Home స్కోర్ భారత్‌దే విశ్వ కిరీటం

భారత్‌దే విశ్వ కిరీటం

india

మన్‌జోత్ అజేయ శతకం, చెలరేగిన బౌలర్లు,
ఫైనల్లో ఆస్ట్రేలియా చిత్తు, అండర్19 ప్రపంచకప్ విజేత భారత్

మౌంట్ మౌంగనుయి: అండర్19 ప్రపంచకప్‌ను భారత యువ జట్టు కైవసం చేసుకుంది. శనివారం ఇక్కడ జరిగిన ఫైనల్లో భారత్ 8 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాను చిత్తు చేసి తన ఖాతాలో నాలుగో ప్రపంచకప్‌ను జమ చేసుకుంది. టాస్ గెలిచి బ్యాటింగ్ చేపట్టిన ఆస్ట్రేలియా 47.2 ఓవర్లలో 216 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లు సమష్టి ప్రతిభతో ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌ను తక్కువ స్కోరుకే పరిమితం చేశారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన భారత్ 38.5 ఓవర్లలోనే కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. మన్‌జోత్ కల్రా 101(నాటౌట్) అజేయ శతకంతో భారత్‌ను నాలుగోసారి విశ్వవిజేతగా నిలిపాడు. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ జట్టులో జొనాథన్ మెర్లో (79) ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. భారత బౌలర్లలో ఇషాన్, శివాసింగ్, కమలేష్ నాగకోటి తలో రెండేసి వికెట్లు పడగొట్టారు. తర్వాత బ్యాటింగ్ చేపట్టిన భారత యువ జట్టు 38.5 ఓవర్లలోనే కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. ఓపెనర్ మన్‌జోత్ కల్రా (101 నాటౌట్; 120 బంతుల్లో 8×4, 3×6) అజేయ శతకంతో భారత్‌ను విశ్వవిజేతగా నిలిపాడు. కాగా, మరో ఓపెనర్, కెప్టెన్ పృథ్వీ షా (29), శుభ్‌మన్ గిల్ (31) కూడా మెరుగైన బ్యాటింగ్‌ను కనబరిచారు. మరోవైపు వికెట్ కీపర్ హార్విక్ దేశాయ్ ఐదు ఫోర్లతో అజేయంగా 47 పరుగులు చేసి తనవంతు పాత్ర పోషించాడు. అజేయ శతకంతో భారత్‌ను విశ్వవిజేతగా నిలిపిన మన్‌జోత్ కల్రా ప్లేయర్ ఆఫ్‌ది ఫైనల్ అవార్డు లభించింది. మరోవైపు ప్రపంచకప్‌లో అసాధారణ ఆటను కనబరిచిన శుభ్‌మన్ గిల్‌కు ప్లేయర్ ఆఫ్‌ది టోర్నీ అవార్డు దక్కింది. కాగా, భారత్ అండర్19 ప్రపంచకప్ గెలవడం ఇది నాలుగోసారి. అంతేగాక నాలుగు సార్లు విశ్వవిజేతగా నిలిచిన తొలి యువ జట్టుగా భారత్ చరిత్ర సృష్టించింది. ఆస్ట్రేలియా మూడు సార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలిచింది. దీంతో పాటు భారత్ ఈ టోర్నమెంట్‌లో ఒక్క మ్యాచ్ కూడా ఓడి పోకుండానే కప్పును గెలుచుకొని అరుదైన రికార్డును లిఖించింది. కాగా, ప్రపంచకప్ గెలిచిన భారత యువ జట్టుపై ప్రశంసల వర్షం కురుస్తోంది. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోడీ, కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ, క్రికెట్ దిగ్గజాలు సచిన్, సెహ్వాగ్, విరాట్ కోహ్లి తదితరులు యువ జట్టును అభినందించారు.
ఇషాన్ దెబ్బ…
టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లు జాక్ ఎడ్వర్డ్, మాక్స్ బ్రియంట్ కుదురుగా ఆడుతూ ముందుకు సాగారు. ధాటిగా ఆడిన బ్రియంట్ 3 ఫోర్లతో 14 పరుగులు చేసి ఇషాన్ పోరెల్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. కొద్ది సేపటికే మరో ఓపెనర్ జాక్ ఎడ్వర్డ్ కూడా ఔటయ్యాడు. ఐదు ఫోర్లతో వేగంగా 28 పరుగులు చేసిన ఎడ్వర్డ్‌ను కూడా ఇషాన్ పెవిలియన్ పంపించాడు. ఆ వెంటనే కెప్టెన్ జాసన్ సంఘా (13) కూడా వెనుదిరిగాడు. దీంతో ఆస్ట్రేలియా 59 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
ఆదుకున్న మెర్లొ…
ఈ దశలో ఇన్నింగ్స్‌ను కుదుట పరిచే బాధ్యత జొనాథన్ మెర్లొ తనపై వేసుకున్నాడు. అతనికి పరమ్ ఉప్పల్ అండగా నిలిచాడు. ఇద్దరు జాగ్రత్తగా ఆడుతూ ఇన్నింగ్స్‌ను కుదుట పరిచారు. ఒకవైపు వికెట్‌ను కాపాడుకుంటూనే అడపాదడపా బౌండరీలతో స్కోరును పెంచుకుంటూ పోయారు. ఈ జోడీని విడగొట్టేందుకు భారత బౌలర్లు చాలా సేపటి వరకు వేచి చూడాల్సి వచ్చింది. అయితే 3 ఫోర్లతో 34 పరుగులు చేసిన ఉప్పల్‌ను అనుకుల్ రాయ్ వెనక్కి పంపాడు. దీంతో 75 పరుగుల నాలుగో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. తర్వాత వచ్చిన నాథన్ కూడా మెర్లొకు అండగా నిలిచాడు. అతని సహకారంతో మెర్లొ మరో కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. నాథన్ 23 పరుగులు చేసి వెనుదిరిగాడు. మరోవైపు ఒంటరి పోరాటం చేసిన మెర్లొ 102 బంతుల్లో ఆరు బౌండరీలత 76 పరుగులు చేసి వెనుదిరిగాడు. మిగతావారు విఫలం కావడంతో ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ 216 పరుగుల వద్దే ముగిసింది.
శుభారంభం..
తర్వాత బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఓపెనర్లు పృథ్వీషా, మన్‌జోత్ కల్రా శుభారంభం అందించారు. ఇద్దరు ప్రత్యర్థి బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ ముందుకు సాగారు. పృథ్వీ షా కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడాడు. చూడచక్కని బ్యాటింగ్‌తో ఆసీస్ బౌలర్లను ముప్పుతిప్పలు పెట్టాడు. మన్‌జోత్ కూడా దూకుడుగా ఆడాడు. ఇద్దరు చెలరేగడంతో భారత్ స్కోరు 50 పరుగులు దాటింది. అయితే 4 ఫోర్లతో 29 పరుగులు చేసిన షాను సదర్‌లాండ్ అద్భుత బంతితో క్లీన్‌బౌల్డ్ చేశాడు. దీంతో 71 పరుగుల మొదటి వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది.
మన్‌జోత్ శతకం…
ఇక, వన్‌డౌన్‌లో వచ్చిన శుభ్‌మన్ గిల్ కూడా తన మార్క్ షాట్లతో చెలరేగాడు. అతని అండతో మన్‌జోత్ మరింత రెచ్చి పోయాడు. ఇద్దరు ఆస్ట్రేలియా బౌలర్లను హడలెత్తిస్తూ పరుగుల వరద పారించారు. ధాటిగా ఆడిన శుభ్‌మన్ గిల్ 4 ఫోర్లతో 31 పరుగులు చేసి ఔటయ్యాడు. తర్వాత వచ్చిన వికెట్ కీపర్ హర్విక్ దేశాయ్‌తో కలిసి మన్‌జోత్ మరో వికెట్ కోల్పోకుండానే భారత్‌కు విజయం సాధించి పెట్టాడు. అసాధారణ రీతిలో చెలరేగిన మన్‌జోత్ 102 బంతుల్లో 8 ఫోర్లు, మరో మూడు సిక్సర్లతో 101 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. కీలక ఇన్నింగ్స్ ఆడిన హర్విక్ ఐదు ఫోర్లతో 47 పరుగులు చేసి నాటౌట్‌గా ఉన్నాడు. దీంతో భారత్ 38.5 ఓవర్లలోనే కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. కాగా, భారత్ అండర్19 ప్రపంచకప్ గెలవడం ఇది నాలుగోసారి. మరే జట్టు కూడా ఇన్ని సార్లు ప్రపంచకప్ ట్రోఫీని సాధించలేదు. ఇంతకుముందు 2000, 2008, 2012లో కూడా భారత యువ జట్టు ప్రపంచకప్‌ను గెలుచుకుంది. 2016లో ఫైనల్లో ఓటమి పాలైంది. తాజాగా 2018లో మరోసారి విశ్వవిజేతగా నిలిచి చరిత్ర సృష్టించింది.

-ఆప్పటి వరకు ఇండియా అండర్-19 వరల్డ్ కప్‌ను నాలుగు సార్లు కైవసం చేసుకుంది. 2000 సంవత్సరంలో మహమ్మద్ కైఫ్ సారధ్యంలో మొదటి సారిగా, 2008లో విరాట్ కోహ్లి, 2012లో ఉన్ముక్త్ చంద్, 2018లో పృథ్వీ షా సారధ్యంలో ఈ ఘనత సాధిందింది.

-ఆస్ట్రేలియా ఇప్పటి వరకు ఇండియా అండర్-19 వరల్డ్ కప్‌ను మూడు సార్లు సాధిం చింది. దీంతో భారత్ తర్వాతి స్థానంలో నిలిచింది. 1988, 2002, 2010 సంవత్సరాలల్లో ఆసీస్ ఈ  ఘనతను సాధించింది.

-పాకిస్థాన్ ఈ ఘనతను రెండు సార్లు సాధించింది. 2004, 2006 సంవత్సరాల్లో అండర్-19 వరల్డ్‌కప్ విజేతగా        వరుసగా నిలిచింది. దీంతో మూడో స్థానంలో పాక్ కొనసాగుతోంది.

-ఇంగ్లండ్-1998, సౌతాఫ్రికా-2014, వెస్టిండీస్-2016 సంవత్సరాల్లో ఒక్కొసారి ఈ ఘనతను సాధించాయి. 

అండర్-19 ప్రపంచకప్‌లో విజేతగా నిలిచిన భారత యువ జట్టుకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. దేశ ప్రథమ పౌరుడు రామ్‌నాధ్ కోవింద్‌తో పాటు ప్రధాని మోదీ, మాజీ, ప్రస్తుత క్రికెటర్లు, సినీ తారలు పృథ్వీ షా సేనపై సామాజిక మాధ్యమాల ద్వారా ప్రశంసల వర్షం కురిపించారు.

అండర్-19 ప్రపంచకప్ గెలిచిన భారత యువ జట్టుకు అభినందనలు. పృథ్వీ షా టీమ్‌ను చూస్తే ఎంతో గర్వంగా ఉంది
-రాష్ట్రపతి రామ్‌నాధ్ కోవింద్

భారత యువ క్రికెటర్ల విజయం అద్భుతం. అండర్-19 ప్రపంచకప్ గెలిచిన జట్టుకు అభినందనలు. ఈ విజయంతో ప్రతి భారతీయుడు ఎంతో గర్వంగా ఫీలవుతున్నాడు
-ప్రధాని నరేంద్ర మోదీ

అండర్-19 ప్రపంచకప్ గెలిచిన టీమిండియాకు శుభాకాంక్షలు. యువతరం క్రికెటర్లు అందించిన ఈ విజయంతో దేశంలోని ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉన్నారు
-రాహుల్ గాంధీ

గొప్ప ప్రదర్శనతో మీ కలను సాకారం చేసుకున్నారు. ప్రపంచ ఛాంపియన్లు మీకు శుభాకాంక్షలు. రాహుల్ ద్రవిడ్‌కు అభినందనలు
-సచిన్ టెండూల్కర్

అండర్-19 జట్టుకు మరో అద్భుత విజయం అందుకుంది. దీన్ని పునాదిగా చేసుకుని భవిష్యత్తులో మరింతగా రాణించండి.
-విరాట్ కోహ్లీ

నాలుగోసారి అండర్‌‌-19 ప్రపంచకప్ విజేతగా నిలిచిన భారత్‌కు అభినందనలు. ఈ క్రెడిటంతా నా ఆల్‌టైం ఫేవరెట్, ద వాల్ రాహుల్ ద్రవిడ్‌దే.
-రాష్ట్ర ఐటి మంత్రి కేటీఆర్

అద్భుత ప్రదర్శనతో విజయం సాధించారు. మన దేశానికి మరో ఘనతను అందజేశారు. ఈ క్షణాలను ఎంజాయ్ చేయండి
-భారత క్రికెట్ ప్రధాన కోచ్ రవిశాస్త్రి

ప్రపంచకప్ గెలిచిన యువ భారత ఆటగాళ్లకు శుభాకాంక్షలు. అన్ని విభాగాల్లోనూ మంచి ప్రదర్శన చేశారు
-అనిల్ కుంబ్లే

అండర్-19 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టుకు అభినందనలు. కోచ్ రాహుల్ ద్రవిడ్ నేతృత్వంలోని జట్టు సమిష్టిగా విజయం సాధించి,
-యువరాజ్ సింగ్.

జట్టులోని ప్రతి ఒక్కరూ అద్భుతంగా ఆడారు. దీంతో గెలుపు సులువైంది. కుర్రోళ్లకు అభినందనలు. నాకు గర్వంగా ఉంది. కోచ్ ద్రవిడ్‌కు శుభాకాంక్షలు
– బుమ్రా

ప్రపంచకప్ గెలిచిన అండర్ 19 టీంకు శుభాకాంక్షలు. టోర్నమెంట్ మొత్తంలో ఒక్క ఓటమి లేకుండా అద్భుతంగా రాణించి, అద్భుత విజయాన్ని అందుకున్నారు.
-హీరో విక్టరీ వెంకటేశ్

యావత్తు భారత దేశం గర్వించదగ్గ సమయమిది. భారత అండర్-19 జట్టు విశ్వ విజేతగా నిలిచింది. యంగ్ హీరోలకు నా శుభాకాంక్షలు.
సూపర్ స్టార్ మహేశ్‌బాబు

నాలుగోసారి అండర్-19 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టుకు శుభాకాంక్షలు. జూనియర్ జట్టు బౌలింగ్‌తో ఆకట్టుకుని అద్భుతంగా రాణించింది.
-దర్శకుడు, ఎస్.ఎస్.రాజమౌళి