Search
Tuesday 20 November 2018
  • :
  • :
Latest News

భారత్ హ్యాట్రిక్ గెలుపు

 అండర్-19 ప్రపంచకప్

Cricket

మౌంట్ మౌంగానూయి: అండర్19 ప్రపంచకప్‌లో భారత యువ క్రికెట్ జట్టు వరుసగా మూడో విజయం నమోదు చేసింది. శుక్రవారం జరిగిన గ్రూప్‌బి చివరి మ్యాచ్‌లో భారత్ పది వికెట్ల తేడాతో జింబాబ్వేను చిత్తు చేసింది. వరుసగా మూడో విజయంతో భారత్ గ్రూప్‌లో అగ్రస్థానాన్ని దక్కించుకుంది. భారత్ ఇంతకుముందే క్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్న విషయం తెలిసిందే. కాగా, ముందుగా బ్యాటింగ్ చేసిన జింబాబ్వే 48.1 ఓవర్లలో 154 పరుగులకే కుప్పకూలింది. అనుకుల్ సుధాకర్ రాయ్ మరోసారి అద్భుత బౌలింగ్‌ను కనబరిచాడు. 20 పరుగులు మాత్రమే ఇచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు. అభిషేక్ శర్మ, అర్షదీప్ సింగ్ రెండేసి వికెట్లను పడగొట్టి తవమంతు సహకారం అందించారు. జింబాబ్వే జట్టులో మిల్టన్ శుంబా (36), ఓపెనర్ వెస్లి (30), కెప్టెన్ రొచె (31) కాస్త పోరాట పటిమను కనబరిచారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన భారత్ 21.4 ఓవర్లలోనే వికెట్ నష్టపోకుండానే విజయాన్ని అందుకుంది. పృథ్వీషా (56 నాటౌట్) మరోసారి కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడాడు. మరోవైపు శుభం గిల్ 59 బంతుల్లోనే 13 ఫోర్లు, ఒక సిక్స్‌తో 90 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. దీంతో భారత్ పది వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. ఈ విజయంతో భారత్ గ్రూప్‌బిలో అగ్రస్థానంలో నిలిచింది. మరోవైపు భారత్ చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ కూడా క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది. శుక్రవారం కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో పాక్ మూడు వికెట్ల తేడాతో శ్రీలంకను ఓడించింది. ఈ విజయంతో పాక్ క్వార్టర్ ఫైనల్ బెర్త్ ఖాయమైంది.

Comments

comments