Home ఎడిటోరియల్ విద్యావిధానంలో మార్పులు నాణ్యతను పెంచేవిగా ఉండాలి

విద్యావిధానంలో మార్పులు నాణ్యతను పెంచేవిగా ఉండాలి

Education“నా జీవిత లక్షం విద్య. మానవ సమస్యల న్నింటికి మూల పరిష్కారం విద్యలోనే ఉంది. అని నా నమ్మకం” అన్న రవీంద్రనాథ్ ఠాగూర్ మాటలు మానవుని ప్రగతిలో విద్యయొక్క స్థానాన్ని స్పష్టీకరి స్తున్నాయి. ఊయల నుండి ప్రారంభమయ్యే విద్య తుది ఊరేగింపు క్షణాలవరకు కొనసాగు తుంది. విద్యయొక్క అంతిమ లక్షం ఉత్తమ పౌరుల ను తయారు చేయడమే. వేదకాల గురుకుల విధానం నుండి నేటి పాఠశాల విద్యావిధానం వరకు విద్యా విధానంలో అనేక ప్రయోగాలు అమలు చేయ బడ్డాయి. అయినా ఏదీ శాశ్వత విద్యావిధానంగా స్థిరీకరించబడలేదు. మారుతున్న కాలానుగుణంగా విద్యావిధానంలో కొత్తమార్పులు వచ్చాయి. స్వాతంత్య్రానంతరం నియమించిన విశ్వవిద్యా లయాల కమిషన్ (1948-49), మాధ్యమిక విద్యా కమిషన్ (1953), డి.ఎస్.కొఠారి కమిషన్ (1964-66)లు చేసిన విలువైన సూచనల ప్రకారం విద్యా విధానాలు రూపొందాయి. ఇందిరాగాంధీ కాలంలో 1968లో తొలి జాతీయ విద్యావిధానం అమలు చేశారు. రాజీవ్‌గాంధీ కాలంలో 1986లో రెండవ జాతీయ విద్యావిధానం ప్రవేశపెట్టి 1992లో పి.వి. నరసింహారావు కాలంలో మార్పులు చేశారు. 2005 లో మన్మోహన్‌సింగ్ నాయకత్వంలోని యుపిఎ కనీస ఉమ్మడి ప్రణాళిక ననుసరించి నూతన విద్యా విధానం ప్రవేశపెట్టారు. ప్రస్తుతం ఆ విధానమే అమలులో ఉంది
ప్రధాని నరేంద్రమోడీ నాయకత్వంలోని ఎన్‌డిఎ ప్రభుత్వం విద్యావిధానంలో మార్పులు చేయాలని ఆలోచిస్తున్నది. ఇందుకోసం “నూతన విద్యా విధానం- చర్చనీయాంశాలు” అనే చర్చా పత్రాన్ని ప్రజల్లోకి పంపించారు. 13భాగాలుగా ఉన్న ఈ పత్రాన్ని గ్రామ, మండల, జిల్లా, రాష్ట్రస్థాయిలలో చర్చించి విద్యావిధానంలో తీసుకురావల్సిన నూతన ధోరణులపై సలహలు, సూచనలు ఆహ్వానిస్తారు. దేశవ్యాప్త ప్రజాభిప్రాయం సారాన్ని క్రోడీకరించి ‘నూతన విద్యావిధాన’ బిల్లును రూపొందిస్తారు. పార్లమెంటు ఆమోదం తర్వాత బిల్లు చట్టరూపం దాల్చి అమలులోకి వస్తుంది. చట్టాన్ని అమలు చేయ డానికి కేంద్ర మానవ వనరుల శాఖామంత్రి ‘కార్యా చరణ పథకాన్ని’ ప్రవేశపెట్టి ఆమోదింప చేస్తారు.
ప్రస్తుత విద్యావిధానాన్ని పరిశీలించినట్లైతే సమూల మార్పులు చేయాల్సిన అవసరం కన్పి స్తుంది. 1-8తరగతుల ఎలిమెంటరీ విద్యలో విద్యా ర్థులు ‘కనీస అభ్యసనా స్థాయిలు’ సాధించేలా హామీ ఇవ్వాల్సి ఉంది. ఇందుకోసం నర్సరీ తరగతులు ప్రారంభించడం, తరగతికి ఒక ఉపాధ్యాయున్ని నియమించి బాధ్యత వహించేలా చేయడం, బోధనా పద్ధతిని అనుసరించడంలో ఉపాధ్యాయునికి స్వేచ్ఛ ఇవ్వడం, పుస్తకాలు, చూచిరాత కాపీలు, టిఎల్‌ఎం సరఫరా చేయడం, ఆకర్షించేందుకు రంగుల గోడలు, ఫర్నీచర్, జంపఖానాలు, ఆటవస్తువులు, చార్టులు, బొమ్మలు సరఫరా చేయడం, కఠినమైన పర్యవేక్షణా విధానాన్ని ప్రవేశపెట్టడం ద్వారా మంచి ఫలితాలు సాధించవచ్చు. ప్రాథమిక ఉపాధ్యాయు లకు బోధనేతర విధులు అప్పగించకూడదు. డిజి తరగతులు, వీడియో పాఠాలు ప్రారంభించి వాటిని ఉపయోగించడంలో టీచర్లకు తగు శిక్షణ ఇవ్వాలి. ఈ పునాది స్థాయి విద్యను మెరుగుపరచాలంటే ఉపాధ్యాయ విద్యలో మార్పులు చేయాలి. వాచకా లలో స్థానిక భాషను చేర్చాలి. గిరిజనులకు వారి మాతృభాషలో విద్యనేర్పాలి. ఎలిమెంటరీ విద్యలో ‘తెలుగు’ బోధనా భాషగా ఉండాలి. ఈ స్థాయిలో మాతృభాషకు తోడుగా మరొక భాషను నేర్పాలి. పటిష్టమైన భాషా నిర్మాణం తొలి రెండు, మూడు తరగతులలోనే ప్రారంభం కావాలి. పదాల, అక్షరాల ఉచ్ఛారణలో తేడాలు, వాక్యనిర్మాణంపై దోషాలు లేకుండా రాయడంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి.
9-12 తరగతుల సెకండరీ విద్యలో విద్యార్థి నేర్చు కుంటూ వృత్తివిద్యల అభ్యసించే విధానాన్ని ప్రవేశపెట్టాలి.ఈ దశలో బోధనా మాధ్యమంగా తెలుగు, ఇంగ్లీషు ప్రవేశపెట్టాలి. ఆరు సబ్జెక్టులలో భాగంగా ఒక సబ్జెక్టును వృత్తివిద్యకు కేటాయించాలి. గ్రామీణ చేతివృత్తులు, హస్తకళలు, వ్యవసాయ పద్ధ తులు, సాగులో శిక్షణ, ఇటుకల తయారీ, పరిశ్ర మలకవసరమైన నైపుణ్యాలు, వ్యాపార నైపుణ్యాలు, పరిపాలనాసేవలు, సేవారంగ నైపుణ్యాలు మొద లగు విషయాలను వృత్తివిద్యలలో భాగంగా ప్రవేశ పెట్టి శిక్షణ ఇవ్వాలి. వ్యాయామ విద్యకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి. ప్రతి పాఠశాలను స్మార్ట్ క్లాస్ పాఠశాలగా తీర్చిదిద్దాలి. క్రీడాపరికరాలు, ల్యాబ్ లు, గ్రంథాలయాలకు పేపర్లు, పుస్తకాలు, వైట్, గ్రీన్ బోర్డులు సమకూర్చాలి. కళలు, సాంస్కృతిక, విలువ ల, కంప్యూటర్ విద్య వాచకాలను సరఫరా చేయాలి.
ప్రస్తుత పాఠ్యపుస్తక రచనా విధానంలో మార్పులు రావాలి. పుస్తకాలను ఆంగ్లంలో రాసి తెలుగులోకి అనువదించడం వల్ల భాష కఠినంగా ఉంటుంది. వాక్యనిర్మాణం కఠినంగా ఉండటం, కొన్ని సార్లు ఆంగ్లపదాలనే వాడటం, తెలుగు ప్రామా ణిక భాషను ఉపయోగించడం వల్ల విద్యార్థులకు విషయం సంక్లిష్టంగా ఉంటుంది. అలాగాక స్థానిక మాండలికాన్ని జోడించి తెలుగులోనే పుస్తకాలను తయారు చేయాలి. ఆంగ్ల విద్యార్థులకొరకు వీటిని తర్జుమా చేయవచ్చు. పుస్తక భాష కథాకథన రూపంలో, అత్యంత సులభశైలిలో ఉండాలి.
పిల్లల హాజరు, ఆరోగ్యం కోసం మధ్యాహ్న భోజన పథకాన్ని మరింత విస్తరించాలి. ఉదయం, మధ్యాహ్నం, అల్పాహారం ఇచ్చే ఏర్పాటు చేయాలి. ప్రతీరోజు గుడ్డు, ఒక పండు, పాలు ఇవ్వాలి. విద్యార్థులకిష్టమైన ‘మెనూ’ను అందించే ఏర్పాటు చేయాలి. కులం వారీగా విద్యార్థుల భోజన వివరాల సేకరణ నిలిపివేయాలి. సిసిఇ పరీక్షా విధానం బోధనా సమయాన్ని హరించకుండా మార్గాలను ఆలోచించాలి. ఎక్కువ మంది విద్యార్థులున్న చోట పరీక్షల నిర్వహణకే విలువైన సమయం వృధా అవుతుంది. అలాకాక ఒకే పరీక్షాపత్రంలో నాలుగు పరీక్షాంశాలుండేలా చూడాలి.
పాఠశాల విద్యలో ప్రస్తుతం ఉన్న తనిఖీ వ్యవస్థను పునర్‌వ్యవస్థీకరించాలి. ప్రతీమండలంలో ఇద్దరు ఎంఇఓలను, ప్రతి నియోజకవర్గానికొక ఉప విద్యాశాఖాధికారిని నియమించాలి. ప్రతి పాఠశాల ను సం॥నికి ఒకసారి ‘పూర్తిస్థాయి’ తనిఖీ నిర్వహిం చేలా ఏర్పాటు చేయాలి. మండలం లోని పాఠశాల లను ఎంఇఒలు అన్‌లైన్‌ద్వారా పర్య వేక్షించే ఏర్పాట్లు చేయాలి. ఉపాధ్యాయ పదోన్నతు లలో ‘సామర్థపరీక్ష’లను ప్రవేశపెట్టి ఉత్తీర్ణత సాధిం చిన వారికే ప్రమోషన్స్ ఇవ్వాలి. ప్రతి 5 లేదా 7 సం॥ లకు బోధనా సామర్థం పెరుగుతుంది. పాఠ్య పుస్తకాలు, కాపీలు, పెన్నులు, టై, బెల్టు, బ్యాడ్జీ, డైరీల ను జూన్ 12 నాడే ఒకేసారి ప్యాకేజి రూపంలో అందిస్తే దుర్వినియోగాన్ని అరికట్టవచ్చు. ప్రస్తుతం ఉన్న నాన్ డిటెన్షన్ విధానాన్ని కొనసాగించాలి. అన్ని పాఠశాలల్లో ఎన్‌ఎస్‌ఎస్, ఎన్‌సిసి, స్కౌట్స్, పని అనుభవం తప్పనిసరి చేయాలి. మంచి శక్తిసామ ర్థాలు గల ఉపాధ్యాయులను 60సం॥ల వరకు కొనసాగించాలి. దేశం మొత్తం సామాన్య పాఠశాల విద్యను ప్రవేశపెట్టాలి. అంతర్గతంగా ఉత్తమ ఉపాధ్యాయులను గుర్తించే విధానం ప్రవేశపెట్టాలి.
నూతన విద్యావిధానం నెపంతో స్వంత ఎజెండాలను చొప్పించకూడదు. విద్యావిధానం 21వ శ॥లో అభి23వృధ్ధి చెందిన దేశాల వరుసలో మన దేశాన్ని నిలబెట్టేలా, ఉత్పాదకతతో కూడిన, నైతిక వర్తనులై, దేశభక్తికలిగిన పౌరులను తీర్చిదిద్దేలా ఉండాలి.
– 9491822383