారి కూడా జట్టు అతనిపై భారీ ఆశలే పెట్టుకుంది. మనీష్ చెలరేగితే భారత్‌కు విజయం నల్లేరుపై నడకే. ఒకవైపు నిలకడగా ఆడుతూనే అవసరమైనప్పుడూ దూకుడును కొనసాగిస్తూ పాండే ముందుకు సాగుతున్నాడు. ఈ మ్యాచ్‌లో కూడా రాణించి జట్టును ఫైనల్‌కు చేర్చాలని తహతహలాడుతున్నాడు. దినేష్ కార్తీక్ కూడా కిందటి మ్యాచ్‌లో కీలక ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. ఈ మ్యాచ్‌లో కూడా మెరుగ్గా ఆడేందుకు సిద్ధమయ్యాడు. రాహుల్ కూడా సత్తా చాటాలనే పట్టుదలతో ఉన్నాడు.
బౌలర్లే కీలకం…
కిందటి మ్యాచ్‌లో భారత బౌలర్లు సమష్టిగా రాణించి జట్టును గెలిపించారు. శార్దూల్ ఠాకూర్, వాషింగ్టన్ సుందర్‌లు అద్భుత ప్రతిభతో ఆకట్టుకుంటున్నారు. కిందటి మ్యాచ్‌లో శార్దూల్ ఏకంగా నాలుగు వికెట్లు పడగొట్టి ప్రకంపనలు సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో కూడా జట్టు అతనిపై భారీ ఆశలే పెట్టుకుంది. వాషింగ్టన్ సుందర్ కూడా నిలకడైన బౌలింగ్‌తో జట్టుకు అండగా నిలుస్తున్నాడు. విజయ్ శంక ర్, చాహల్‌లతో భారత బౌలింగ్ చాలా పటిష్టంగా ఉంది. ఈసారి కూడా జట్టు కు బౌలర్లే కీలకంగా మారారు. సమష్టిగా రాణిస్తే ఈ మ్యాచ్‌లో భారత్‌కు గెలుపు కష్టమేమి కాదు.
బ్యాటింగే బలం…
ఇక, బంగ్లాదేశ్ ఈ మ్యాచ్‌లో కూడా బ్యాటింగ్‌నే న మ్ముకుంది. శ్రీలంకపై 215 పరుగుల రికార్డు స్కో రును అలవోకగా ఛేదించిన బంగ్లాదేశ్ ఈసారి కూ డా అదే సంప్రదాయాన్ని కొనసాగించాలనే లక్షం తో ఉంది. తమీమ్ ఇక్బాల్, లిటన్ దాస్, సౌమ్య సర్కాక్ వంటి హార్డ్ హిట్టర్‌లు జట్టుకు అందుబాటులో ఉన్నారు. లంకపై వీరంత చెలరేగి పోయారు. ఇక, తమీమ్ భీకర ఫాంలో ఉన్నాడు. దాస్ కూడా లంకపై విధ్వంసక ఇన్నింగ్స్ ఆడాడు. ఈసారి కూడా చెలరేగేందుకు వీరంత సిద్ధమయ్యారు. కెప్టెన్ మహ్మదుల్లా కూడా సత్తా చాటేందుకు తహతహలాడుతున్నాడు. మరోవైపు లంకపై చారిత్రక ఇన్నింగ్స్ ఆడిన సీనియర్ ఆటగాడు ముష్ఫికుర్ రహీం మరోసారి విజృంభించేందుకు సిద్ధమయ్యాడు. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేయగలిగే సత్తా రహీం సొంతం. అతను విజృంభిస్తే భారత బౌలర్లకు కష్టాలు తప్పక పోవచ్చు. బౌలింగ్‌లోనూ బంగ్లా మెరుగ్గానే ఉంది. ముస్తఫిజుర్ రహ్మాన్, రుబేల్ హుసేన్, మెహది హసన్ తదితరులతో కూడిన పటిష్టమైన బౌలింగ్ లైనప్ బంగ్లాకు అందుబాటులో ఉన్న విషయం మరువ కూడదు. దీంతో భారత్ జాగ్రత్తగా ఆడక తప్పదు.