Home తాజా వార్తలు పారిశ్రామిక ప్రగతి శిఖరం

పారిశ్రామిక ప్రగతి శిఖరం

Industrial progress peak

2017-18లో రాష్ట్ర పారిశ్రామిక వృద్ధి 10.4%
జాతీయ సగటు రేటు 6.6 శాతమే
గనుల శాఖ ఆదాయం గణనీయంగా పెరుగుదల
దండు మల్కాపూర్ పార్క్‌కు త్వరలో సిఎం శంకుస్థాపన
చేనేతకు చేతినిండా పని
వార్షిక నివేదిక విడుదల చేసిన మంత్రి కెటిఆర్

మన తెలంగాణ / హైదరాబాద్ : 2017-18 ఏడాదిలో తెలంగాణ పారిశ్రామిక వృద్ధిరేటు 10.4 శాతం నమోదైంది. జాతీయ సగటు వృద్ధి కేవలం 6.6 శాతంగానే ఉందని, తెలంగాణ మాత్రం నాలుగు శాతం అధికం సాధించిందని పరిశ్రమల శాఖమంత్రి కెటి. రామారావు వ్యాఖ్యానించారు. తెలంగాణ పారిశ్రామిక రంగ వార్షిక నివేదికను నగరంలో సోమవారం విడుదల చేసిన సందర్భంగా పారిశ్రామిక సంఘాలు, సంస్థల ప్రతినిధులనుద్దేశించి కెటిఆర్ మాట్లాడారు. తాను నిర్వహిస్తున్న శాఖల ఏడాది నివేదికలను సమర్పించాలని తనకు తానుగా నిర్దేశించుకున్నానన్నారు. ఎవరూ కోరనప్పటికీ ఆయా శాఖల పనితీరును ప్రజల ముందు ఉంచుతున్నట్లు తెలిపారు. 2015 జూన్‌లో నూతన పారిశ్రామిక విధానం టిఎస్ ఐపాస్‌ను రూపొందించింది మొదలు ఇప్పటివరకు రూ. 1.23 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, సుమారు 5.27 లక్షల మందికి ప్రత్యక్షంగాను, పరోక్షంగానూ ఉపాధి కలుగుతోందని తెలిపారు. టిఎస్ ఐపాస్ ద్వారా అనుమతులు పొందిన కంపెనీల్లో 50% పైగా కంపెనీలు ఇప్పటికే ఉత్పత్తిని ప్రారంభించాయని, త్వరలో మిగతావి కూడా ప్రారంభిస్తాయన్నారు.

గనుల శాఖ ద్వారా గణనీయ ఆదాయం :
ఖనిజాభివృద్ధి శాఖ ద్వారా కూడా తెలంగాణకు గణనీయమైన ఆదాయం సమకూరిందని, 2017 18 ఆర్థిక సంవత్సరంలో గనుల శాఖ ద్వారా రూ.3,700 కోట్ల ఆదాయం వచ్చిందన్నారు. ఇసుక అమ్మకాల ద్వారా 2014-18 మధ్య కాలంలో నాలుగేళ్లలో సుమారుగా రూ.1600 కోట్లు ఆదాయం లభించిందని, ఏటా సగటున రూ. 400 కోట్ల ఆదాయం సమకూరిందన్నారు. సమైక్యరాష్ట్రంలో (20042014) గడచిన పదేళ్లలో ఇసుక అమ్మకాల ద్వారా రూ. 39.4 కోట్ల ఆదాయం మాత్రమే వచ్చిందన్నారు. ‘పదేళ్ళలో అంత భారీ మొత్తంలో ఇసుక ఆదాయం ఎక్కడికి పోయింది? ఎవరు ఈ ఆదాయాన్ని కొట్టేశారు?’ అని కెటిఆర్ ప్రశ్నించారు.

దండుమల్కాపూర్ పార్కుకు త్వరలో ముఖ్యమంత్రి శంకుస్థాపన
యాదాత్రి జిల్లా చౌటుప్పల్ సమీపంలోని దండుమల్కాపూర్ ఎంఎస్‌ఎంఇ గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కుకు త్వరలోనే సిఎం కెసిఆర్ శంకుస్థాపన చేస్తారని కెటిఆర్ తెలిపారు. ఖమ్మం జిల్లా బుగ్గుపాడులో మెగా ఫుడ్ పార్కు, హైదరాబాద్ ఫార్మాసిటీ, కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కు, సుల్తాన్‌పూర్ మెడికల్ డివైజెస్ పార్కులను కూడా ప్రాధాన్యతా క్రమంలో పూర్తి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. ఈ ఏడాదిలో దండుమల్కాపూర్ గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కు, బండమైలారం సీడ్ పార్కు, సంగారెడ్డి ఎల్‌ఈడి పార్కు, సిద్డిపేట ఫుడ్ ప్రాసెసింగ్ పార్కు, నిజామాబాద్‌లో స్సైస్ పార్కు, జహీరాబాద్‌లో నిమ్జ్ పనులు ప్రారంభిస్తామని తెలిపారు. కాలుష్య కారక పరిశ్రమల తరలింపు ప్రక్రియను అధికారులు ప్రారంభించారని, ఆయా సంస్థలతో సంప్రదింపులు జరుపుతున్నారన్నారు.

చేనేతకు చేతినిండా పని: ప్రతి చేనేత కార్మికుడికి చేతి నిండా పని కల్పించాలన్నది ముఖ్యమంత్రి కెసిఆర్ విజన్ అని, దానికి అనుగుణంగానే కార్యాచరణ సాగుతోందన్నారు. వరంగల్‌లో కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కు, సిరిసిల్లలో అపారెల్ పార్కు, గద్వాలలో హ్యాండ్లూమ్ పార్కును ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇవే కాకుండా కేంద్ర ప్రభుత్వ సహకారంతో చేనేత కార్మికుల 50 శాతం సబ్సిడీపై యార్న్, నూలు ఇస్తున్నామన్నారు. అలాగే 14 చేనేత క్లస్టర్‌లను ఏర్పాటు చేసి వారికి పని కల్పించామన్నారు.
ఏరోస్పేస్ , డిఫెన్స్ రంగాల వృద్ధి ః తెలంగాణను రక్షణ, వైమానిక రంగాల్లోనూ అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్తున్నామన్నారు. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా 20 మిలియన్ ప్రయాణీకుల మార్క్‌ను సాధించేందుకు టెర్మినల్‌ను కూడా విస్తరించనున్నట్లు తెలిపారు. ద్వితీయ శ్రేణి పట్టణాలకూ వైమానిక సేవలను అందించేంధుకు కొత్తగూడెం, ఆదిలాబాద్, వరంగల్ జిల్లా మామునూర్ ప్రాంతాల్లో చిన్న విమానాశ్రయాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. అపాచీ హెలీకాప్టర్ లాంటివి తెలంగాణలోనే తయారు అవుతున్నాయని, టాటా అడ్వాన్స్ సిస్టమ్ బోయింగ్ సంస్థలు హైదరాబాద్‌లో తమ ఆర్ట్ ఆఫ్ ఫెసిలిటీ కేంద్రాలను ఏర్పాటు చేసుకున్నాయన్నారు.

ఈ సందర్భంగా పలు సంస్థలతో ఎంఓయూ
నేషనల్ ప్రొడక్టివిటి కౌన్సిల్, క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, బాలానగర్ సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్ సంస్థలతో పరిశ్రమల శాఖ ఎంఓయూ కుదుర్చుకుంది. స్థానిక మ్యానిఫ్యాక్చరింగ్ సంస్థలకు నైపుణ్య శిక్షణ, మానిఫ్యాక్టరింగ్ ప్రాక్టీసెస్, స్మార్ట్ మ్యానిఫ్యాక్చరింగ్, ఇండస్ట్రి 4.0, జడ్‌ఈడి స్కీమ్‌పై ఆయా సంస్థలకు అవగాహన కల్పించనున్నాయి. 2014 నుండి కంపెనీలకు రావాల్సిన రాయితీలు సుమారు 14 వందల కోట్ల రూపాయలు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. పారిశ్రామిక వార్షిక నివేదిక విడుదల సందర్భంగా పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, ఖనిజాభివృద్ధి శాఖ ఎండి మల్సూర్, టిఎస్‌ఐఐసి ఎండి వెంకట నర్సింహారెడ్డి, అధికారులు కూడా ఉన్నారు.