Search
Wednesday 26 September 2018
  • :
  • :
Latest News

రిటైల్ ద్రవ్యోల్బణం కూల్

Inflation cools to 10-month low of 3.69% in August

10 నెలల కనిష్టానికి సూచీ
ఆగస్టులో 3.69 శాతం నమోదు
6.6 శాతానికి పారిశ్రామిక ఉత్పత్తి వృద్ధి
కేంద్ర గణాంకాల శాఖ వెల్లడి

న్యూఢిల్లీ: ఆహార పదార్ధాల ధరలు చౌక కావడంతో ఆగస్టు నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం 10 నెలల కనిష్టానికి చేరుకుంది. ఆగస్టులో వినిమయ ధరల సూచీ(సిపిఐ) ఆధారిత ద్రవ్యోల్బణం 3.69 శాతానికి తగ్గింది. అదే సమయంలో పారిశ్రామిక ఉత్పత్తి 6.6 శాతం నమోదైంది. బుధవారం కేంద్ర గణాంకాల శాఖ(సిఎస్‌ఒ) ఈ వివరాలను విడుదల చేసింది. ద్రవ్యోల్బణం విషయంలో శుభవార్త.. రూపాయి పతనం, పెట్రోలు, డీజిల్ ధరల పెరుగుదలతో పారిశ్రామిక ఉత్పత్తి కూడా మెరుగ్గా ఉంది. ఆగస్టులో సిపిఐ ఆధారిత ద్రవ్యోల్బణం 3.69 శాతానికి క్షీణించింది. పండ్లు, కూరగాయలు, ఇతర ఆహార పదార్థాల ధరలు చౌక కావడంతో ఈసారి రిటైల్ ద్రవ్యోల్బణం దిగివచ్చిందని సిఎస్‌ఒ పేర్కొంది. జూలైలో రిటైల్ ద్రవ్యోల్బణం 4.17 శాతంగా ఉంది. అలాగే గతేడాదిలో 3.28 శాతంగా ఉందని సిఎస్‌ఒ తెలిపింది.

2017 అక్టోబర్‌లో సిపిఒ ద్రవ్యోల్బణం అత్యంత కనిష్టం 3.58 శాతంగా నమోదైంది. అయితే ఆర్‌బిఐ(భారతీయ రిజర్వు బ్యాంక్) లక్షం 4 శాతానికి లోపే ద్రవ్యోల్బణం నమోదైంది. రూపాయి క్షీణతపై ఆర్‌బిఐ చర్యలు చేపట్టేందుకు సిద్ధమవుతోంది. ప్రస్తుత గణాంకాల ఆధారంగా అక్టోబర్ 5న నిర్వహించనున్న ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్షలో వడ్డీ రేట్లపై ఆర్‌బిఐ నిర్ణయం తీసుకోనుంది. కేంద్ర గణాంకాల శాఖ ప్రకారం, ఆహార పదార్థాల ధరలు 2018 ఆగస్టులో 0.29 శాతంగా ఉండగా, అంతకుముందు నెల అయిన జూలైలో 1.37 శాతంగా ఉంది. కూరగాయల ధరలు 7 శాతం తగ్గుముఖం పట్టాయి. పండ్ల విషయానికొస్తే ధరలు జూలైలో 7 శాతంతో పోలిస్తే ఆగస్టులో 3.57 శాతంతో తగ్గాయి. ఇంధన ద్రవ్యోల్బణం 8 శాతం నుంచి 8.47 శాతంతో స్వల్పంగా పెరిగింది. ఈ గణాంకాలపై కేంద్ర ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి సుభాష్ చంద్ర గార్గ్ స్పందిస్తూ, ధరలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయని, ఆర్థిక వృద్ధి కొనసాగుతోందని అన్నారు.

పారిశ్రామిక ఉత్పత్తి 6.6 శాతం
తయారీ రంగం, ఉత్పాదక వస్తువులు, కన్జూమర్ డ్యూరబుల్స్‌లో వృద్ధితో జూలై లో పారిశ్రామిక ఉత్పత్తి సూచీ(ఐఐపి) 6.6 శాతం నమోదైంది. 2017 జూలైలో కేవలం 1 శాతమే ఉంది. ఇంతకుముందు జూన్ నెలలో ఐఐపి 6.8 శాతంగా ఉంది. కన్జూమర్ డ్యూరబుల్స్‌లో వృద్ధి2.4 శాతం నుంచి ఒక్కసారిగా 14.4 శాతానికి పెరిగింది. ఉత్పాదక వస్తువుల ఉత్పత్తి జూలైలో 3 సాతం నమోదవగా, అంతకుముందు నెలలో 1.1 శాతంగానే ఉంది.

Comments

comments