Search
Wednesday 14 November 2018
  • :
  • :

భారత్ 7.3% వృద్ధి రేటును అందుకోగలదు

bs

 ఆసియాలో వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ ఇదే : ఏసియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్

న్యూఢిల్లీ: భారత్ వేగంగా వృద్ధి బాటలో పయనిస్తోందని ఏసియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్(ఎడిబి) నివేదిక పేర్కొంది. ఆసియా, పసిఫిక్ రీజియన్‌లో కొత్త వాణిజ్య ఆందోళనలు నెలకొన్నప్పటికీ భారత్ ఆసియా దేశాల్లో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా నిలిచిందని పేర్కొంది. ఈ మేరకు ఎడిబి నివేదికలో అభిప్రాయాలను పొందుపరిచింది. 2018-19 ఆర్థిక సంవత్సరానికి గానూ వృద్ధి రేటు అంచనాలను అందుకునేందుకు భారత్ ఆర్థిక వ్యవస్థ సరైన మార్గంలో పయనిస్తోందని వెల్లడించింది. బ్యాంకింగ్ వ్యవస్థను బలోపేతం చేసేందుకు తీసుకుంటున్న చర్యలు, పన్ను సంస్కరణలతో 2018 ఆర్థిక సంవత్సరంలో 7.3 శాతం వృద్ధిరేటు, 2019 ఆర్థిక సంవత్సరంలో 7.6 శాతం వృద్ధిరేటు అంచనాలను భారత్ అందుకోగలదని ఎడిబి చీఫ్ ఎకనమిస్ట్ యసుయుకి సవదా తెలిపారు. అమెరికా, ఈ దేశానికి చెందిన వ్యాపార భాగస్వామ్య దేశాల మధ్య ఆందోళనలు పెరిగినప్పటికీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆసియా దేశాల్లో ఆర్థిక వ్యవస్థలు పటిష్టమైన వృద్ధిని కొనసాగిస్తున్నాయని నివేదిక వివరించింది. దక్షిణాసియా వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతంగా నిలిచిందని, మొత్తం ఆసియా దేశాల్లో భారత ఆర్థిక వ్యవస్థ వేగంగా వృద్ధి చెందుతోందని నివేదిక తెలిపింది. మెరుగైన స్థూల ఆర్థిక విధానాలు బాహ్య ప్రమాద సంకేతాలను నివారించి, వేగంగా ఆర్థిక వ్యవస్థల పురోగతికి దోహదం చేస్తున్నాయని ఎడిబి తెలిపింది.

Comments

comments