Search
Saturday 17 November 2018
  • :
  • :
Latest News

రోహింగ్యాలను ఆదుకోవాలి

Rohingya

సుమారు నాలుగు లక్షల మంది రోహింగ్యాలు మయన్మార్ నుండి శరణార్థులుగా బాంగ్లాదేశ్ చేరుకున్నారు. వీరిపై మయన్మార్ సైన్యం జరుపుతున్న హింసను ఆపడానికి ఆంగ్‌సాన్ సూకీకి ఇదే చివరి అవకాశం. ఆమె తక్షణమే స్పందించకపోతే శరణార్థుల పరిస్థితి మరింత భయకరంగా మారుతుంది” అన్న ఐ.రా.స.ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటేరాస్ మాటలకు నోబెల్ శాంతి బహుమతి గ్రహీత ఎలా స్పందిస్తారో చూడాలి. ఈ లోగా వచ్చే మంగళవారం జరిగే సాధారణ సభ సర్వసభ్య సమావేశంలో రోహింగ్యాల జాతి నిర్మూలనపైన అంతర్జాతీయ సమాజం స్పందనకై ఒత్తిడి తేవాల్సి ఉంది. గత కొంత కాలంగా ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్న రోహింగ్యాల సమస్య 21వ శతాబ్దిలో దారుణ మానవ విపత్తులలో ఒకటి.
బాంగ్లాదేశ్ సరిహద్దుల్లో మయన్మార్‌కు పశ్చిమాన గల రాష్ట్రమే రఖైన్. ఒకప్పుడు దీనిని ఆరఖాన్ అనేవారు. మొత్తం దేశంతో పాటు ఈ రాష్ట్రంలో కూడా బౌద్ధులు అధిక సంఖ్యాకులుగా, రొహింగ్యా ముస్లింలు అల్పసంఖ్యాకులుగా ఉన్నారు. ఇస్లాంలోని సున్నీ తెగకు చెందిన వీరు 471 గ్రామాలలో 8 నుండి 11లక్షల వరకు ఉన్నారు. అడవులలో నివసిస్తూ సహజ వనరులపై ఆధారపడే వీరిలో 78% మంది దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నారు. 1948లో బ్రిటిషిండియా నుండి స్వాతంత్య్రం పొందిన బర్మా(మయన్మార్) దేశంలోని విభిన్న తెగలైన రోహింగ్యాలు, కరేన్, మాన్, షాన్‌లను కలుపుకుని పోవడానికి బదులు రెండవ తరగతి పౌరులుగా పరిగణిస్తూ వచ్చింది ఆ దేశం. రోహింగ్యాలను 1982 నాటి పౌరసత్వచట్టం పౌరులుగా గుర్తించలేదు. శతాబ్దాలుగా రఖైన్
(ఆరఖాన్) వీరి స్వస్థలం. ఐతే 1990ల వరకు వీరు బంగ్లాబర్మా సరిహద్దుల్లో స్వేచ్ఛగా సంచరిస్తూ వ్యవసాయం, వ్యాపారం చేస్తూ వచ్చారు. సైనిక ప్రభుత్వ చట్టాలతో వీరి కదలికలకు బ్రేక్ పడింది. మిలిటరీ ప్రభుత్వం ప్రోత్సాహంతో చైనా, జపాన్, కొరియా బహుళ జాతి కంపెనీలు గత 50 ఏండ్లుగా రోహింగ్యాల సహజ ఆవాసాలను, భూములను ఆక్రమించుకున్నాయి. గత 70ఏండ్లలో మిలిటరీ ప్రభుత్వాల వైఫల్యం వల్ల ఈ ప్రాంతం వెనుకబాటుతనానికి గురికావడమే ప్రస్తుత సమస్యలకు మూలకారణం. ప్రభుత్వం చూపే వివక్షత, ఎంఎన్‌సిల దోపిడి, పౌరసత్వం, కనీస హక్కులు లేకపోవడం, పేదరికం, అధిక సంఖ్యాకులైన బౌద్ధుల ఆధిపత్య ధోరణులు, హింస తదితర కారణాలవల్ల క్రమేణా రోహింగ్యాలలో వేర్పాటు ధోరణులు బయలుదేరాయి. ప్రత్యేక రాష్ట్ర డిమాండ్‌తో “ఆర్‌కాన్ రోహింగ్యా సాల్వేషన్ ఆర్మీ (ఎఆర్‌ఎస్‌ఎ) ఆవిర్భవించింది.
2012లో ఒక బౌద్ధ మహిళను రోహింగ్యా తెగవారు మానభంగం చేయడంతో తెగల ఘర్షణ ప్రారంభమైంది. బర్మాలో శక్తివంతులైన బౌద్ధ సన్యాసులు సోషల్ మీడియాతోపాటు ప్రసార మాధ్యమాలలో పట్టుకలిగి ఉన్నారు. బౌద్ధులురోహింగ్యాల మధ్య వివాహ సంబంధాలను నిరాకరించడంతోపాటు, బర్మీసేతర తెగల వారికి కనీసహక్కులు నిరాకరిస్తూ వచ్చారు. 2015లో 25,000 మంది రోహింగ్యాలు కిక్కిరిసిన పడవులలో మలేషియా, ఇండోనేషియా, థాయ్‌లాండ్‌లకు వలసపోయారు. బోటు ప్రమాదాలలో వందల సంఖ్యలో వీరు మరణించారు. తాజాగా 2017 ఆగస్టు 25న ఎఆర్‌ఎస్‌ఎ తిరుగుబాటుదారులు సైన్యం, పోలీసు పోస్టులపై జరిపిన దాడిలో 12 మంది మృతిచెందారు. దీనివెనుక “ఆటా ఉల్లా” అనే పాక్‌లో స్థాపించబడిన ఉగ్రవాద సంస్థ హస్తం ఉంది. వెంటనే ప్రతిదాడులు ప్రారంభించిన సైన్యం ‘రొహింగ్యాల జాతి నిర్మూలనే’ లక్షంగా 471గ్రామాలలో 176 గ్రామాలను కాల్చి బూడిద చేసింది. ఈ ఊచకోతలో రక్తం ఏరులై పారుతోంది. రోహింగ్యాలపై హింసను “జాతుల హననానికి” చక్కని ఉదాహరణగా ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కమిషన్ హై కమిషనర్ జైద్ రాడ్ అభివర్ణించారు. రాఫ్ నదిలో ప్రయాణిస్తూ పడవ మునిగి 26 మంది మరణించారు.
నోబెల్ గ్రహీత ఆంగ్‌సాన్ అనేక సంవత్సరాల గృహనిర్బంధం తర్వాత పగ్గాలు చేపట్టి తాజాగా విమర్శలు ఎదుర్కొంటున్నారు. సైన్యంపై దాడికి ప్రతీకారంగా ఈ దాడులు చేశామని ప్రకటించిన సైన్యం రోహింగ్యా స్త్రీలపై అత్యాచారాలకు ఒడిగట్టింది. బర్మా రాజ్యాంగంలో సైన్యంపై అధినేతకు పట్టు లేకపోవటం తాజా సంక్షోభానికి మరోకారణం.
రోహింగ్యాల వలస ప్రభావాన్ని తక్షణం ఎదుర్కొంటున్న దేశం బంగ్లాదేశ్. 160 మిలియన్ జనాభాతో ప్రపంచంలోనే కిక్కిరిసిన జనసాంద్రత గల ఈ పేదదేశంలో తలసరి స్థూల దేశీయోత్పత్తి(జిడిపి) 1500 పౌండ్లు మాత్రమే. శీతోష్ణస్థితి ప్రభావంతో దశాబ్దాలుగా వరదల సమస్యతో సతమతం అవుతున్న బాంగ్లాకు 4 లక్షలమంది రోహింగ్యాలు భారంగా మారారు. ఇంతకు మించి రానివ్వబోమని ప్రకటించిన బంగ్లా కాక్స్ బజార్ జిల్లాలో తాత్కాలిక గుడారాలు నిర్మిస్తున్నది. వీరు సాధారణ ప్రజల్లో కలిసి అదృశ్యం కాకుండా వేరుగా ఉంచి త్వరలోనే మయన్మార్ లేదా మూడో దేశానికి పంపాలన్నది బంగ్లా ఆలోచన.
ప్రధాని మోడీ మయన్మార్ పర్యటన కాగానే ఈ సమస్యకు రాజకీయ పరిష్కారం కనుగొనాలని భారత్ సూచించింది. ఇప్పటికే కాశ్మీర్ తదితర ప్రాంతాలలో ఉన్న 40,000 రొహింగ్యాలను అక్రమ వలసదారులని, జాతీయ భద్రతకు ప్రమాదకారులని, వెంటనే స్వదేశం పంపాలన్న భారతప్రభుత్వం ప్రయత్నాలను వ్యతిరేకించాలని సమితి మానవ హక్కుల కమిషన్ ప్రకటించింది. దక్షిణాసియాలో అతిపెద్ద శక్తిగాను, ప్రపంచంలో పెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఉన్న భారత్‌కు చారిత్రకంగా శరణార్థులను ఆదుకునే దేశంగా గుర్తింపు ఉంది. 1980, 90లలో మయన్మార్ నుండి వచ్చిన వేలాది శరణార్థులకు భారత్ ఆశ్రయం కల్పించింది. 1,20,000 మంది టిబెటన్ బౌద్ధులు మనదేశం నలుమూలలా ఉన్నారు. ఇప్పుడు 40,000 మంది రొహింగ్యాలను భారత్ తిప్పి పంపినా స్వీకరించడానికి బాంగ్లా, మయన్మార్ సిద్ధంగా లేవు. అందువల్ల మానవతా దృక్పథంతో మనదేశం ఆశ్రయం కల్పించాలి. 1948 వరకు వారు మన బ్రిటిషిండియాలో భాగంగా ఉన్నారన్న భావంతోనైనా స్పందించాలి.

Comments

comments