Home స్కోర్ ఆసియా మనదే..

ఆసియా మనదే..

INDIA.jpg-winఆసియాకప్‌లో ఆరోసారి ఛాంపియన్‌గా భారత్ l ఫైనల్లో బంగ్లాపై విజయం l గెలుపు ఇన్నింగ్స్ ఆడిన ధావన్, కోహ్లి
మీర్పుర్: అద్వితీయ విజయాలతో దూసుకుపోతున్న ధోనీసేన ఆసియాకప్‌ను ఆరోసారి సొంతం చేసుకుంది. తొలిసారి టీ-20 ఫార్మాట్‌లో జరిగిన ఆసియాకప్ ఫైనల్లో భారత్ ఎనిమిది వికెట్ల తేడాతో బంగ్లాపై విజయం సాధించింది. 121 పరుగుల లక్షానికి దిగిన భారత్.. డాషింగ్ ఓపెనర్ శిఖర్‌ధావన్(44 బంతుల్లో 60, 9×4, 1×6), ఛేజింగ్ మొనగాడు విరాట్ కోహ్లి(28 బంతుల్లో 41 నాటౌట్, 5×4) బాధ్యతాయుత ఇన్నింగ్స్‌లకు కెప్టెన్ ధోనీ(6 బంతుల్లో 20 నాటౌట్, 1×4, 2×6) ఫినిషింగ్ టచ్ ఇవ్వడంతో మరో ఏడు బంతులు మిగిలిఉండగానే విజయాన్ని అందుకుంది. అంతకుముందు వరుణుడు అడ్డుతగలడంతో 15 ఓవర్లకు కుదించిన మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లా.. మహ్ముదుల్లా(13 బంతుల్లో 33నాటౌట్, 2×4, 2×6), షబ్బీర్‌రెహ్మాన్(29 బంతుల్లో 32 నాటౌట్, 2×4), షకిబ్(16 బంతుల్లో 21, 3×4) రాణించడంతో పూర్తి ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 120 పరుగులు చేసింది. భారత బౌలర్లలో బుమ్రా, నెహ్రా, అశ్విన్, జడేజాకు ఒక్క వికెట్ దక్కింది. ఆల్‌రౌండర్ హార్దిక్‌పాండ్యా(0/35) భారీగా పరుగులు సమర్పించుకున్నాడు.
కోహ్లి, ధావన్ జోరు : లక్షఛేదనలో భారత్‌కు ఆరంభంలోనే షాక్ తగిలింది. ఫామ్ బ్యాట్స్‌మన్ రోహిత్‌శర్మ(1) జట్టు స్కోరు 5 పరుగులకే పెవిలియన్ చేరినా మరో ఓపెనర్ ధావన్‌కు జత కలిసిన ఛేజింగ్ మొనగాడు కోహ్లి గెలిపించే బాధ్యత తీసుకున్నాడు. ఆరంభంలో నెమ్మదిగా ఆడిన వీరిద్దరూ షకిబ్, అబు హిదర్ బౌలింగ్‌లో మూడేసి బౌండరీలు బాది జోరు పెంచారు. ఇక ఇక్కడ నుంచి స్వేచ్ఛగా బ్యాట్ ఝులిపించిన వీరిద్దరు పోటీపడి బౌండరీలు తరలించారు. విజయానికి 30 బంతుల్లో 50 పరుగుల చేయాల్సిన దశలో కోహ్లి, ధావన్.. షకిబ్ బౌలింగ్‌లో రెండు బౌండరీ, నసీర్ బౌలింగ్‌లో మరో మూడు బౌండరీలు కొట్టడంతో మ్యాచ్ సమీకరణం 18 బంతుల్లో 24కు చేరింది. ఇక 35 బంతుల్లో అర్ధశతకాన్ని పూర్తిచేసుకున్న ధావన్ అవుటైనా బ్యాటింగ్ ఆర్డర్‌లో ముందొచ్చిన ధోనీ తనదైన శైలిలో సిక్స్, ఫోర్, సిక్స్ బాది మ్యాచ్‌ను ముగించాడు.
మహ్ముదుల్లా మెరుపు ఇన్నింగ్స్ : టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బంగ్లా ఆరంభంలో పరుగులు చేయడానికి తీవ్రంగా ఇబ్బంది పడింది. భారత బౌలర్లు కట్టదిట్టంగా బౌలింగ్ చేయడంతో ఓపెనర్లు తమీమ్ ఇక్బాల్(13), సౌమ్యసర్కార్(14) వేగంగా ఆడలేకపోయారు. అయితే నాల్గో ఓవర్‌లో రెండువరుస బౌండరీలు బాది జోరుపెంచిన సౌమ్యసర్కార్ మరుసటి బంతికే హార్దిక్‌కు క్యాచ్ పెవిలియన్‌కు చేరగా, బుమ్రా వేసిన తరువాతి ఓవర్‌లో తమీమ్ వికెట్లముందు దొరికిపోయాడు. ఇక క్రీజులోకి వచ్చిన సబ్బీర్, షకిబ్ ఇన్నింగ్స్ నిర్మించే బాధ్యత తీసుకున్నారు. వీరిద్దరూ సింగిల్స్‌తోనే స్కోరుబోర్డును నడిపించడంతో తొమ్మిది ఓవర్లు ముగిసే సమయానికి బంగ్లా 64 పరుగులు చేసింది. అయితే ధాటిగా ఆడేందుకు ప్రయత్నించిన షకిబ్ పదోఓవర్ తొలిబంతికే పెవిలియన్‌కు చేరగా, మరుసటి ఓవర్‌లో వరుస బంతుల్లో రహీం(4), మోర్తాజా(0) అవుటయ్యారు. దీంతో బంగ్లా వందలోపలే కట్టడి అయ్యేలా కనిపించింది. అయితే మహ్ముదుల్లా మెరుపుఇన్నింగ్స్ ఆడి జట్టుకు అందించాడు. నెహ్రా వేసిన 13 ఓవర్‌లో ఓ బౌండరీ బాదిన మహ్ముదుల్లా పాండ్యా బౌలింగ్‌లో 4, 6, 2, 6 బాది మొత్తం 21 పరుగులు పిండుకున్నాడు. చివరి ఓవర్‌లో బుమ్రా ఏడు పరుగులే ఇవ్వడంతో బంగ్లా పూర్తి ఓవర్లలో 120 పరుగులు చేసింది.