Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

భారత్‌కు రెండో గెలుపు

Women-Cricket

మహిళల ఆసియాకప్

కౌలాలంపూర్: మహిళల ఆసియా కప్ ట్వంటీ20 టోర్నమెంట్‌లో భారత్ వరుసగా రెండో విజయం సాధించింది. సోమవారం జరిగిన రెండో మ్యాచ్‌లో భారత్ 66 పరుగుల తేడాతో థాయిలాండ్‌ను చిత్తు చేసింది. తొలి మ్యాచ్‌లో భారత్ ఆతిథ్య మలేసియా జట్టుపై రికార్డు విజయం సాధించిన విషయం తెలిసిందే. థాయిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసింది.

తర్వాత లక్షఛేదనకు దిగిన థాయిలాండ్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 66 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది. ఓపెనర్లు నట్టాకన్ చాట్రమ్ (5), నరుమల్ చాయ్‌వాయి (16) తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరారు. నట్యాన్ (21) పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచింది. వికెట్ కీపర్ నన్నాపట్ (౦), రత్నాపాం (1) కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలువలేక పోయారు. కెప్టెన్ సొమ్మరిన్ తిపూ (5) కూడా నిరాశ పరిచింది. చనిదా (12) పరుగులు సాధించింది. భారత బౌలర్లలో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ 11 పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టింది. దీప్తి శర్మ రెండు వికెట్లు తీసింది. భారత బౌలర్లు కచ్చితమైన లైన్ అండ్ లెన్త్‌తో బౌలింగ్ చేయడంతో థాయిలాండ్ స్కోరు 66 పరుగులకే పరిమితమైంది.

అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన భారత్‌కు ఓపెనర్లు మోనా మెశ్రమ్, స్మృతి మందన శుభారంభం అందించారు. ధాటిగా ఆడిన మందన రెండు సిక్సర్లు, ఒక ఫోర్‌తో వేగంగా 29 పరుగులు చేసింది. మరో ఓపెనర్ మెశ్రమ్ 32 పరుగులు సాధించింది. ఇద్దరు తొలి వికెట్‌కు 53 పరుగులు జోడించారు. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ మూడు ఫోర్లతో 27 పరుగులు చేసి అజేయంగా నిలిచింది. అనుజా పాటిల్ (21) తనవంతు సహకారం అందించింది.

పాక్‌కు బంగ్లా షాక్

మరో మ్యాచ్‌లో బంగ్లాదేశ్ ఏడు వికెట్ల తేడాతో పాకిస్థాన్‌పై సంచలన విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ మహిళా జట్టు 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 95 పరుగులు మాత్రమే చేసింది. బంగ్లా బౌలర్లు కచ్చితమైన లైన్ అండ్ లెన్త్‌తో బౌలింగ్ చేస్తూ పాక్ బ్యాటింగ్ లైనప్‌ను కట్టడి చేశారు. ఓపెనర్లు మునీబా అలీ (7), నాహిదా ఖాన్ (13) నిరాశ పరిచారు. కెప్టెన్ బిస్మా రవూఫ్ (11), జవేరియా ఖాన్ (18), నిదా దర్ 17(నాటౌట్) మెరుగైన స్కోర్లను సాధించడంలో విఫలమయ్యారు. సనా మీర్ 21 పరుగులతో నాటౌట్‌గా నిలువడంతో పాక్ స్కోరు 95కి చేరింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ 17.5 ఓవర్లలోనే కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఓపెనర్ అయేషా రహ్మాన్ (5), వన్‌డౌన్‌లో వచ్చిన ఫర్జానా హక్ (2) నిరాశ పరిచారు. అయితే మరో ఓపెనర్ షమీమా సుల్తానా (31) జట్టును ఆదుకుంది. ఆమెకు నిగర్ సుల్తానా అండగా నిలిచింది. నిగర్ మూడు ఫోర్లతో 31 పరుగులు చేసి నాటౌట్‌గా ఉంది. మరోవైపు ఫహిమా 23 పరుగులతో అజేయంగా నిలిచింది. దీంతో బంగ్లాదేశ్ సంచలన విజయం నమోదు చేసింది.

లంక జయభేరి

మలేసియాతో జరిగిన మరో మ్యాచ్‌లో శ్రీలంక 90 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటిం గ్ చేసిన శ్రీలంక 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 136 పరుగులు చేసింది. ఓపెనర్లు యశోద మెండిస్ (36), నిపుణి హ ంసిక (20) శుభారంభం అందించారు. ఇద్దరు మొదటి వికెట్‌కు 59 పరుగులు జోడించారు. యశోద ధాటిగా ఆడింది. 4 ఫోర్లు, ఒక సిక్స్‌తో వేగంగా 36 పరుగులు చేసింది. అనూష్క మూడు ఫోర్లతో 26 సాధించింది. కీలక ఇన్నింగ్స్ ఆడిన హసిని పెరీరా 4 ఫోర్లతో అజేయంగా 32 పరుగులు చేసింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన మలేసియా 20 ఓవర్ల లో ఏడు వికెట్ల నష్టానికి 46 పరుగులు మాత్రమే చేసి మరో ఘోర పరాజయాన్ని చవిచూసింది.

Comments

comments