Search
Monday 16 July 2018
  • :
  • :
Latest News

భారత ఆర్థిక వ్యవస్థ @ 6

rs

ఫ్రాన్స్‌ను వెనక్కి నెట్టి మరింత పైపైకి

పారిస్ : ఫ్రాన్స్‌ను వెనకకు నెట్టేస్తూ భారతదేశం ప్రపంచ స్థాయిలో ఆరో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా రూపొందింది. ఈ విషయాన్ని ప్రపంచ బ్యాంక్ 2017 ఆర్థిక గణాంకాలలో వెల్లడించింది. ఇప్పటివరకూ ఈ క్రమంలో ఆరో స్థానంలో ఉన్న ఫ్రాన్స్ ఇప్పుడు 7వ స్ధానానికి చేరింది. గత ఏడాది భారతదేశ స్థూల దేశీయ ఉత్పత్తి (జిడిపి) 2.597 ట్రిలియన్ డాలర్లకు చేరింది. ఇదే సమయంలో ఫ్రాన్స్ జిడిపి 2.582 ట్రిలియన్ డాలర్ల స్థాయిలో భారత్‌తో కొద్దిగా వెనకబడింది. 2017 జూలై నుంచి భారతదేశ ఆర్థిక పురోగతి ఇనుమడించింది. అంతకు ముందు పలు దఫాలుగా మందగమనం నెలకొని ఉండేదని ప్రపంచబ్యాంక్ తెలిపింది. ఆర్థిక బలోపేత దేశాల జాబితాలో వరుసగా అమెరికా, చైనా, జపాన్, జర్మనీ, బ్రిటన్ వరుసగా ఐదు స్థానాలలో నిలిచాయి. ఆరో స్థానాన్ని భారత్ దక్కించుకుంది. ఆర్థిక పురోగమనంలో భారత్ ఫ్రాన్స్‌ను అధిగమించినా తలసరి జిడిపిలో జనాభాను పోల్చుకుని చూస్తే చాలా వరకూ వెనుకంజలో ఉంది. ఫ్రాన్స్‌కు దరిదాపులలోకి కూడా రాకుండా ఉంది. ఇండియా తలసరి జిడిపి కన్నా ఫ్రాన్స్ తలసరి జిడిపి 20 రెట్లు ఎక్కువగా ఉందని ఈ నివేదికలో తెలిపారు. భారతదేశ జనాభా 134 కోట్ల వరకూ చేరుకుంది. ఇక ఫ్రాన్స్ జనాభా 6.7 కోట్లుగానే ఉండటంవల్ల తలసరి జిడిపిలో వ్యత్యాసం భారీగా నమోదైంది. మొత్తం మీద సగటున భారతదేశ జిడిపి పెరగడానికి పలు కారణాలు ఉన్నాయని ప్రపంచ బ్యాంక్ తెలిపింది. ఉత్పత్తి రంగం, వినియోగదారుల రం గాలు భారతీయ ఆర్థిక వ్యవస్థ పురోగమనానికి గత ఏడాది ప్రేరకాలుగా మారాయి. పెద్ద నోట్ల రద్దుతో దేశం లో అంతకు ముందటి వరకూ ఆర్థిక పురోగమనం మందగించింది. ఇదే క్రమంలో జిఎస్‌టి అమలు కూడా తొలి దశ ఇబ్బందులను మిగిల్చింది. అయితే వీటిని దాటుకుని, భారతదేశం ఆర్థిక పురోగమన దిశకు వెళ్లిందని, ఈ క్రమంలో ఫ్రాన్స్‌ను వెనకకు నెట్టిందని విశ్లేషించారు. దశాబ్ద కాలంలో ఇండియా జిడిపి రెండింతలు అయింది. ప్రపంచ బ్యాంక్ వెలువరించిన జాబితాలో ఇప్పుడు చైనా రెండవ స్థానంలో నిలిచింది. చైనా, భారత్ మధ్య ఆర్థిక రంగం పరంగా కీలకమైన పోటీ నెలకొని ఉంది.
ఈ ఏడాది 7.4 శాతం వృద్ధి.. 32లో 3వ స్థానం ?
తొలుత అవలక్షణాలను దాటుకుని భారతదేశం ఈ ఆర్థిక సంవత్సరంలో 2018 సంవత్సరంలో 7.4 శాతం ఆర్థిక వృద్ధిని సాధించేందుకు అవకాశం ఉంది. ఈ విషయాన్ని అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) తమ విశ్లేషణలో తెలిపింది. ఇక వచ్చే ఏడాది ఇది 7.8 శాతానికి చేరుకుంటుంది. గృహావసరాల వ్యయం స్తోమతలు పెరగడం, పన్నుల సంస్కరణలు వంటి పలు అంశాలు ఈ పరిణామానికి దోహదం చేస్తాయని అంచనా వేశారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సగటు వృద్ధి రేటు 3.9తో పోలిస్తే భారత్ వృద్ధి ఈ స్థాయిలో ఉండటం కీలకమని భావిస్తున్నారు. ఇక లండన్‌కు చెందిన ఆర్థిక వ్యాపార వ్యవహారాల పరిశోధనా కేంద్రం జరిపిన అధ్యయనంలో ఇండియా ఆర్థిక ప్రగతి వేగం గురించి విశ్లేషించారు. ఇందులోనే బ్రిటన్, ఫ్రాన్స్‌లను భారతదేశం ఆర్థిక పురోగతిలో వెనకకునెట్టివేస్తుందని తెలిపారు. ఇందులోని అంశానికి అనుగుణంగా ఇప్పుడు ఫ్రాన్స్ భారత తిరోగమించింది. ఇక భారత్ 2032 నాటికి ప్రపంచ స్థాయిలో అతి పెద్ద మూడో ఆర్థిక శక్తిగా మారుతుందని విశ్లేషించారు. ఈ క్రమంలో చైనా ప్రగతి ఏ ర్యాంక్‌లో ఉంటుందనేది వెల్లడించలేదు.

Comments

comments