Home ఎడిటోరియల్ సంపాదకీయం: రైల్వేల ‘దోపిడీ’ వ్యూహం

సంపాదకీయం: రైల్వేల ‘దోపిడీ’ వ్యూహం

Sampadakeeyam-Logoప్రధాన ప్రజారవాణా వ్యవస్థ అయిన రైల్వేలను ఫక్తు వ్యాపార సంస్థగా మార్చేదిశగా ఎన్‌డిఎ ప్రభుత్వం ప్రయాణిస్తోంది. సీట్లు-బెర్తులకు పెరిగే డిమాండ్‌ను బట్టి ప్రయాణఛార్జీలు పెంచే విధంగా రైల్వేలు ప్రవేశ పెడుతున్న విధానం (సర్జ్ ప్రైసింగ్)ఇందుకు నాంది. ప్రస్తుతానికి ప్రధానంగా సంపన్నులు ఉపయోగించే రాజధాని, దురంతో, శతాబ్ది సూపర్ ఫాస్ట్ రైళ్లలో ప్రయోగాత్మకంగా ఈ పథకం ప్రవేశపెడు తున్నప్ప టికీ, దీన్ని ఇక్కడే ప్రజలు వెనక్కి కొట్టకపోతే అది అన్ని రకాల సూపర్ ఫాస్ట్ రైళ్లకు విస్తరించే ప్రమాదం ఉంటుంది. ఒక రైలులోని కోచ్‌లన్నిటికీ రిజర్వేషన్ పూర్తయినాక, అదనంగా డిమాండ్ ఉంటే అత్యవసరంగా అదనపు కోచ్‌లు ఏర్పాటు చేయవలసివస్తే ఆ బెర్త్‌లకు కొంత అదనపు చార్జి విధించటం కూడా కాదిది. ఒక రైలులో ఉన్న బెర్త్‌ల్లో ముందుగా రిజర్వు చేసుకున్న 10 శాతానికి బేసిక్ రేటు, ఆ తదుపరి ప్రతి 10 శాతానికి రేటు పెరుగుతూ బేసిక్‌చార్జిపై 50 శాతం వరకూ చేరుతుంది. నాలుగు నెలల ముందునుంచే టిక్కెట్ రిజర్వేషన్ సౌకర్యం ఉన్నందున ఎంతో జాగ్రత్తగా, కచ్చితంగా ప్రయాణాన్ని నిర్ణయించుకునేవారికే బేసిక్ రేటుకు రిజర్వేషన్ లభిస్తుంది. అటువంటి వారు ప్రయాణీకుల్లో బహుకొద్దిమంది మాత్రమే ఉంటారు.

కొద్దిరోజుల ముందు ప్రయాణం ఖరారు చేసుకునేవారే ఎక్కువమంది ఉంటారు కాబట్టి రైల్వేలకు ఆదాయం పెరుగుతుంది. పై మూడు రైళ్లల్లో కొత్త టికెటింగ్ విధానంవల్ల ఈ ఆర్థిక సంవత్సరంలో రు.500 కోట్లు అదనపు ఆదాయం సమకూరుతుందని అంచనా. అనేక సర్వీసు విభాగాలను ప్రైవేటీకరించిన రైల్వేలు ఆదాయార్జనకు ఇటీవల కాలంలో ప్లాట్‌ఫాం టిక్కెట్ రేటు రెట్టింపు చేసింది; అరటిక్కెట్ ఎత్తివేసింది; సీనియర్ సిటిజన్‌లకు రాయితీని బేసిక్ పేరుకు పరిమితం చేసింది. ప్రయాణీకుల రద్దీనిబట్టి టిక్కెట్ రేటు పెంచే విధానాన్ని ఆలోచిస్తున్నట్లు రైల్వేమంత్రి సురేష్ ప్రభు రైల్వేబడ్జెట్‌లో చెప్పారు. దాన్ని ఎలా అమలు చేస్తారో ఇప్పుడు బోధపడింది. దీన్ని ఫ్లెక్సీ-ఫేర్ పద్దతి అని కూడా అంటున్నారు. ఇందులో ప్రయాణీకులను దోచుకోవటానికి రైల్వేలకు వెసులుబాటు తప్ప ప్రయాణీకులకెట్టి వెసులుబాటు లేదు. సర్జ్ ప్రైసింగ్ ప్రకారం బేసిక్ ఛార్జిపై 50 శాతం అదనం వరకే రిజర్వేషన్ ఇస్తారు. ప్రయాణీకులు ఆ పైన తత్కాల్ ఎంచుకోవలసిందే. ఈ కొత్తపద్ధతి అధికారికంగా సాగించే బ్లాక్ మార్కెట్ లాంటిదని కొందరు ఘాటుగా విమర్శిస్తున్నారు. సాధ్యమైన అన్ని మార్గాల్లో డబ్బు పిండుకునే ప్రైవేటు వ్యాపారసంస్థలాగా రైల్వేలు వ్యవహరిస్తున్నాయంటున్నారు. ఇందులో నిజం లేకపోలేదు.

ప్రజారవాణా వ్యవస్థగా రైలు మార్గాలను మరింతగా విస్తరించటం, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి ప్రేరకశక్తిగా వాటిని ఉపయోగపెట్టటం ప్రభుత్వ బాధ్యత. కాని మార్కెట్ ఆర్థిక వ్యవస్థను ఎంచుకున్నాక రైల్వేల దృష్టి అంతా దీన్ని లాభదాయకంగా మార్చటం ఎలా అనేదానిపై పడింది. ఇందులో భాగంగా ప్రయా ణీకుల రవాణా ఛార్జీలు దఫదఫాలుగా పెంచుతున్నారు. అయినప్పటికీ ఇప్పటికీ ఇదే చౌక ప్రయాణమార్గం. సాధారణ ప్యాసింజర్ రైళ్లను తగ్గిస్తూ ఎక్స్‌ప్రెస్‌లు పెంచుతూ, ఎక్స్‌ప్రెస్‌లను సూపర్ ఫాస్ట్‌గా మార్చినట్లు ప్రకటిస్తూ ఆదాయం మాత్రం పెంచు కుంటున్నారు. అయితే చార్జీల పెంపుదలకు అనుగుణంగా, బడ్జెట్‌లో వాగ్దానాలకు తగినట్లు ప్రయాణీకుల సౌకర్యాలు మెరుగుపడటం లేదు. ప్రయాణీకులనుంచి రాబడితో రైల్వేలు ప్రపంచంలో ఎక్కడా లాభదాయకం కాలేవు. గూడ్స్ రవాణాయే ప్రధాన ఆదాయార్జన వనరు. దీన్ని లక్షాల మేరకు పెంచుకున్నప్పుడే రైల్వేల ఆర్థిక ఆరోగ్యానికి స్వస్థత చేకూరుతుంది. ప్రయోగాత్మ కంగా ప్రవేశపెట్టా మంటున్న అంచెలంచెల ఛార్జీ పద్ధతి ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదు. దాన్ని ఉపసంహరించుకోవాలి.