Home స్కోర్ టీమిండియాపై ప్రశంసలే ప్రశంసలు…

టీమిండియాపై ప్రశంసలే ప్రశంసలు…

ind vs pak

 

ముంబై: ప్రపంచకప్‌లో భాగంగా చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఘన విజయం సాధించిన టీమిండియాపై దేశ వ్యాప్తంగా ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు. చిన్నాపెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ భారత జట్టు విజయాన్ని చూసి ఉప్పొంగి పోతున్నారు. ఆదివారం ఓల్డ్‌ట్రాఫర్డ్ వేదికగా దాయాది పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లి సేన చారిత్రక విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే.

ఈ మ్యాచ్‌లో భారీ విజయం సాధించిన టీమిండియాను పలువురు ప్రముఖులు ప్రశంసలతో ముంచెత్తారు. పలువురు కేంద్ర మంత్రులు, కాంగ్రెస్‌తో సహా పలు పార్టీల ప్రజా ప్రతినిధులు కోహ్లి సేనను ప్రశంసించారు. భారత్ సాధించిన విజయాన్ని చూసి దేశం మొత్తం గర్వ పడుతుందని బిజెపి అధ్యక్షుడు, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా పేర్కొన్నారు. ఇది పాకిస్థాన్‌పై మరో సర్జికల్ స్ట్రైక్ అని ఆయన కొనియాడారు. కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, పియూష్ గోయల్, నితిన్ గడ్కరి, రిజీజు తదితరులు టీమిండియా ప్రదర్శనపై ప్రశంసలు కురిపించారు.

కాంగ్రెస్ సీనియర్ నాయకులు, రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, పంజాబ్ సిఎం అమరీందర్ సింగ్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నసిస్, ఎపి సిఎం జగన్ తదితరులు కూడా టీమిండియాను అభినందించారు. ఇదే జోరును కొనసాగించి ప్రపంచకప్‌ను సాధించాలని వారు ఆకాంక్షించారు. ఇక, కాంగ్రెస్‌తో సహా పలు పార్టీలు కూడా భారత గెలుపు ప్రశంసిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెట్టాయి. పాకిస్థాన్‌పై విజయంతో దేశ ఖ్యాతిని ఇనుమడింప చేశారని క్రికెటర్లను ఆయా పార్టీలు ప్రశంసించాయి.

India’s victory over Pakistan is praised Nationwide