Home తాజా వార్తలు దినేష్ కార్తీక్‌పై దుమ్మెత్తిపోస్తున్న ఫ్యాన్స్ !

దినేష్ కార్తీక్‌పై దుమ్మెత్తిపోస్తున్న ఫ్యాన్స్ !

Dinesh Karthikహామిల్టన్: న్యూజిలాండ్ తో ఆదివారం జరిగిన చివరి టీ20లో టీమిండియా బ్యాట్స్ మెన్ దినేష్ కార్తీక్‌ చేసిన తప్పిదంపై ట్విట్టర్ వేదికగా భారత అభిమానులు దుమ్మెత్తిపోస్తున్నారు. నిన్నటి మ్యాచ్ లో భారత్ కేవలం 4 పరుగుల తేడాతో పరాజయం పాలైన సంగతి తెలిసిందే. చివరి ఓవర్ లో 16 పరుగులు కావాల్సి వచ్చింది. అయితే ఆఖరి ఓవర్ టిమ్‌సోథీ కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో సమీకరణం చివరి 2 బంతులకు 12 పరుగులుగా మారింది. అయిదో బంతికి పరుగులేమీ ఇవ్వని సోథీ ఆరో బంతిని వైడ్ వేశాడు. ఆ తర్వాతి బంతిని దినేశ్ కార్తిక్ సిక్స్‌గా మలిచినప్పటికీ టీమిండియా విజయానికి నాలుగు పరుగుల దూరంలోనే నిలిచిపోయింది. అయితే కీలక సమయంలో కార్తీక్ రెండు డాట్ బాల్స్ ఆడటం జట్టు కొంప ముంచిందనేది అభిమానుల మాట. అందులో ఒక బంతికి సింగిల్ తీసే అవకాశం ఉన్నా.. కృనాల్‌ పాండ్యాకు స్ట్రైక్ ఇవ్వడానికి కార్తీక్ నిరాకరించాడు. దీనిపైనే ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.

సాధారణంగా ధోనీ టెలెండర్లతో కలిసి ఆడే మహేంద్రుడు సింగిల్స్ తీసుకోవడానికి ఇష్టపడడు. తనదైన శైలిలో భారీ షాట్లతో మ్యాచ్ ను ముగిస్తుంటాడు. ఇదే తరహాలో కార్తీక్ కూడా పాండ్యాకు స్ట్రైక్ ఇవ్వకపోగా.. మ్యాచ్ ఓడిపోవడానికి కారణమవ్వడంతో అభిమానుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. నువ్వేమైనా ధోనీ అనుకుంటున్నావా ? అంటూ ట్రోల్ చేస్తున్నారు. ఇక నాన్ స్ట్రైక్ లో ఉన్న కృనాల్ కూడా అప్పటికే భారీ షాట్లు ఆడి సత్తాచాటాడు. ఒకవేళ సింగిల్ తీసి అతనికి స్ట్రైక్ ఇచ్చి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదేమోనని ఫ్యాన్స్ దినేష్ పై దుమ్మెత్తిపోస్తున్నారు. భారత మాజీ క్రికెటర్ హార్భజన్ సింగ్ సైతం కార్తీక్ ను తప్పుబట్టాడు. ఆ సమయంలో కార్తీక్ సింగిల్ తీసి ఉండాల్సిందని… అతడు అలా చేసి ఉంటే మ్యాచ్ ఫలితం మరోలా ఉండేదన్నాడు. అతడి చిన్న తప్పిదం జట్టు సిరీస్ కోల్పోయేలా చేసిందని విమర్శించాడు. గతేడాది శ్రీలంకలో జరిగిన నిదహాస్ ట్రోఫీ ఫైనల్లో బంగ్లాదేశ్‌పై చివరి బంతికి సిక్స్ కొట్టి జట్టును గెలిపించి శభాష్ అనిపించిన కార్తీక్… కివీస్ తో మ్యాచులో చేసిన తప్పిదంతో అబాసు పాలవుతున్నాడు. అప్పుడు హీరోలా కనిపించిన కార్తీక్.. ఇప్పుడు విలన్ అయిపోయాడు.

Indian Fans Trolling Dinesh Karthik