Home తాజా వార్తలు భారత్‌కు మరో రెండు స్వర్ణాలు

భారత్‌కు మరో రెండు స్వర్ణాలు

Indian rowers and Tennis Men's Double wins Gold: Asian Games 2018

జకార్తా: ఆసియా క్రీడల్లో భారత్ మరో రెండు స్వర్ణాలను గెలుచుకుంది. శుక్రవారం ఆరో రోజు రోయింగ్, టెన్నిస్ విభాగాల్లో భారత్‌కు స్వర్ణాలు లభించాయి. దీంతో ఈ క్రీడల్లో భారత్ సాధించిన పసిడి పతకాల సంఖ్య ఆరుకు చేరింది. కాగా, మహిళల కబడ్డీలో భారత్ ఫైనల్లో ఓడి రజతంతో సంతృప్తి పడింది. రోయింగ్‌లో భారత్‌కు మరో రెండు కాంస్యలు లభించాయి. షూటింగ్‌లో హినా సిద్ధు కాంస్యం సాధించింది. ఆర్చరీలో దీపిక కుమారి నిరాశ పరిచింది. టెన్నిస్‌లో రోహన్ బోపన్నదివిజ్ శరన్ పురుషుల డబుల్స్ విభాగంలో స్వర్ణం సొంతం చేసుకుంది. కాగా, ఇతర పోటీల్లో భారత ఆటగాళ్లు పెద్దగా రాణించలేదు. ఇప్పటికే ఆరు ముగిసి పోయినా భారత్ స్వర్ణాల సంఖ్య రెండంకెలాకు కూడా చేరుకోలేదు. పతకాలు సాధిస్తారని భావించిన షట్లర్లు నిరాశ పరిచారు. ఇక, మహిళల సింగిల్స్‌లో సింధు, సైనాలపైనే భారత్ పతకం ఆశలు నిలిచాయి. సింగిల్స్‌లో అగ్రశ్రేణి ఆటగాడు కిదాంబి శ్రీకాంత్ రెండో రౌండ్‌లోనే ఇంటిదారి పట్టాడు.

రోయింగ్‌లో పసిడి..
రోయింగ్ క్వాడ్రపుల్ స్కల్స్ విభాగంలో భారత పురుషుల జట్టు పసిడితో మురిపించింది. సవర్ణ్ సింగ్, దత్తు బోకనల్, ఓమ్ ప్రకాశ్, సుఖ్‌మిత్ సింగ్‌లతో కూడిన భారత జట్టు అసాధారణ ఆటతో పసిడిని సొంతం చేసుకుంది. ప్రతికూల వాతావరణాన్ని సైతం అధిగమిస్తూ అద్వితీయ ప్రతిభతో భారత బృందం తొలి స్థానాన్ని దక్కించుకుంది. భారత బృందం రికార్డు స్థాయిలో 6:17.13. సమయంలో రేసును పూర్తి చేసి స్వర్ణం సొంతం చేసుకుంది. ఇండోనేషియా, థాయిలాండ్ ఆటగాళ్ల నుంచి తీవ్ర పోటీ ఎదురైనా భారత బృందం దాన్ని తట్టుకుని ముందుకు సాగింది. ఇదే క్రమంలో అగ్రస్థానంలో నిలిచి స్వర్ణం గెలుచుకుంది. ఇండోనేషియాకు రజతం, థాయిలాండ్‌కు కాంస్యం లభించాయి. కాగా, రోయింగ్ లైట్‌వెయిట్ డబుల్ స్కల్స్ విభాగంలోభారత్‌కు కాంస్యం లభించింది. రోహిత్ కుమార్, భగవాన్‌దాస్‌లతో కూడిన జట్టు మూడో స్థానంలో నిలిచి కాంస్యం సాధించింది. మరోవైపు పురుషుల లైట్ వెయిట్ సింగిల్స్ స్కల్స్‌లో కూడా భారత్‌కు కాంస్యం దక్కింది. దుష్యంత్ ఈ విభాగంలో మూడో స్థానాన్ని పొంది దేశానికి కాంస్యం అందించాడు. శుక్రవారం భారత్‌కు రోయింగ్‌లో మూడు పతకాలు లభించాయి. ఇందులో ఒక స్వర్ణం, రెండు కాంస్య పతకాలు ఉన్నాయి.

బోపన్నదివిజ్ జోడికి స్వర్ణం..
మరోవైపు పురుషుల టెన్నిస్ డబుల్స్ విభాగంలో భారత్‌కు స్వర్ణం దక్కింది. రోహన్ బోపన్నదివిజ్ శరన్‌ల జోడీ అసాధారణ ఆటతో భారత్‌కు పసిడి పతకం అందించింది. ఫైనల్లో రోపన్న జోడి 63, 64 తేడాతో కజకిస్థాన్‌కు చెందిన అలెగ్జాండర్ బుబ్లిక్, డెన్నిస్ జంటను ఓడించింది. ప్రారంభం నుంచే బోపన్న జోడి చెలరేగి ఆడింది. ప్రత్యర్థి జంటపై పూర్తి ఆధిపత్యం చెలయిస్తూ ముందుకు సాగింది. భారత జంట చెలరేగి ఆడడంతో కజకిస్థాన్ జోడి తీవ్ర ఒత్తిడికి గురైంది. ఇదే సమయంలో వరుస తప్పిదాలకు పాల్పడింది. ప్రత్యర్థి ఆటగాళ్ల బలహీనతలను తమకు అనుకూలంగా మార్చుకున్న బోపన్న, శరన్‌లు లక్షం దిశగా అడుగులు వేశారు. ఇదే క్రమంలో తొలి సెట్‌ను సొంతం చేసుకున్నారు. రెండో సెట్‌లో బోపన్న జోడికి కాస్త పోటీ ఎదురైంది. అయితే చివరి వరకు ఆధిక్యాన్ని నిలబెట్టు కోవడంలో భారత జోడి సఫలమైంది. ప్రత్యర్థి ఆటగాళ్ల దాడులను సమర్థంగా తిప్పి కొడుతూ అలవోకగా సెట్‌ను గెలిచి దేశానికి స్వర్ణం సాధించి పెట్టారు.

హీనాకు కాంస్యం..
మహిళల షూటర్ హీనా సిద్ధు ఆసియా క్రీడల్లో కాంస్య పతకం సాధించింది. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఫైనల్లో హీనా సిద్ధు మూడో స్థానంలో నిలిచి కాంస్యం సొంతం చేసుకుంది. హోరాహోరీగా సాగిన పోరులో హీనా 219.2 పాయింట్లతో మూడో స్థానాన్ని దక్కించుకుంది. ప్రారంభంలో బాగానే ఆడిన హీనా కీలక సమయంలో ఒత్తిడికి గురైంది. ఈ క్రమంలో ఆమె గురి తప్పింది. దీంతో స్వర్ణం సాధించే అవకాశాన్ని చేజేతులా చేజార్చుకుంది. అంతకుముందు అర్హత పోటీల్లో కూడా సిద్ధు ఒత్తిడిలో కనిపించింది. దీంతో ఒక దశలో 14వ స్థానానికి పడిపోయింది. ఈ సమయంలో ఆమె పతకం సాధిస్తుందని ఎవరూ ఊహించలేదు. కానీ, మళ్లీ పుంజుకున్న సిద్ధు అసాధారణ ఆటతో ఐదో స్థానంలో నిలిచి స్వర్ణం రేసుకు దూసుకెళ్లింది. కానీ ఫైనల్లో ఒత్తిడిని జయించడంలో విఫలమై కాంస్యంతోనే సరిపెట్టుకుంది.

బోపన్న జోడీకి అభినందనలు…
ఆసియా క్రీడల్లో పురుషుల డబుల్స్ విభాగంలో స్వర్ణం సాధించిన టెన్నిస్ జంట రోహన్ బోపన్నదివిజి శరన్‌లను రాష్ట్ర ఐటి శాఖ మంత్రి కెటి.రామారావు అభినందించారు. అసాధారణ ఆటతో బోపన్నశరన్‌లు భారత ఖ్యాతిని ఇనుమడింప చేశారని సోషల్ మీడియా వేదికగా ప్రశంసించారు. అంతేగాక క్రీడల్లో స్వర్ణం సాధించిన రోయింగ్ జట్టును కూడా మంత్రి అభినందించారు. జకార్తా క్రీడల్లో భారత్ మరిన్ని పతకాలు సాధిస్తుందనే నమ్మకాన్ని మంత్రి వ్యక్తం చేశారు.