Home ఎడిటోరియల్ ధర్నా చౌక్ తెలంగాణ జనగళం

ధర్నా చౌక్ తెలంగాణ జనగళం

  • ప్రజల గొంతు నొక్కివేయొద్దు

Indira-Park

సుదీర్ఘ పోరాటాల ద్వారా తొలిదశ, మలిదశ ఉద్యమం లో వందల సంఖ్య యువత ప్రాణాలను త్యాగాలు చేసి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోనికి వచ్చిన టిఆర్ఎస్ ప్రభుత్వం కె. చంద్రశేఖర్‌రావు ముఖ్యమంత్రిగా చేపడుతున్న విధానాలు అన్ని వివాదస్పదమవుతున్నవి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి రాజధానిగా ఉన్న హైదరాబాద్ నడిబొడ్డుపై ఏలాంటి నిరసనలు ధర్నాలు, ప్రదర్శనలు, మీటింగులు జరుపుకోకూడదని, జరుపుకోవాలంటే నగరానికి సుదూరాన 30కి. మీ. వెలపల శివారు ప్రాంతాల్లోనే ఆందోళనలు జరుపుకోవాలని ఆదేశాలిచ్చారు.
ఉమ్మడి రాష్ట్రంలో, అసెంబ్లీ పబ్లిక్ గార్డెన్ సమీపంలోనే మీటింగులు, ధర్నాలు జరుపుకునేది. 1969లో తెలంగాణ ఉద్యమాన్ని పురస్కరించుకొని అసెంబ్లీ ప్రాంత సమీప ఏరియాలో నిషేధం పెట్టారు. 1969 నుండి 1995 వరకు సెక్రటేరియట్ ముందు ఉమ్మడి రాష్ట్రంలో ధర్నాలు, ప్రదర్శనలు నిర్వహించుకునేవారు వివిధ రాజకీయ పార్టీలు, కార్మిక, కర్షక, ప్రజా సంఘాలు, సచివాలయం వద్ద తెలుగు తల్లి విగ్రహం సమీపంలో ఉన్న స్థలాన్ని వాడుకొనేవారు.
అటు తర్వాత 1995 నుండి ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్న కాలంలో సెక్రటేరియట్ వద్ద నిరసనలు నిషేధించి ప్రస్తుతమున్న ఎన్‌టిఆర్ గ్రౌండ్‌లో నిర్వహించుకోడానికి అనుమతులు ఇస్తూండేది. అటు తర్వాత ఎన్‌టిఆర్ గ్రౌండ్‌ను ప్లే గ్రౌండ్‌గా తయారు చేసి క్రీడలకు కేటాయించిన సందర్భంలో 2005 నుండి ఇందిరా పార్కు రోడ్డును విశాలంగా చేసి ఆ రోడ్డుపైన నిరసనలకు మీటుంగు లకు అనుమతిలిస్తున్నారు. కాలక్రమేణా ఇందిరా పార్కు “ధర్నా చౌక్‌”గా మారింది.
తెలంగాణ ఉద్యమంలో ఈ ధర్నా చౌక్ నుండే అనేక ఉద్యమాలు సకల జనుల సమ్మె సందర్భంలో, టాంకుబండ్ ముట్టడికి, సాగర హారం, వంటవార్పు, ధూంధాం కార్యక్రమాలు ప్రతిరోజు నిర్వహించడం, కొన్ని సందర్భాలలో రాత్రింబవళ్ళు కార్యక్రమాలు నిర్వహించుకున్నా ఈ ధర్నా చౌక్ నుండే ప్రస్తుతం రాష్ట్ర క్యాబినెట్‌లో ఉన్న తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న మంత్రులు, శాసన సభ్యులందరు వివిధ ప్రజా సంఘాలు నిర్వహించిన కార్యక్రమాలలో, నిరసన ఉద్యమాలలో పాల్గొన్న వారే. తెలంగాణ రాష్ట్ర సాధనలో ఇందిరాపార్కు ధర్నాచౌక్‌కు ప్రత్యేక ప్రాధాన్యత ఉన్నదని చెప్పాలి.
ఆందోళనకు వేదికై అనేక సమస్యలపై పాలకుల కండ్లు తెరిపించడానికి కారణ భూతమైన ధర్నా చౌక్‌లో ఆందోళనకు అనుమతులు ఇవ్వకుండా, నగర శివారులో దాదాపు 30,40 కి.మీ. దూరములో ప్రభుత్వం ఎంపిక చేసిన ప్రాంతాల్లోనే ఆందోళనలు నిర్వహించుకోవాలని హైదరాబాద్ పోలీసు కమీషనరేట్ పరిధిలోని శంషాబాద్, దుండిగల్ సమీపంలోని పోచంపల్లి గ్రామం, రాచకొండ కమీషనరేట్ పరిధికి చెందిన కాప్రా మండలంలోని జవహర్‌నగర్, ఘట్ కేసర్ మండలంలో ప్రతాప సింగారం గ్రామాల్లో ధర్నా చౌక్‌లను గుర్తించినట్లు, ఒక్కొక్క ధర్నా చౌక్‌కోసం ఐదు నుంచి ఏడు ఎకరాలు భూమి పోలీసు అధికారులు గుర్తించి ఎంపికచేసినట్లు సమాచారం.
గత నెలలో రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలంటూ టిజెఎసి ర్యాలీకి అనుమతి ఇవ్వాలని కోరినారు. దీనిని అన్ని విద్యార్థి, యువజన, వామ పక్షాలు బలపర్చినవి. ర్యాలీ పర్మిషన్ కొరకు హైకోర్టు ను ఆశ్రయించినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం నిరంకుశం గా పోలీసులను ఉపయోగించి రాత్రికిరాత్రే ఎక్కడి కక్కడ రాష్ట్రంలో వివిధ ప్రాంతాలలో అరెస్టులు, నిర్భంధాలు సాగించిన సంగతి తెల్సిందే.
సిపియం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పాదయాత్ర ముగింపు సందర్భంగా, మార్చి 19న భారీ బహిరంగసభ నిజాం కాలేజీ గ్రౌండ్‌లో జరుపు కోవడానికి అనుమతి ఇచ్చి రాష్ట్ర అసెంబ్లీ సమా వేశాలు జరుగుతున్న నేపథ్యంలో ఇచ్చిన పర్మిషన్‌ను రద్దు చేసినారు. ప్రత్యామ్నాయంగా వేరే ప్రదేశం ఎంచుకొన్నారు.
ఇందిరాపార్కు వద్ద ధర్నాలు, ఆందోళనలు కారణంగా విపరీతమైన ట్రాఫిక్ జావ్‌ు ఏర్పడు తుందని, సౌండ్ బాక్సులు కారణంగా శబ్దకాలుష్యం కలుగుతుందని ఈ ప్రాంతంలో ధర్నాలకు అనుమ తించరాదని ఒక ప్రజా ప్రయోజన వాజ్యం హైకోర్టులో విచారణలో ఉంది.
ఈ నేపథ్యంలోనే ఇందిరాపార్కు వద్ద నుంచి ధర్నా చౌక్‌ను పూర్తిగా ఎత్తివేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకొన్నట్లు దానికి అనుగుణంగానే ముఖ్యమంత్రి పోలీసులకు ఆదేశాలిచ్చినట్లు తెలుస్తున్నది.
రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల సందర్భంగా కార్మిక, ఉద్యోగ సంఘాలు ధర్నాలకు అనుమతి కొరకు ధరఖాస్తులు పెట్టుకొన్న నేపథ్యంలో అనుమతులు ఇవ్వకుండా డిసిపి సెంట్రల్ జోన్ నిరాకరించినారు. ధర్నా చౌక్ ఎత్తివేయడం అప్రజాస్వామ్యం. ఇందిరా పార్కు ధర్నా చౌక్‌ను ఎత్తివేయడాన్ని రాష్ట్రంలో అన్ని ప్రతిపక్ష, వామపక్ష పార్టీలు, రాష్ట్రంలో కేంద్ర, రాష్ట్ర కార్మిక ఉద్యోగ సంఘాల ముక్తకంఠంతో ఖండిస్తు న్నాయి. దేశరాజధాని ఢిల్లీలో పార్లమెంటుకు అతి సమీపములోనున్న జంతర్ మంతర్ వద్ద నిరసనలు, ధర్నాలు జరుపుకొనుటకు అనుమతులు ఇస్తుండుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న అప్రజా స్వామిక వైఖరిని, రాజ్యాంగ బద్ధంగా, మానవ హక్కులను హరించే చర్యలను తీవ్రంగా ఖండిస్తు న్నాయి. ధర్నా చౌక్‌ను ఎత్తివేయటానికి నిరసనగా అన్ని ప్రజాస్వామిక, లౌకిక శక్తులతో కలిసి ఉద్యోగ, కార్మిక, ప్రజా సంఘాలు, సామాజిక సంస్థలు, రాజకీయ పార్టీలు, మేధావులు ముక్తకంఠంతో టీర్‌ఎస్ ప్రభుత్వ నిరంకుశ చర్యలను ఖండిస్తూ యాధావిధిగా ధర్నా చౌక్‌లో అనుమతులు ఇవ్వాలని కోరు తున్నాయి.