Home ఆఫ్ బీట్ సప్తనృత్యాల మయూరి

సప్తనృత్యాల మయూరి

భారతీయ నృత్యానికి అత్యంత ప్రాచీనచరిత్ర ఉంది. రుగ్వేదంలో నృత్య ప్రస్థావన ఉండటంతో పాటు రామాయణ, మహాభారతాల్లోను నృత్యవిశేషాలు ఉన్నాయి. ప్రకృతితో మమేకమయ్యేలా… మైమరిచి పోయే మధురానుభూతి కలిగించే భారతీయ నృత్యాల్లో ఎన్నో ప్రాంతీయ, సంప్రదాయ నృత్యాలు ఉన్నప్పటికీ ఏడు నృత్యాలకు శాస్త్రీయత ఉంది. ఆ సప్త నృత్యరీతుల్లో అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించింది అచ్యుత మానస. భావం రాగం తాళాలను వ్యక్తపరిచే భరతనాట్యం, నాట్యమేళ, నట్టువ, సంగీత ప్రాధాన్యతగల కూచిపూడి, హావభావాలకు అధికప్రాధాన్యత కలిగిన కథక్, కథాకళి, మణిపురి, ఒడిస్సా, మోహిని అట్టమ్, యుద్ధరీతులు, ఆలయ అర్చన ఉన్న పేరిణిలోని విభిన్నరీతుల్లో ప్రపంచవేదికలపై ప్రదర్శనలు ఇస్తున్న అచ్యుత మానసతో సకుటుంబం ప్రత్యేక ఇంటర్యూ…

Untitled-1

ఇంజనీరింగ్ పూర్తి చేసిన మీరు నాట్యరంగాన్ని ఎందుకు ఎంపిక చేసుకున్నారు?
చిన్నప్పటి నుంచి నేను హైపవర్ యాక్టివ్. అన్నింటిలో నేనే ముందుడాలనే తపన, ఆటల్లో ఎంతో చురుగ్గా ఉండేదాన్ని. అమ్మానాన్నలు నాలోని ఆసక్తిని గమనించి కళల్లో, ఆటల్లో ప్రోత్సహించారు. కూచిపూడితో పాటు భరత నాట్యం నేర్పించారు. భారతీయ శాస్త్రీయ నృత్యరీతులన్నీ నేర్చుకోవాలనే తపన నాలో అధికమవడంతో చదువును నిర్లక్షం చేయకుండా ప్రాక్టీసు ప్రారంభించాను. ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడే ప్రముఖ కంపెనీలో ప్లేస్‌మెంట్ వచ్చినా నాట్యం మీద ఉన్న దృష్టి ఉద్యోగం వైపు మళ్లించలేకపోయాను.
ఏడు నృత్యరీతుల్లో ప్రావీణ్యం సంపాదించడం ఎలా సాధ్యమైంది?
నాలోని పట్టుదల కుటుంబసభ్యుల ప్రోత్సాహంతో నిరంతరం శ్రమించి నేర్చుకున్నాను. ఆరో ఏట నాట్యసాధన ప్రారంభించి కూచిపూడి నేర్చుకున్నాను. ప్రముఖ గురువులు మహాంకాళి సూర్య నారాయణశర్మ, ఖాజ వెంకట సుబ్రహ్మణ్యం, డాక్టర్ వెంపటి చినసత్యం, చింత ఆదినారాయణశర్మ కూచిపూడిలో శిక్షణ ఇచ్చారు. అప్పుడు భరతనాట్యం నేర్చుకోవాలనే ఆలోచన వచ్చింది. నాట్యకళలు వివిధ రకా లు, ఆయా ప్రాంతాలను బట్టి వాటిలో వ్యత్యాసాలు ఉంటాయి. ఒక నాట్యం ప్రదర్శిస్తున్నప్పుడు మరో నాట్యం గుర్తుకు రాకూడదనే అమ్మ మాట నాకు వేదంలా అనిపించింది. ప్రాక్టీసు ప్రారంభించాను. దేశంలోని అనేక మంది గురువుల ఆశీర్వాదం పొందాను. ప్రముఖ గురువుల శిక్షణలో ఏడు నృత్యాలను అభ్యసించాను. చాలా సంవత్సరాలు గా నిత్యం ప్రాక్టీసు చేయడంతో పాటు సుమారు వంద దేశాల్లో ప్రదర్శనలు ఇచ్చాను. నేర్చుకున్న కళలకు శాస్త్రీయత అవసరం. అందుకే తెలుగు విశ్వవిద్యాలయం నుంచి, సిద్దేంద్ర యోగి కళాపీఠం నుంచి మాస్టర్ డిగ్రీలను పూర్తిచేసి పిహెచ్‌డి చేస్తున్నాను. నాట్యంతో మిళితమయ్యే సంగీతంపై పట్టు కోసం కర్ణాటక సంగీతం నేర్చుకున్నాను. ఆలయనృత్యాలను పరిశీలించేందుకు చిత్రకళను నేర్చుకుని ప్రదర్శనలు ఇస్తున్నాను. ఇంకా ఏదో చేయాలనే తపన నాలో రోజు రోజుకు పెరుగుతూనే ఉంది.
మీ అమ్మగారితో కలిసి పెయింటింగ్ ప్రదర్శన నిర్వహించాలన్న ఆలోచన ఎలా వచ్చింది. ఇందుకు స్ఫూర్తి?
పిల్లల అభిరుచులను తెలుసుకుని వారిని ఆయా రంగాల్లో తల్లిదండ్రులు ప్రోత్సహిస్తుంటారు. ఇక్కడ మరో కోణంలో ఆలోచిస్తే… అమ్మానాన్నలకు కూడా కొన్ని ఆసక్తులు, అభిరుచులు ఉంటాయి. పిల్లలుగా ఉన్నప్పుడు వారు నేర్చుకోవాలనుకున్నది నేర్చుకోలేక పోయారు. మా అమ్మకు పెయింటింగ్ నేర్చుకోవాలనే అభిరుచి ఉండేది. కానీ నేర్చుకోలేక పోయింది. అందుకే అమ్మతో పెయింటింగ్ వేయిస్తున్నాను. త్వరలో ఇద్దరం కలిసి చిత్ర ప్రదర్శన ఏర్పాటు చేయబోతున్నాం. పిల్లల అభిరుచులను తల్లిదండ్రులు, వారి ఆసక్తులను పిల్లలు గమనించి గౌరవిస్తే ప్రతి కుటుంబంలో ఆనందం తాండవిస్తుందని నేను భావిస్తాను.

lfe
శాస్త్రీయ కళలు కొన్ని వర్గాలవారికే సొంతమయ్యాయని భావిస్తారా?
నృత్యకళ ఖరీదైన కళగా మారింది. వ్యాపార ధోరణి పెరగడంతో ధనవంతులు వేలాది రూపాయలు గురువులకు ఇస్తూ శిక్షణ తీసుకోవడంతో శాస్త్రీయ మెళుకువలు ధన వంతులకే సొంత మవుతున్నాయి. వేలాది రూపాయలు గురుదక్షిణగా ఇచ్చుకోలేని వారికి శాస్త్రీయ కళలు అందుబాటులో లేవు. విశ్వ విద్యాలయాల్లో నేర్చుకున్నా నిత్య సాధన, శాస్త్రీయ అంశాలపై ఎప్పటికప్పుడు అధ్యయనం చేయాల్సి ఉంటుంది.
స్టేట్‌హోంలోని పిల్లలకు, ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు ఉచి తంగా శిక్షణ ఇస్తున్నట్లున్నారు?
నేను నేర్చుకున్న విద్యను ఆసక్తి ఉన్నవారి నేర్పించడంతో పాటు గత ఎనిమిది ఏళ్ల నుంచి స్టేట్ హోం విద్యార్థులకు ఉచితంగా శిక్షణ ఇస్తున్నాను. నా దగ్గర నృత్యాన్ని అభ్యసించిన వారు రాష్ట్ర స్థాయిలో బాలరత్న, జాతీయ స్థాయిలో బాలశ్రీ అవార్డులు అందుకున్న స్టేట్‌హోం విద్యార్థులు ఉండటం ఎంతో ఆనందంగా ఉంది.
మీ ప్రదర్శనలకు కావల్సిన డబ్బు ఎలా సమకూర్చుకుంటారు?
నృత్య ప్రదర్శనలకు డబ్బు ఎంతో అవసరమవుతుంటుంది. అయితే నేను ఇచ్చిన ప్రదర్శనల డివిడిలకు మంచి డిమాండ్ ఉండటంతో నాకు ఆ అవసరం రాలేదు. డివిడిల నుంచి వచ్చిన డబ్బులో ప్రదర్శనలకు ఖర్చుకాగా మిగిలిన డబ్బు పేద విద్యార్థుల కోసం ఖర్చు చేస్తాను.
బాల్యం నుంచి తుపాకులతో నేస్తం ఉన్నా ఆ రంగాన్ని కాదని నాట్యకారిణిగా అంతర్జాతీయ వేదికలపై తెలుగు శాస్త్రీయ నాట్య బావుటాను ఎగరవేస్తున్న అచ్యుత మానస ఐపిఎస్ అధికారి రవిచంద్ర కూతురు.శాస్త్రీయ నృత్య రీతుల్లో ఓ సరికొత్త ప్రయోగం… విభిన్నమైన సప్త నృత్య రీతులను లయబద్ధంగా ప్రదర్శించి ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తింది ఓ కళాకారిణి. ప్రతిభకు పట్టం కడుతూ యునెస్కో అంతర్జాతీయ స్థాయిలో గ్రీకులో ఏర్పాటు చేసిన నాట్య పరిశోధనా ప్రదర్శన వేదికపైకి ఆమెను ఆహ్వానించడం భారతీయ నృత్యరంగానికి దక్కిన అరుదైన అవకాశం. ఆమే అచ్యుత మానన. ఈ నేపథ్యంలో ఆమె కుటుంబ పరిస్థితులను గమనిస్తే ఓ సరికొత్త కోణం ఆవిష్కృతం అవుతుంది. పోలీసు కుటుంబంలో జన్మించినా… కళలను ఆరాధించే అమ్మ రాజ్యలక్ష్మి, సాప్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న సోదరుని ప్రోత్సాహంతోడై కళాకారిణిగా విశ్వవేదికపై ప్రదర్శనలు ఇస్తోంది. నచ్చిన రంగాన్ని ఎంపిక చేసుకుని అందులో నైపుణ్యత సాధించవచ్చంటున్న ఆచ్యుత మానసకు కుటుంబ ప్రోత్సాహాం ఎంతో ఉంది.