Home ఎడిటోరియల్ టోకు ధరల సూచికి విరుద్ధంగా రిటైల్ సూచీ

టోకు ధరల సూచికి విరుద్ధంగా రిటైల్ సూచీ

index1టోకు ధరల సూచీ (డబ్లుపిఐ) తగ్గుదల సామాన్య మానవునికి, దేశంలోని 10 కోట్ల మంది పారిశ్రామిక, సర్వీసు రంగాల కార్మికులకు ఏమంత ఆసక్తికర అంశం కాదు. ఎందుకంటే, నిరంత రాయంగా పెరుగుతున్న రిటైల్ ధరలతో నిత్యావస రాలు తీర్చుకోవటం వారికి ఎప్పటివలె కష్టంగానే ఉంది. ఇప్పటికే హెచ్చుగా ఉన్న, ఇంకా పెరుగు తున్న ఆహార ధరలు తీవ్రమైన ఆందోళన కలిగిస్తున్నాయి. సామాన్య ప్రజలకు వాస్తవంగా సంబంధించినటువంటి వినియోగదారు ధరల సూచీ-పారిశ్రామిక కార్మికులకు (సిపిఐ-ఐడబ్లు) -ని ఎన్నడూ అట్టహాసంగా విడుదల చేయరు. చుక్కలవైపు ప్రయాణిస్తున్న రిటైల్ ఆహార ధరలకు తోడు, వాటితో పోటీపడినట్లు పెరుగుతున్న మందు లు, వైద్యఖర్చులు, విద్యపై అధికవ్యయం కార్మికుల పై, పేదలపై నిలకడగా అదనపు భారం మోపు తున్నాయి. డబ్లుపిఐ తగ్గుదలకు ప్రధాన కారణ మైన పెట్రోలు, డీజిలు ధరలు సామాన్య మానవుని జేబుపై ప్రభావం చూపటం లేదు. పెట్రో ఉత్పత్తుల ధరలు తగ్గుదల ఆటోమొబైల్ పరిశ్రమకు, ఆటో మొబైల్ ఆపరేటర్లకు, కారు ఓనర్లకు, ప్రభుత్వానికి, ప్రధానంగా దిగుమతికి క్రూడ్ ఉపయోగి స్తున్న పెట్రోలియం ప్రాసెసర్లకు శుభవార్తే గాని సామాన్యు లకు కాదు. ఎందుకంటే వారిపై ప్రయాణ ఛార్జీల భారం ఏ మాత్రం తగ్గలేదు.
గతవారం డబ్లుపిఐ సూచీ విడుదల, డిసెంబర్ లో – వరుసగా 14వ మాసం ధర తగ్గుదలపై కేంద్రీకరించింది. దీన్ని ఇటీవల యాదిలో ధరలు తగ్గిన దీర్ఘకాలంగా అధికారిక పత్రికా ప్రకటన అభివర్ణించింది. 1975-76లో పూర్తి సంవత్సరం పాటు డబ్లుపిఐ తగ్గిన రికార్డును ఇది మించి పోయిందని పేర్కొన్నది. ప్రస్తుత డబ్లుపిఐ చివరిసారి 2014 అక్టోబర్‌లో 1.66శాతం పెరుగు దలను నమోదు చేసింది. డబ్లుపిఐ ధోరణి వినియోగ దారు ధరల సూచీపై ప్రతిబింబించాలని సామాన్య మానవుడు కోరుకుంటాడు. గతంలో, సంవత్సరకాలంలో డబ్లుపిఐ వృద్ధి అదే కాలంలోని సిపిఐ సంఖ్యల కన్నా వేగంగా ఉండేది. అయితే నిజం చెప్పాలంటే, సామాన్యమానవుని జీవితంపై ధరల ప్రభావం నిర్ణయించటానికి డబ్లుపిఐ ఉల్బణం సరైన సూచీ కానేకాదు. అందుకు బదులు గా, పారిశ్రామిక కార్మికులకు వినియోగ దారు ధరల సూచీ (అందులో కొన్ని సేవలు కూడా ఉంటా యి) రిటైల్ ధరల ప్రాతిపదికగా రూపొందిం చబడుతుంది. ప్రభుత్వ, ప్రైవేటు రంగాలు రెండింటి లో ఉద్యోగులకు కరవు భత్యం నిర్ణయించటానికి ఈ సూచీ ఉపయోగిస్తారు. సాధారణ ద్రవ్యోల్బణానికి కూడా ఇదే అనువైన సూచీ. సిపిఐ-ఐడబ్లులో ఆహార పదార్థాలు ఎక్కువ వెయిటేజి కలిగి ఉంటా యి. పారిశ్రామిక కార్మిక యూనియన్‌లకు, రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ఈ విషయం బాగా తెలు సు.
డబ్లుపిఐ గతనెలలో 0.7శాతం తగ్గింది. టోకు వాణిజ్యంలో ఆహార ద్రవ్యోల్బణం గత 17 మాసాల్లో కెల్లా హెచ్చుగా 8.17శాతం పెరగకుండా ఉన్నట్ల యితే అది మరింత తగ్గిఉండేది. ద్రవ్యోల్బ ణాన్ని, ప్రజల వద్ద ధనాన్ని నియంత్రించే ఆర్‌బిఐ ఆందోళన చెందుతున్నది. ఆర్‌బిఐలోని వారితో సహా ఉన్నతస్థాయి ఆర్థికవేత్తలు – పరిశ్రమకు, వ్యాపారు లకు లబ్దిచేకూర్చే విధంగా వడ్డీరేటును మరింత తగ్గించరాదని అభిప్రాయపడుతున్నారు. అయినా, గత నాలుగు పర్యాయాలు రేట్ల కోత దేశంలో పారిశ్రామిక పెట్టుబడిని, ముఖ్యంగా ప్రైవేటు రంగంలో పెంచటంలో విఫలమైంది. డబ్లుపిఐ నిలకడగా తగ్గుతుండటం మన రూపాయి కరెన్సీ విలువను స్థిరంగా ఉంచటానికి సహాయపడలేదు. అంతర్జాతీయ వాణిజ్యవ్యత్యాసం భారత్‌కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున కొనసాగుతున్నది. రూపాయి విలువ తగ్గుదలవల్ల దిగుమతులు ప్రియం అవుతున్నాయి, ఎగుమతులు చౌక అవుతున్నాయి. సామాన్య మానవుడు, కార్మికుడు అది ఏ విధంగా జరిగినా బాధపడుతూనే ఉన్నాడు. దిగుమతి వ్యయం వినియోగదారులపైకి వస్తున్నది. చౌక ఎగుమతులు, ఎగుమతిదారులకు మంచి కావచ్చు, అయితే అదే వేతనాలకు ఎక్కువ ఉత్పత్తి చేయాల్సిందిగా కార్మికులపై ఒత్తిడి పెరుగుతున్నది.
సిపిఐ ద్రవ్యోల్బణం 2015 నవంబర్‌లోని 5.41శాతం నుండి డిసెంబర్‌లో 5.61 శాతానికి పెరిగింది. రిటైల్ ఆహార ద్రవ్యోల్బణమే 6.4 శాతం పెరిగింది. అయితే రిటైల్ మార్కెట్ రేట్లు టోకు ధరల వలె గాక ఒక నగరంలో, ఒక జిల్లాలో ప్రాంతానికి ప్రాంతానికీ తేడా ఉంటాయి. అధికారిక గణాంకాలు కూడా అనుమానా స్పదమే. అధిక రిటైల్ ద్రవ్యోల్బణం సామాన్య మానవుని ఆదాయాన్ని హరిస్తుంటే, అందులో ఒక చిన్న శాతానికే యజమానులనుంచి డిఎ లభిస్తుంది. అందువల్ల రిటైల్ ద్రవ్యోల్బణం భారాన్ని డిఎ పూర్తిగా పరిహరించదు. చిత్రమే మంటే, రిటైల్ ధరలు నిరంతరం పెరుగుతున్న ప్పటికీ, మరో తరగతి వినియోగదారుల- అనగా మధ్యతరగతి, ఉన్నత మధ్యతరగతి – పెరుగుతున్న ఆదాయంపై స్వారీ చేస్తూ రిటైల్ రంగం నిరంతరాయంగా వృద్ధిచెందుతున్నది. శీఘ్రగతిన పెరుగుతున్న పట్టణీ కరణ, చిన్నకుటుంబాల పెరుగుదలవల్ల ఉన్నత, మధ్యతరగతి సంఖ్య పెరుగుతున్నది. భారతదేశ రిటైల్ రంగం 2015 లోని 630 బిలియన్ డాలర్ల నుంచి 2020 నాటికి 1.2 ట్రిలియన్ డాలర్లకు పెరుగు తుందని పారిశ్రామిక వేత్తల సంస్థ సిఐఐ, బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూపు ఇటీవల అంచనా వేశాయి.
భారతదేశ జిడిపి వృద్ధి, అభివృద్ధి తన ప్రజల జీవన నాణ్యతను ఏమంత మెరుగుపరచకపోవటం ప్రధానమైన ఆందోళనకర అంశం. ద్రవ్యోల్బణం కీలక అంశంగా కొనసాగుతున్నది. యుఎన్‌డిపి తాజా నివేదిక ప్రకారం మానవ అభివృద్ధి సూచీ (హెచ్‌డిఐ)లో మనదేశం ఒక మెట్టు మాత్రమే ఎక్కి 188 దేశాల్లో 130 వస్థానంలో ఉంది. ఆయుః ప్రమాణం, తలసరి ఆదాయం వృద్ధివల్ల ఆ స్థానా నికి చేరింది. 2014కు సంబంధించిన ఈ సూచీ ప్రకారం, అంతకు క్రితం సంవత్సరం కన్నా 1 ర్యాంకు పెరిగింది. 2009-2014 కాలంలో భారత దేశ ర్యాంక్ ఆరు స్థానాలు పెరిగింది. బంగ్లాదేశ్, పాకిస్థాన్ ర్యాంక్ వరుసగా 142; 147. బ్రిక్స్ దేశాల్లో భారత్ స్థానమే అథమంగా ఉంది. దీనిపై నీతి ఆయోగ్ వెలుగు ప్రసాదించవచ్చు.