Home జాతీయ వార్తలు ఐఎఎఫ్‌కు సరికొత్త భీముళ్లు

ఐఎఎఫ్‌కు సరికొత్త భీముళ్లు

Chinook-helicopters

చండీగఢ్ : భారత వాయుసేనలోకి అత్యంత శక్తివంతమైన చినూక్ హెలికాప్టర్లు నాలుగు రంగ ప్రవేశం చేశాయి. ఇక్కడి ఐఎఎఫ్ 126 హెలికాప్టర్ విభాగంఓ సోమవారం జరిగిన కార్యక్రమంలో వైమానిక దళ అధిపతి బిఎస్ ధనోవా ఈ చోపర్లు బలగంలోకి చేరుతున్నట్లు ప్రకటించారు. మొత్తం 15 సిహెచ్ 47 ఎఫ్ (i) చినూక్ హెలికాప్టర్ల నిర్వహణకు 12 మంది భారతీయ వాయుదళ పైలట్లు, ప్లయిట్ ఇంజనీర్లు అమెరికాలో తగు ప్రత్యేక శిక్షణను పొందారు. అతి ఎక్కువ బరువును తీసుకువవెళ్లగలిగే ఈ హెవీ లిఫ్టర్ హెలికాప్టర్లు భారతీయ వాయుసేనకు ఇప్పుడు అదనపు బలాన్ని చేకూర్చుతాయి. బోయింగ్ సంస్థ నుంచి వీటిని తెప్పించుకునేందుకు 2015 సెప్టెంబర్‌లో రంగం సిద్ధం అయింది. మొత్తం 15 హెలికాప్టర్ల కోసం ఆర్డర్లు పంపించారు. వీటిలో తొలి నాలుగు ఇప్పుడు భారతీయ వాయుసేన సేవలకు సిద్ధం అయ్యాయి. రాఫెల్ ఏ విధంగా అయితే వాయుసేన పాటవాన్ని ఇనుమడింపచస్తుందో , అదే విధంగా ఈ హెలికాప్టర్లు కూడా తమ సామర్థతను చాటుకుంటాయని ధనోవా దీమా వ్యక్తం చేశారు.

126 హెలికాప్టర్ యూనిట్లోనికే ఎంఐ 26 చోపర్లు, ఇప్పుడు ఈ హెలికాప్టర్లు రావడంతో ఈ విభాగం సామర్థంత ఇంతకు ముందెన్నడూ లేనంతగా పెరుగుతుందని ఈ కార్యక్రమానికి వచ్చిన సీనియర్ ఐఎఎఫ్ అధికారులు తెలిపారు.ప్రపంచంలోనే తిరుగులేని శక్తిని ఈ విభాగం చాటుకుంటుందని చెప్పారు. ఈ హెలికాప్టరు నిర్వహణ తీరు గురించి తగు శిక్షణ పొందామని , దీనికి సంబంధించి బోయింగ్‌కు చెందిన అనుభవజ్ఞులు, నిపుణులైన పైలట్లు తమకు శిక్షణ ఇచ్చారని , భారతీయ వాయుదళంలోకి వచ్చి చేరిన తొట్ట తొలి టాండెం రోటర్ హెలికాప్టరు ఇదేనని పైలట్ అనుపమ్ యాదవ్ చెప్పారు. దీనిని నడిపించే మెళకువలు తమకు కొత్త అని ఇప్పుడు వీటిపై పట్టు సాధించామని యాదవ్ తెలిపారు. అమెరికాలోని ఫిలిడెల్ఫియాలో ఉన్న బోయింగ్ కర్మాగారంలో ఈ హెలికాప్టరు విడిభాగాలను రూపొందించారు. ఇక్కడికి చేర్చిన తరువాత వాటిని సమకూర్చి తరువాత వాయుసేనకు అప్పగించారు.

రాత్రి పగలు ఎప్పుడైనా 11 టన్నుల బరువు మోసే శక్తి
ఈ హెలికాప్టర్లు అతి ఎక్కువ బరువును తీసుకువెళ్లగలవు. రాత్రి పగలు తేడా లేకుండా ఏ సమయంలో అయినా 11 టన్నుల బరువు వరకూ రవాణాకు దిగగలవు. టిబెట్, అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దులలో చైనా సైన్యం మెహరింపులతో భారతదేశం ఈ హెలికాప్టర్లను ఎంచుకుందని వెల్లడైంది. సంక్షోభ దశలో సరిహద్దులకు బలగాలను తరలించేందకు , క్లిష్టతర మార్గాలకు అనువైన యుద్ధ సామాగ్రిని పంపించేందుకు వీటిని ఎంచుకున్నట్లు వెల్లడైంది. ఓ వైపు చైనా సరిహద్దులలో రహదారులను మెరుగుపర్చడంతో పాటు ఇందుకు అనుగుణంగా వాయుబలగాలను పటిష్టచేసుకునే దిశలోనే హెలికాప్టర్లను అమెరికా నుంచి తెప్పించుకున్నట్లు వెల్లడైంది. హెలికాప్టర్లను లోడ్‌తో పాటు తీసుకువెళ్లేందుకు సరైన శిక్షణను తీసుకున్నట్లు ఇక్కడికి వచ్చిన పైలట్లు తెలిపారు. భారతదేశం ఇప్పటికే హిమాలయ పర్వత ప్రాంతంలో రష్యా నిర్మిత ఎంఐ 26 హెలికాప్టర్లను వాడుతోంది. అయితే వీటి వాహన బరువు అత్యధికం కావడంతో ఇంధన వినియోగం ఎక్కువగా ఉంటోంది. దీనిని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు అమెరికా నుంచి ఈ చినూక్‌లను తెప్పించారు. శతఘ్నులను, బుల్‌డోజర్లను, రహదారి నిర్మాణ సామాగ్రిని దీని ద్వారా లక్షానికి తీసుకువెళ్లవచ్చు. ఈ విధంగా భారతీయ వాయుసేనకు ఇవి లిఫ్టర్లుగా ఉంటాయని పైలట్లు తెలిపారు.
ఒకేసారి 54 దళాల రవాణా సామర్థం
ఈ హెలికాప్టరు ద్వారా ఏకకాలంలో 54 దళాలను సరిహద్దుల ప్రతికూల ప్రాంతాలకు తీసుకువెళ్లగలవు. శతఘ్నులతో పాటు సైనికులు దూసుకువెళ్లే అవకాశం ఉంటుంది. ఆరు కిలోమీటర్లు అంటే దాదాపు 20000 అడుగుల ఎత్తున ఈ హెలికాప్టర్లు పయనించేందుకు వీలుంది. అయితే ఉష్ణోగ్రత ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకోవల్సి ఉంటుంది. రెండు ఇంజిన్లు, టాండెం రోటర్, బహుళార్థక సామర్థం, నిటారుగా ఉండే లిఫ్ట్ ప్లాట్‌ఫాం వంటివి దీనికి ప్రత్యేకతలు. సైనిక దళాలు, సామాగ్రిని సులువుగా తరలించేందుక ఈ హెలికాప్టర్ అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. అన్ని రకాల వాతావరణాలను తట్టుకుని నిలబడే ఈ హెలికాప్టరును కేవలం ఘర్షణల సమయంలోనే కాకుండా ప్రకృతి వైపరీత్యాల సమయంలో మానవీయ చర్యలు చేపట్టేందుకు కూడా వీటిని వినియోగించుకోవచ్చు.

Indian Air Force inducts CH47 Chinook helicopters