Home ఎడిటోరియల్ సౌదీలో భారతీయుల పాట్లు

సౌదీలో భారతీయుల పాట్లు

Indian-workers-In-Saudiఈ ఏడాది ఏప్రిల్‌లో భారత్ – సౌదీ అరేబియా మధ్య కుదిరిన కార్మిక సహకార ఒప్పందానికి సౌదీ ఎంతమాత్రం కట్టుబడటం లేదని ఇటీవలి ఘటనలు నిరూపిస్తున్నాయి. గత ఏప్రిల్‌లో ప్రధాని నరేంద్ర మోడీ అధికార పర్యటనపై సౌదీ సందర్శించినపుడు ఇరుదేశాల మధ్య నాలుగు ఒప్పందాలు కుదిరాయి. ప్రమాణాలతో కూడిన పని భారతీయ కార్మికులకు ఇస్తామని, నైపుణ్యం అవసరపడే, నైపుణ్యం అక్కరలేని పనులు చేసే భారతీయ కార్మికులకు సరైన పరిస్థితులు కల్పిస్తామని కార్మిక సహకార ఒప్పందం కింద సౌదీ అరేబియా అంగీకరించింది. ఆ పర్యటన సమయంలో సౌదీ అత్యున్నత పురస్కారం ‘ ది ఆర్డర్ ఆఫ్ కింగ్ అబ్దుల్ అజీజ్’తో మోడీని ఆ దేశం సత్కరించింది.
ఒప్పందం తడి ఆరకముందే..
అయితే కార్మిక సహకార ఒప్పందం కుదిరిన మూడు నెలలకే పరిస్థితులు మళ్ళీ మామూలుకు చేరుకున్నాయి. భారతీయ కార్మికులు దుర్భర పరిస్థితులలో జీవిస్తున్నట్లు సౌదీ నుంచి వస్తున్న వార్తలు తెలుపుతున్నాయి. ఒక కార్మికుడు విదేశీ వ్యవహారాల శాఖామంత్రి సుస్మాస్వరాజ్‌కు ఒక ట్వీట్‌లో భారతీయ కార్మికుల దయనీయ పరిస్థితిని వివరించాడు. జద్దాలో 800 మంది భారతీయులకు మూడు రోజులుగా తిండి లేదని ఆయన మంత్రికి ట్వీట్ చేశారు. 7 నెలలుగా ఉద్యోగులకు సౌదీ ఒగెర్ అనే కట్టడపు కంపెనీ వేతనాలు చెల్లించలేదు. అక్కడ పని చేసే 50 వేల మందిలో 4 వేల మంది భారతీయులు. ఈ వార్త పై భారత ప్రభుత్వం చర్యలు తీసుకుంది. సౌదీ అరేబియాలో ఆకలితో మాడుతున్న 10 వేల మంది
భారతీయ కార్మికులకు కాన్సులేట్ ద్వారా 16,000 కేజీల ఆహారాన్ని పంపిణీ చేశారు. వారిలో చాలా మంది ఉన్న ఉద్యోగాలు కోల్పోయారు. వారికి రావాల్సిన బకాయిలు అందలేదు. విదేశాంగ మంత్రిత్వ శాఖ సమాచారం ప్రకారం సంక్షోభ నివారణ బృందాన్ని ఆ సమస్యపై కార్మిక మంత్రిత్వ శాఖ అధికారులు నియమించారు. భారతీయ కార్మికులకు సంబంధించి అన్ని సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యతను ఆ బృందానికి అప్పగించారు. స్వదేశానికి తిరిగి వచ్చేయాలని అనుకుంటున్న వారికి తగిన ఏర్పాట్లు చేయడంతో సహా మొత్తం బాధలను ఆ బృందంపై ఉంచారు.
సౌదీ కాందిశీకులలో మన వారే ఎక్కువ
సౌదీ అరేబియాలోని కాందిశీకులలో భారతీయులు విస్తృత సంఖ్యలో ఉన్నారు. వారు సుమారు 30 లక్షల మంది. వారు 1975లో 34,500 మంది ఉండేవారు. ఆ సంఖ్య 1999లో 12 లక్షలకు పెరిగింది. 2016 నాటికి ఆ సంఖ్య 29 లక్షలు 60 వేలుకు చేరుకుంది. 2014 జనవరిలో భారత్ , సౌదీ అరేబియా ఇంటి పనికి నియామకాలు చేసేందుకు ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. అప్పటి నుంచి 2016 ఏప్రిల్ దాకా 5 లక్షల మంది భారతీయులు సౌదీ అరేబియాకి పని వెతుక్కుంటూ వెళ్లారు. స్పాన్సర్లు తీసుకునే ప్రతి ఒక్క భారతీయ కార్మికునికి లక్షా 60 వేల రూపాయలు ధరావతు సొము చెల్లించాలని ఓ నిబంధన ఆ ఒప్పందంలో ఉంది. కెఫెటీరియాలు, కట్టడపు ప్రదేశాలు, అతిథి గృహాల్లో పనులకు వారిని నియమించారు. కొంతమందిని ఇంటిపనికి ‘పని మనుషులు’ గా కూడా నియమించారు. ప్రపంచ బ్యాంకు నివేదిక ప్రకారం సౌదీ అరేబియాకు వెళ్లిన భారతీయ వలస కార్మికులు ఏటా స్వదేశానికి 50,000 కోట్ల రూపాయలు పంపుతున్నారు. ఒక్క కేరళకు పంపుతున్న మొత్తం ఆ రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో మూడో వంతు ఉంటోంది.
బలవంతపు పనికి ‘కాఫ్లా’ వ్యవస్థ
అంతర్జాతీయ క్షమా సంస్థ 2014 నివేదిక ప్రకారం సౌదీ అరేబియాలో తక్కువ జీతం లభించే ఉద్యోగాల్లో పని చేయడానికి రోజుకు వెయ్యి మంది భారతీయ వలస కార్మికులకు ప్రయాణ పత్రాలు లభిస్తున్నాయి. వలసల క్రమంలో చాలా మంది భారతీయ కార్మికులు తీవ్ర దోపిడీకి, మోసాలకు గురవుతున్నారు కూడా. ఇది సౌదీ అరేబియాలో తీవ్ర మానవ హక్కుల ఉల్లంఘన పరిస్థితికి దారితీస్తోంది. వాటిలో బలవంతంగా (కొట్టి, తిట్టి) పని చేయించడం కూడా ఉంది. సౌదీ అరేబియాలో విదేశీ కార్మికులు ప్రవేశించడానికి, విడిచి వెళ్లడానికి తమ స్పాన్సర్ల నుంచి అనుమతి పత్రాలు విధిగా తీసుకోవాలి. ‘కాఫ్లా’ పద్ధతి ప్రకారం కోర్టులలో పనికి సంబంధించిన వివాదాలు విచారణలో ఉన్న విదేశీ కార్మికులను దేశం విడిచి వెళ్లడానికి అనుమతించరు. ఇది ఐక్యరాజ్య సమితి ఆమోదించిన ‘విశ్వ మానవ హక్కుల ప్రకటన’ కు విరుద్ధం. ‘ప్రతి ఒక్కరికి తమ సదేశంతో సహా ఏ దేశాన్నయినా విడిచి వెళ్లే హక్కు ఉంది’ అన్నది ఆ ప్రకటన సారాంశం. కార్మికుల నుంచి బలవంతంగా పని తీసుకోవడానికి ఉద్దేశించినదే కాఫ్లా వ్యవస్థ అని అంతర్జాతీయ కార్మిక సంఘం (ఐఎల్‌ఒ) నిపుణుల కమిటి విమర్శించింది.
బండ చాకిరీ.. 18 గంటల దాకా పని
సౌదీ చట్టం ప్రకారం గరిష్ట పని గంటలు 8 కాగా, వలస కూలీల చేత అంతకు మించి చాలా గంటలు పని చేయిస్తున్నారని ఐఎల్‌ఒ నివేదిక తెలిపింది. కొంత మంది కార్మికులు తాము రోజుకు 15 నుంచి 18 గంటలు పని చేస్తున్నామని తెలిపారు. దీంతో వారి ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతింది. అయినా వారికి అదనపు గంటల పనికి పూర్తిగా చెల్లింపులు ఎగొట్టారు. లేదా కనాకష్టంగా చెల్లించారు. ఒక్కోసారి వలస కార్మికుల చేత వారంలో ఏడు రోజులు విరామం లేకుండా పని చేయిస్తారు.యజమానులు భారతీయ కూలీల పాస్ పోర్టులను కూడా వారిని అదుపులో ఉంచుకోవడం కోసం గుంజుకుంటారు. వారు పారిపోకుండా కూడా పాస్ పోర్టులు వారి వద్ద లేకుండా చేస్తారు.
కొత్తగా నితాకత్ చట్టం వచ్చినా..
2013 మార్చిలో సౌదీ అరేబియా నితాకత్ చట్టాన్ని ప్రవేశపెట్టింది. ఈ చట్టం కింద సరియైన పత్రాలు లేని వలస కార్మికులను నియమించే కంపెనీలు, సంస్థలపై కొరఢా ఝళిపించారు. ఆ దేశంలో నివసిస్తూ పని చేయడానికి కావలసిన చట్టబద్దమైన పత్రాలు లేని వలస కార్మికులను నిర్భందించడానికి ఈ చట్టం కింద దేశ వ్యాప్తంగా దాడులు జరిపారు. 2013 ఏప్రిల్ 6 నుంచి నవంబర్ 3 దాకా లక్షా 41 వేల మంది భారతీయ కార్మికులు సౌదీ అరేబియాను విడిచి వచ్చారని భారత ప్రభుత్వం అంచనా వేసింది. ఇదంతా నితాకత్ చట్టం ప్రభావంతో జరిగిందే. ఆ రాజ్యంలో తమ పనులను క్రమబద్దీకరించుకొని తమ హోదాను సవరించుకోవడానికి భారతీయ కార్మికులకు ఈ చట్టం మంచి అవకాశాన్ని ఇచ్చింది కూడా. అయితే ఈ చట్టంలో అక్రమ రిక్రూట్ ఏజెన్సీలు, మానవ వనరుల ఏజెంట్లను శిక్షించే నియమాలేవి లేకపోవడం పెద్ద లోటు. ఈ చట్టం ఉన్నప్పటికీ సౌదీ అరేబియాలో భారతీయుల ప్రస్తుత పరిస్థితి తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. సాధారణంగా ప్రతి విదేశీ యాత్రలో చేసినట్టుగానే సౌదీ అరేబియాలో కూడా ప్రధాని మోడీ అక్కడ భారతీయులను కలుసుకున్నారు. రియాద్‌లోని లార్సెన్ అండ్ టుబ్రోలో పనిచేస్తున్న భారతీయ కార్మికులను కూడా ఆయన వ్యక్తిగతంగా కలుసుకొని, ‘మీ చమట గంధమే ఇక్కడికి నన్ను రప్పించింది’ అంటూ శుభాక్షాంక్షలు తెలిపారు. ఇంతకీ ఆ దేశంలో భారతీయ వలస కార్మికులపై మానవ హక్కుల ఉల్లంఘన ఆరోపణలు కొత్త కాదు. వారి పరిస్థితి అక్కడ ఏమాత్రం మార్పులేకుండా అలాగే అధ్వానంగా ఉంది. కానీ, కనీస అవసరాలు లేకుండా రోజులు తరబడి శిబిరాలు భారతీయ కార్మికులు ఆకలితో మలమలమాడుతూ బతుకీడుస్తున్న వార్తలు సౌదీ నుంచి రావడం ఇదే ప్రథమం. ప్రధాని మోడీ ఇటీవలే జరిపిన పర్యటన తర్వాత కూడా ఆ దేశంలో మన వారి పరిస్థితి మారకపోవడంబట్టి మోడీ విధానాల్లో లోపాలు బయటపడుతున్నాయి. ముఖ్యంగా విదేశాల్లోని భారతీయుల సంక్షేమం విషయంలో ఆయన విధానాలు సవ్యంగా లేవని స్పష్టమవుతోంది.