మొహాలీ: వేదికగా శ్రీలంకతో జరిగిన రెండో వన్డేలో ఆతిథ్య భారత్ ఘన విజయం సాధించింది. 393 పరుగుల భారీ లక్ష్యచేధనతో బరిలోకి దిగిన లంకేయులు 50 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 251 పరుగులకే పరిమితమయ్యారు. దీంతో టీమిండియా 141 పరుగుల తేడాతో బంపర్ విక్టరీ నమోదు చేసింది. ఈ విజయంతో తొలి వన్డేలో పరజయానికి భారత జట్టు ప్రతీకారం తీర్చుకుంది. లంక సీనియర్ బ్యాట్స్ మెన్ మాథ్యూస్ సెంచరీ(111)తో ఒంటరి పోరాటం చేసిన ఫలితం లేకుండా పోయింది. మాథ్యూస్ కు మిగతా బ్యాట్స్ మెన్ల నుంచి సరియైన సహాకారం లేకపోవడంతో అతడి శతకం వృధా అయింది. మొదట రోహిత్ శర్మ (208 నాటౌట్; 153 బంతుల్లో 13×4, 12×6) కెరీర్లో మూడో ద్విశతకం నమోదు చేయడంతో భారత్ నాలుగు వికెట్ల నష్టానికి 392 పరుగులు చేసింది. శ్రేయస్ అయ్యర్ (88; 70 బంతుల్లో 9×4, 2×6), ధావన్ (68; 67 బంతుల్లో 9×4) అర్ధశతకాలతో రాణించారు. భారత బౌలర్లలో చాహాల్ 3, బూమ్రా 2, భువనేశ్వర్, పాండ్యా, సుందర్ చెరో వికెట్ పడగొట్టారు. అజేయంగా డబుల్ సెంచరీ చేసిన టీమిండియా సారథి రోహిత్ శర్మ ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్ను భారత జట్టు 1-1తో సమం చేసింది. ఆఖరి వన్డే విశాఖపట్నంలో 17న జరుగనుంది.