Search
Wednesday 26 September 2018
  • :
  • :

భారత్ చేతిలో పాక్ పరాజయం

  • ప్రపంచ హాకీ లీగ్ టోర్నీ

India-Hockey

లండన్: ఇంగ్లాండ్‌లో జరుగుతున్న ప్రపంచ హాకీ లీగ్ సెమీఫైనల్ టోర్నమెంట్‌లో భారత్ 7-1 గోల్స్ తేడాతో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను చిత్తు చేసింది. ఆదివారం జరిగిన ఏక పక్ష మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది. ఈ టోర్నమెంట్‌లో భారత్‌కు ఇది వరుసగా రెండో విజయం కావడం విశేషం. ప్రారంభ మ్యాచ్‌లో భారత్ 4-1 గోల్స్ తేడాతో స్కాట్లాండ్‌ను చిత్తు చేసిన విషయం తెలిసిందే. రెండో మ్యాచ్‌లో కెనడాను కూడా భారత్ చిత్తు చేసింది. తాజాగా పాక్‌ను ఓడించి హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసింది. ఈ విజయంతో భారత్ 9 పాయింట్లతో గ్రూప్‌లో నంబర్‌వన్ స్థానానికి చేరుకుంది. పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ పూర్తి ఆధిపత్యం చెలాయించింది. దూకుడైన ఆటతో పాక్‌ను ఉక్కిరిబిక్కిరి చేసింది. ఇదే క్రమంలో ఆట 13వ నిమిషంలో హర్మన్‌ప్రీత్ సింగ్ పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలచి జట్టుకు తొలి గోల్‌ను అందించాడు. తర్వాత భారత్ జోరును మరింత పెంచింది. ఆట 21, 24 నిమిషాల్లో తల్విందర్ రెండు ఫీల్డ్ గోల్స్ చేసి భారత్ ఆధిక్యాన్ని 3-0కు పెంచాడు. కొద్ది సేపటికే హర్మన్‌ప్రీత్ సింగ్ తన రెండో గోల్ నమోదు చేశాడు. దీంతో భారత్ 4-0 ఆధిక్యాన్ని అందుకుంది. ద్వితీయార్ధంలో కూడా భారత్ దూకుడుగా ఆడింది. ఆకాశ్‌దీప్ కీలక సమయంలో మరో రెండు గోల్స్ చేశాడు. పర్‌దీప్ మార్ కూడా ఒక గోల్ చేయడంతో భారత్ ఆధిక్యం 7-0కు పెరిగింది. ఈ దశలో ఉమర్ బుట్టా 57వ నిమిషంలో పాకిస్థాన్‌కు ఏకైక గోల్ అందించాడు.

Comments

comments