Home తాజా వార్తలు ఇంగ్లండ్‌కు పాండ్య పంచ్

ఇంగ్లండ్‌కు పాండ్య పంచ్

Indian bowlers were impressive in third Test against England

నాటింగ్‌హామ్: ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో భారత బౌలర్లు అద్భుతంగా రాణించారు. ఆదివారం రెండో రోజు ఇంగ్లండ్‌ను 161 పరుగులకే భారత బౌలర్లు కుప్పకూల్చారు. యువ ఫాస్ట్ బౌలర్ హార్దిక్ పాండ్య అసాధారణ బౌలింగ్‌తో ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్‌ను హడలెత్తించాడు. అద్భుతంగా బౌలింగ్ చేసిన పాండ్య 28 పరుగులకే ఐదు వికెట్లు పడగొట్టాడు. పాండ్య బౌలింగ్ ధాటికి ఇంగ్లండ్ ఇన్నింగ్స్ తక్కువ స్కోరుకే కుప్పకూలింది. తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌కు 168 పరుగుల భారీ ఆధిక్యం లభించింది.

టీమిండియా మొదటి ఇన్నింగ్స్‌లో 329 పరుగులకే కుప్పకూలింది. భారత్ చివరి నాలుగు వికెట్లను 22 పరుగులతో కోల్పోయింది. కాగా, భారత్‌ను తక్కువ స్కోరుకే పరిమితం చేసిన ఆనందం ఇంగ్లండ్‌కు ఎక్కువ సేపు నిలువలేదు. భారత బౌలర్లు అసాధారణ రీతిలో చెలరేగడంతో ఇంగ్లండ్ తక్కువ స్కోరుకే ఆలౌటైంది. ఓపెనర్లు జెన్నింగ్స్, కుక్‌లు తొలి వికెట్‌కు 54 పరుగులు జోడించి శుభారంభం చేసినా ఫలితం లేకుండా పోయింది. తర్వాత భారత బౌలర్లు వరుస క్రమంలో వికెట్లు తీసి ప్రత్యర్థి జట్టును కుప్పకూల్చారు. ఇంగ్లండ్ జట్టులో బట్లర్ 39 టాప్ స్కోరర్‌గా నిలిచాడు.