Search
Saturday 17 November 2018
  • :
  • :

నెవర్ గ్రీన్‌కార్డు!

green

జీవితకాలం కన్నా లేటు 

ఎదురుచూపులో 151 ఏళ్లు

వాషింగ్టన్ : అమెరికాలో ఉద్యోగాలు చేయాల ని, పనిలో పనిగా అక్కడనే స్థిరపడాలనే భారతీయుల కలలు పగటి కలలుగానే మారుతాయా? అమెరికాలో స్థిరనివాసాన్ని ధ్రువీకరించే గ్రీన్‌కార్డుల కోసం అత్యధిక సంఖ్యలో భారతీయులు జాబితాలో ఉన్నారు. అమెరికా గ్రీన్‌కార్డు రావాలంటే అత్యున్నత స్థాయి డిగ్రీలున్న భారతీయు లు కూడా 151 ఏళ్లు ఎదురు చూడాల్సి ఉం టుంది. ఈ చేదు నిజం వాషింగ్టన్‌కు చెందిన ఒక విశ్లేషణా సంస్థ అంచనాలో వెల్లడైంది. మని షి జీవితంలో 151 ఏళ్ల ఎదురుచూపులు అసాధ్యం. దీనిని బట్టి భారతీయులు ఇక గ్రీన్‌కార్డుల ఆశలను వదులుకోవాల్సిందే అనే సూచనలు వెలువడుతున్నాయి. ట్రంప్ అధికారంలోకి వచ్చిన తరువాత వలస విధానంలో పలు కటుత ర మార్పులు చేపట్టారు. అమెరికా వారికే ప్రాధా న్యం, మిగతా వారికి తరువాతి క్రమంలో అన్ని అంశాల్లో ప్రాధాన్యతని ట్రంప్ హుకుం జారీ చేశారు. అమెరికాలో శాశ్వతంగా ఉండేందుకు, పనిచేసేందుకు గ్రీన్‌కార్డుతో సరైన అధికారందక్కుతుంది. తాజాగా వాషింగ్టన్‌కు చెందిన కాటో సంస్థ గ్రీన్‌కార్డు ఎదురుచూపుల కాలంపై అంచనాలో నివేదిక విడుదల చేసింది. గ్రీన్‌కార్డు దరఖాస్తుదారుల సంఖ్య, ఇందులో ఏ దేశం వారు ఎంత మంది ఉన్నారనే అంశాలను ఇటీవలే అమెరికా సిటిజన్‌షిప్, ఇమిగ్రేషన్ సర్వీసెస్ (యుఎస్‌సిఐఎస్) వారు వెలువరించారు. ఇందులో గ్రీన్‌కార్డుల కోసం అత్యధికంగా భారతీయులే దరఖాస్తు చేసుకున్న అంశం వెలుగులోకి వచ్చింది. వీటిని ప్రాతిపదికగా చేసుకుని కాటో సంస్థ గ్రీన్‌కార్డుల జారీపై నివేదిక ఇచ్చింది. దీనిని బట్టి గ్రీన్‌కార్డుల దరఖాస్తుదారులైన భారతీయులు వాటిని సొంతం చేసుకోవాలంటే మరో 151 ఏండ్లు వేచి చూడాల్సి ఉంటుంది.
ఈ ఏడాది ఎప్రిల్ 20 నాటి లెక్కలు: భారతదేశం నుంచి పలు అర్హతలతో అమెరికాకు వెళ్లిన వారు, వారి జీవితభాగస్వాములు, మైనరు పిల్లలు అమెరికాలో చట్టపరమైన శాశ్వత నివాసిత కార్డులు అంటే గ్రీన్‌కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ విధంగా గ్రీన్‌కార్డులకు దరఖాస్తు చేసుకున్న భారతీయుల సంఖ్య 632219 అని వెల్లడైంది. అత్యంత నిపుణులైన వారిని ఎబి 1 కేటగిరిలో చేర్చి, వారికి గ్రీన్‌కార్డులు జారీ చేయడం జరుగుతోంది. ఉద్యోగాల ప్రాతిపదికన కల్పించే ఈ ప్రతిపత్తిలోని అసాధారణ స్థాయి ఇమ్మిగ్రెంట్లు కేవలం ఆరు సంవత్సరాల్లో గ్రీన్‌కార్డులు పొందవచ్చునని కాటో తెలిపింది. ఈ కేటగిరిలో దాదాపు 35 వేల మంది దరఖాస్తుదారులు ఉన్నారు. వారికి అనుబంధంగా దాదాపు 50 వేల మంది జీవిత భాగస్వాములు, పిల్లలు ఉన్నారు. ఈ విధంగా మొత్తం మీద దాదాపు 84 వేల మంది వరకూ గ్రీన్‌కార్డుల కోసం ఈ కేటగిరిలో వేచి ఉన్నారు. బ్యాచులర్స్ డిగ్రీలు ఉన్న వారు ఇబి 3 కేటగిరిలో ఉన్నారు. వారికి గ్రీన్‌కార్డులు రావాలంటే 17 ఏళ్లు వేచి చూడాలి. ఈ కేటగిరిలో ఉద్యోగులు వారి రక్త సంబంధీకులను కలిపితే మొత్తం 1,15,273 మంది గ్రీన్‌కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నారు.
అడ్వాన్స్ డిగ్రీల వర్కర్ల ఇబి 2 కేటగిరి వారి పరిస్థితి :ఇక అడ్వాన్స్ డిగ్రీలు ఉండి వివిధ ఉద్యోగాలలో ఉన్న ఇబి 2 వర్కర్లు ప్రస్తుత వీసా జారీ ప్రక్రియలో చూస్తే గ్రీన్‌కార్డుల కోసం 151 ఏండ్లు ఎదురుచూడాల్సి ఉంటుంది. ప్రస్తుత చట్టాలు మారితే కానీ వారికి జీవితకాలంలో గ్రీన్‌కార్డులు దక్కే అవకాశం లేదు. ఇబి 2 కేటగిరిలో 216684 ప్రైమరీ ఇండియన్ దరఖాస్తుదార్లు వారికి తోడుగా వారి జీవిత భాగస్వాములు పిల్లలు కలిపితే ఏకంగా మొత్తం ఈ జాబితాలోని వారి సంఖ్య 4,33,368కు చేరింది. ఏడాదికి జారీ చేసే గ్రీన్‌కార్డులపై అమెరికా చట్టాల ప్రకారం ప్రతి దేశానికి ఏడు శాతం పరిమితి ఉంది.గ్రీన్‌కార్డులు వీరికి దక్కడం దుర్లభం అంతకు మించి అసాధ్యం అవుతుందని అంచనా వేశారు.

Comments

comments