Home జాతీయ వార్తలు కుప్పకూలిన మిగ్…

కుప్పకూలిన మిగ్…

Indian Air Force MiG 27 crashes near Jodhpur

జైపూర్ : భారత వైమానికి దళానికి చెందిన మిగ్  27 యుద్ధవిమానం కూలిపోయింది. రోజువారీ కార్యకలాపాలు నిర్వహిస్తుండగా జోధ్‌పూర్ బనాద్ ప్రాంతంలోని వ్యవసాయ పొలాల్లో మంగళవారం ఉదయం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ప్రమాద సమయంలో కేవలం ఒకే సీటున్న ఈ యుద్ధవిమానం నుంచి పైలట్ సురక్షితంగా బయటపడ్డారు. వెంటనే అతన్ని ఐఎఎఫ్ హెలికాప్టర్‌లో ఆసుపత్రికి తరలించినట్లు రక్షణశాఖ అధికారప్రతినిధి కల్నల్ సొంబిట్ ఘోష్ చెప్పారు. జోధ్‌పూర్ నుంచి మిగ్ 27 యుద్ధ విమానం టేకాఫ్ అయిందని, ఘటన పట్ల విచారణకు ఆదేశించామన్నారు. అయితే దర్యాప్తు తరువాతే ప్రమాదానికి గల కారణలు వెల్లడవుతాయని ఆయన  చెప్పారు. టేకాఫ్ అయిన కొద్ది నిమిషాల్లోనే విమానం కూలిపోయిందన్నారు. విమాన ప్రమాదం దంగ్యావాస్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగినట్లు జోధ్‌పూర్ తూర్పు డిప్యూటీ కమిషనర్ అమన్‌దీప్ సింగ్ కపూర్ మీడియాకు వెల్లడించారు. ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదన్నారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారన్నారు. అదే విధంగా ఐఎఎఫ్ దర్యాప్తు  బృందం కూడా అక్కడికి వచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. ఇదిలా ఉండగా,  రెం-డు యుద్ధ విమానాలు కలిసి వెళ్తుండడాని తాను చూశానని, అయితే అందులో ఒకటి ఒక్కసారిగా దిశను మార్చుకొని పంట భూములవైపు వెళ్లి బనాద్ ప్రాంతంలోని దేవలియా గ్రామసమీపంలో కూలిపోయినట్లు ప్రత్యక్ష సాక్షి ఒకరు చెప్పారు. పైలట్ పారాషూట్ ద్వారా సురక్షితగా బయటపడ్డారన్నారు. విమానం కూలిపోవడానికి ముందు అందులోని పొగలు వెలువడడాన్ని గమనించినట్లు మరో ప్రత్యక్ష సాక్షి తెలిపారు.