Home ఎడిటోరియల్ సంపాదకీయం: రాష్ట్రపతి ఎన్నిక-ప్రతిపక్షాల ఐక్యత!

సంపాదకీయం: రాష్ట్రపతి ఎన్నిక-ప్రతిపక్షాల ఐక్యత!

Sampadakeeyam-Logoరాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఐదేళ్ల పదవీకాలం జులై 25న ముగియ నుండటంతో కొత్త రాష్ట్రపతి ఎన్నికకు రాజకీయ పార్టీల సమాలోచనలు అప్పుడే ప్రారంభమైనాయి. కేంద్రంలోని పాలకపార్టీ తన అభ్యర్థిని రాష్ట్రపతి భవన్‌కు ఏకపక్షంగా పంపేరోజులు ఎప్పుడో గతించాయి. ప్రణబ్ ముఖర్జీ కాంగ్రెస్ అభ్యర్థి అయినప్పటికీ సమాజ్‌వాదిపార్టీ, తృణమూల్ కాంగ్రెస్, వామపక్షాల తోడ్పాటు తీసుకున్నారు. ప్రస్తుతం బిజెపికి లోక్‌సభలో పూర్తి మెజారిటీ, పెద్దరాష్ట్రం ఉత్తరప్రదేశ్ సహా అనేక రాష్ట్రాల్లో అధికారం ఉన్నప్పటికీ తన అభ్యర్థిని ఏకపక్షంగా గెలిపించుకునే స్థితిలేదు. బిజెపికి, దాని ఎన్‌డిఎ మిత్రపక్షాలకు కలిపి ఎలక్టోరల్ కాలేజీలో 35000 ఓట్ల విలువ తక్కువ ఉంది. అయితే ఆ కూటమి అభ్యర్థిని బలపరిచే ఇతర ప్రాంతీయ పార్టీలు లేవా అన్నది వేచి చూడాల్సిఉంది. ఈ పరిస్థితిలో అభ్యర్థిపై ఏకాభిప్రాయసాధన బిజెపికి ఎంతైనా అవసరం. సీనియర్ నాయకులు ఎల్.కె.అద్వానీ, మురళీ మనోహర్ జోషి లాంటివారికి ఈ అత్యున్నత పదవిపై ఆశలేకపోలేదు.

అయితే బాబ్రీమసీదు కూల్చివేతకు కుట్రకేసు విచారణను సుప్రీంకోర్టు పునరుద్ధరించటంతో, వారు ఆటోమాటిక్‌గా అనర్హులైనారు. ప్రధాని మోడీ, ఆర్‌ఎస్‌ఎస్ అధినేత భగవత్‌లకు వారిని బుజ్జగించే పని తప్పింది. బిజెపిని నడిపిస్తున్న మోడీ, అమిత్‌షా ద్వయం అభ్యర్థి విషయంలో గుంభనగా ఉన్నారు. దేశాన్ని ‘హిందూ రాష్ట్ర’ వైపు ఒక అడుగు ముందుకు తీసుకెళ్లేందుకై భగవత్‌ను రాష్ట్రపతి అభ్యర్థిగా నిర్ణయించాలని శివసేన అధికార ప్రతినిధి సంజయ్ రౌత్ ప్రతిపాదించగా ఆయన తోసిపుచ్చటం గుర్తుచేసుకో దగింది. పాలక బిజెపి ప్రతిపక్షాలను కూడా విశ్వాసంలోకి తీసుకుని అందరికీ ఆమోద యోగ్యమైన తటస్థ అభ్యర్థి కొరకు ప్రయత్నిస్తుందా లేక సొంత అభ్యర్థిని ప్రకటిస్తుందా అన్నది ఆసక్తిదాయకం. అయితే ప్రతిష్టాత్మక పదవుల్లోకి హిందూత్వ సిద్ధాంతంలో విశ్వాసంగలవారినే నియమిస్తున్న బిజెపి ధోరణిని బట్టి అది తన సొంత అభ్యర్థిని నిర్ణయించే అవకాశాలే ఎక్కువ. అవసరమైన అదనపు ఓట్లు సంపాదించటం పాలకపార్టీగా కష్టం కాకపోవచ్చు.

ప్రతిపక్షాలన్నీ ఐక్యంకాగలిగితే తమ అభ్యర్థిని గెలిపించుకోవటం తార్కికంగా సాధ్యం. రాజ్యాంగ మౌలిక విలువలను, దేశ బహుళత్వాన్ని ధ్వంసం చేస్తున్న బిజెపిని 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఐక్యంగా ఎదుర్కోవాలన్న స్పృహ ప్రతిపక్షపార్టీల్లో పెరుగుతున్నప్పటికీ అది పార్లమెంటు ఫ్లోర్‌లో సమస్యలపై సమన్వయం సాధించినంత సులువు కాదు. కాంగ్రెస్ దేశవ్యాప్త పార్టీగా ఉన్నప్పటికీ అత్యధిక రాష్ట్రాల్లో అది దారుణంగా బలహీనపడటం, ఇతర ప్రతిపక్షాల్లో కాంగ్రెస్ వ్యతిరేకత మూలంగాగల పార్టీలుండటం బిజెపియేతర ప్రతిపక్షాల ఐక్యతకు ప్రధాన అవరోధం. సోషలిస్టు నాయకుడు మధులిమాయె 95వ జన్మదినోత్సవ సభలో కాంగ్రెస్, ఎన్‌సిపి, జనతాదళ్ (యు), సమాజ్‌వాది పార్టీ, ఆర్‌జెడి, ఆర్‌ఎల్‌డి, జనతాదళ్(ఎస్), సమాజ్ వాది జనతా పార్టీ, సిపిఐ, సిపిఐ(ఎం) పాల్గొనటం ప్రతిపక్ష ఐక్యతకు బీజం వేయగలిగితే అది శుభ పరిణామమవుతుంది. సోషలిస్టు స్రవంతికి చెందిన జనతా పరివారం, వామపక్షాలు కాంగ్రెస్ వ్యతతిరేకతనుంచి బయటపడగలిగితేనే-వారు సిద్ధాంతీకరించే ‘మతోన్మాద శక్తుల ప్రమాదం’ నుంచి దేశాన్ని కాపాడే ప్రయత్నాలకు బలం చేకూరుతుంది.

ఇదిలావుండగా, రాష్ట్రపతి పదవికి అందరికీ ఆమోదయోగ్యమైన అభ్యర్థిని నిలబెట్టే విషయంలో లౌకిక పార్టీల మధ్య ప్రాథమిక చర్చలు అప్పడే ప్రారంభ మైనాయి. బీహార్ ముఖ్యమంత్రి, జెడి(యు) అధ్యక్షుడు నితీష్‌కుమార్ గతవారం కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీని కలుసుకుని రాష్ట్రపతి అభ్యర్థిపై చొరవ తీసుకోమని కోరటంతో సంప్రదింపుల ప్రక్రియ మొదలైంది. శరద్ పవార్(ఎన్‌సిపి), శరద్ యాదవ్ (జెడియు), డి.రాజా(సిపిఐ), సీతారాం ఏచూరి(సిపిఎం) సోనియాజీ ని కలుసుకున్నారు. తృణమూల్, బిజెడి, ఎఐఎడిఎంకె, డిఎంకె, ఆర్‌జెడి తదితర పార్టీలతో చర్చలు సాగించాల్సి ఉంది. ఏదిఏమైనా, 14వ రాష్ట్రపతి ఎన్నిక బహు ఆసక్తికరంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి.