Home ఎడిటోరియల్ వృద్ధికి ఊతం చౌక పెట్రోలు

వృద్ధికి ఊతం చౌక పెట్రోలు

petrol-image

ఇంధనం కొరతయినది మాత్రమే కాదు, ఖరీదైనది కూడా. ధర పెరిగే కొలది ఆయిలు కంపెనీల లాభాలు పెరుగుతాయి. వినియోగదారులను పిండటానికై ఇంధనంపై పన్నులు పెంచటం అభివృద్ధి వ్యతిరేకమైనది. ద్రవ్యోల్బణాన్ని పెంచుతుంది, వృద్ధిని నిరోధిస్తుంది. ఇది కఠిన సత్యం. బ్యారల్ 150 లీటర్లు 80 డాలర్లున్నా దాని కొనుగోలు ధర లీటరు రూ. 35 లోపే. భారత బాస్కెట్ రేటు అంతకన్నా తక్కువ ఉంది. కాబట్టి అది బాధిస్తున్నదనే ప్రచారం అతిశయోక్తి. అంతర్జాతీయ ధరలను అదుపు చేయటం సాధ్యం కాదు. ఆయిలు లాబీ వాటిని తారుమారు చేస్తుంటుంది. లోగడ ధరలను నియంత్రిస్తుండిన అమెరికా ఇప్పుడు ధరల లాబీలో ఒకటి అయింది. షేల్ ఆయిల్ వెలికితీతతో అది కూడా ఆయిలు ఆర్థిక వ్యవస్థగా మారింది. ఆ ఆయిలు ఇప్పుడు ఉత్పత్తి సమస్యలు ఎదుర్కొంటున్నది.

ఇరాన్ అణుశక్తి ప్రాజెక్టులను అదుపు చేసే సాకుతో అమెరికా దానిపై ఆంక్షలు విధిస్తూ ఆసియా ఆర్థిక వ్యవస్థలపై గురిపెట్టింది. బరాక్ ఒబామా ప్రభుత్వం సైతం అంతర్జాతీయ ధరలు పెంచే నిమిత్తం ఇరాన్ ఆయిలు ఉపయోగించుకోకుండా భారత్‌ను నిరోధించింది. అంతర్జాతీయ ఆయిలు మార్కెట్‌పై అమెరికన్ కంపెనీల ఆధిపత్యం గుర్తు చేసుకోదగింది. ఇరాన్ ఆయిల్ తక్కువ సల్ఫర్ శాతంతో ఉత్తమమైంది. భారత్ రూపాయల్లో చెల్లింపులతో, వస్తు మార్పిడి ఏర్పాటుతో, ముఖ్యంగా ప్రభుత్వ రంగ హిందూస్థాన్ పెట్రోలియం ద్వారా లావాదేవీలు సాగిస్తూ విదేశీ మారక ద్రవ్యం పొదుపు చేయగలుగుతోంది. ఇతర మేళ్లు పొందుతున్నది. ఇరాన్‌పై ఆంక్షలవల్ల డాలర్లు చెల్లించి భారత్ ఆయిలు దిగుమతి చేసుకోవలసివస్తే రూపాయి మరింత బలహీనపడుతుంది. అది దాని అభివృద్ధి లక్షాలను దెబ్బతీస్తుంది.

రష్యాతో తన సంబంధాలను భారత్ మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఉంది. డోనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం రష్యాపై కూడా ఆంక్షలు విధిస్తున్నది. రష్యన్ అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్‌తో సంబంధాల పునరుద్ధరణకై ప్రధాని మోడీ ఇటీవల సోచీ సందర్శించారు. ట్రంప్ ఆంక్షల విషయంలో యూరోపియన్ యూనియన్ కూడా చీలిపోయింది. జర్మన్ ఛాన్సలర్ అంగెలా మెర్కెల్ ఇరాన్ ఆంక్షల గూర్చి ఇటీవల పుతిన్‌తో చర్చించినపుడు ఈ విషయం వెల్లడించారు. అంతర్జాతీయ పరిస్థితి మారటానికి సమయం పడుతుంది. ఈలోపు, ఇంధనాన్ని అందుబాటు ధరలోకి తేవటానికి భారత ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వ ఖజానా భర్తీ చేయటానికి, వినిమయాన్ని అదుపు చేయటానికీ దానిపై పన్నులు విధించాలని “ప్రవీణులు” సూచించిన పరిష్కారానికి కాలం చెల్లింది. దానివల్ల వినిమయం తగ్గలేదు. ప్రభుత్వ ఆదాయం పెరుగుదలకు సహాయపడలేదు. ప్రభుత్వం తన పన్నుల విధానానికి తానే బాధితురాలవుతోంది. ఆయిలుపై అధికంగా ఖర్చు చేస్తున్నది, పన్ను చెల్లిస్తున్నది ప్రభుత్వమే.

ద్రవ్యోల్బణం పెరుగుదలకు తప్ప ఈ విధానం ఎవరికీ సహాయకారిగా లేదు. అంతేగాక ప్రభుత్వానికి సరైన సలహాలు అందుతున్నట్లు లేదు. ఆయిలుపై అధిక పన్నుల నుంచి తమ ఆదాయం పెంచుకోవచ్చని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా భావిస్తున్నాయి. డీజిలు ధరను పెట్రోలుకు సమానంగా పెంపు చేయాలని ఎవరో అవివేకమైన సలహా ఇచ్చారు. అది తప్పుడు వాదన. పెట్రోలు, డీజిలు ధరలు వాటి శుద్ధి (రిఫైనింగ్) కయ్యే వ్యయాన్ని బట్టి నిర్ణయించబడతాయి. డీజిల్ శుద్ధికి ఖర్చు తక్కువ అందువల్ల దాని ధర తక్కువే పెట్రోలు ధరలో దాదాపు సగం ఉండాలి. అయితే ఆయిలు కంపెనీలు తప్పుదారి పట్టిస్తున్నాయి. డీజిల్‌లో కాలుష్య కారకాలు ఎక్కువ కాబట్టి దాని ధర, పన్ను ఎక్కువ ఉండాలని కోరే పర్యావరణ లాబీలను ఉపయోగించుకుంటున్నాయి. ఇది వాటి లాభాలు పెంచుతుంది. కాని రవాణా, వ్యవసాయోత్పత్తి, ఇతర ప్రజల కార్యకలాపాలు వ్యయ భరితం అవుతాయి. పర్యావరణ లాబీల అసలు ఉద్దేశాన్ని దర్యాప్తు చేయాలి. అటువంటి జిత్తుల ద్వారా భారత దేశాన్ని అభివృద్ధి చెందని దేశంగా ఉంచాలని కోరుకుంటున్న కొన్ని అమిత్ర రాజ్యాలు, ఆయిలు లాబీలతో వాటి కుమ్మక్కును కనుగొనాలి. డీజిల్ వాహనాలను రద్దు చేయాలన్న వాటి వాదనలను తుంగలో తొక్కాలి. ఇతర ఇంధనాలు ఎంతటి కాలుష్య కారకాలో డీజిలూ అంతే. దాని ధర పెంచటం వ్యవసాయం నుంచి రవాణా వరకు, పరిశ్రమ నుంచి వస్తూత్పత్తి వరకు అన్ని స్థాయిల్లో జీవన వ్యయాన్ని పెంచుతుంది.

ప్రభుత్వం తన విధానాలను పునఃసమీక్షించుకోవాలి. ఇందుకు ఒక ఉదాహరణ చాలు. ఇండియన్ ఆయిల్ లాభాలు గత త్రైమాసికంలో రూ. 5400 కోట్లకు పెరిగాయి. సంవత్సరం మీద చూస్తే అది రూ. 20 వేల కోట్లు ఉంటుంది. ఇండియన్ ఆయిల్ తన డైరెక్టర్లు, ఉద్యోగులకు ఒక్కొక్క వాటాకు రూ. 2 డివిడెంట్, ఇతర ప్రయోజనాలు ప్రకటించింది. ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలన్నింటి (ఒఎంసిలు) వ్యవహారం అదే. ఒఎంసిలు దేశ ప్రజల భయ మనఃస్థితిని అనువుగా వాడుకుంటున్నాయి. ఇది క్రిమినల్ కాకపోయినా అపవిత్రం. ప్రభుత్వరంగ కంపెనీలు లాభాలు ఆర్జించాల్సిందే. అయితే అది దేశాన్ని బాధించేంతగా ఉండకూడదు. అందువల్ల రోజువారీ ఆయిల్ ధరల నిర్ణయాన్ని పునరాలోచించాలి. అంతిమంగా ప్రజల ఆగ్రహాన్ని చవిచూసేది ప్రభుత్వం అయినందున అది విజ్ఞతతో వ్యవహరించాలి.

పన్నుల విధానం కూడా చికాకు పుట్టిస్తున్నది. 2014లో పెట్రోలుపై కేంద్రం పన్ను రూ. 9.48 ఇప్పుడది రూ. 19.48 కి పెరిగింది. అలాగే డీజిలుపై ఎక్సైజ్ సుంకం రూ. 3.56 నుంచి రూ. 15.33కు చేరింది. రాష్ట్రాలు విధించే వ్యాట్ కనీసంగా 16.62 శాతం, గరిష్ఠంగా 39.48 (ముంబై) శాతం ఉంది. 25 రాష్ట్రాల్లో సగటు రేట్లు 20 నుంచి 35 శాతం మధ్య ఉన్నాయి.

2014 నుంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సగటున సంవత్సరానికి రూ. 3.7 లక్షల కోట్ల చొప్పున గత నాలుగేళ్లలో రూ. 14,67,462కోట్లు పన్నుల కింద వసూలు చేశాయి. దానిలో కేంద్రం వాటా రూ. 8,06,715 కోట్లు, రాష్ట్రాల వాటా రూ. 6,61,683 కోట్లు. బహు బాగుంది. అయితే ధరల పెరుగుదల (ద్రవ్యోల్బణం)పై దాని ప్రభావాన్ని అంచనా వేయలేదు. పరిపాలనా వ్యయం పెరుగుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ద్రవ్యోల్బణ ప్రభావానికి దారుణంగా గురవుతున్నాయి. మొత్తం మీద జీవన వ్యయం పెరుగుతున్నది. ప్రభుత్వం ఏమి చేయాలి? పెట్రోలు ధరను అంతర్జాతీయ క్రూడ్ కొనుగోలు ధరస్థాయిలో రమారమీ లీటర్ రూ. 35గా నిర్ణయించి, బహుళ పన్నులను ఎత్తివేయాలి. డీజిల్ ధరను రిఫైనింగ్ వద్ద రూ.25 లోపు నిర్ణయించాలి. రిఫైనింగ్ నుంచి వచ్చే ఇతర ఉప ఉత్పత్తుల ధరలను అలాగే నిర్ణయించాలి.

పన్నుల సంగతి చూదాం. జిఎస్‌టి ఎంతో ప్రయోజనకరం. 28 శాతం జిఎస్‌టి విధించినా అది పెట్రోలుకు లీటరుకు రూ. 9 ఉంటుంది. అప్పుడు రిటైల్ ధర రూ. 44 అవుతుంది. అలాగే డీజిల్ విక్రయ ధర లీటర్ రూ. 32 మించదు. ఔను, రాష్ట్రాలు, కేంద్రం ఆదాయాలకు ఊహాజనిత నష్టం జరుగుతుంది. ప్రభుత్వ అన్ని స్థాయిలో కలిపి ఆయిలును ఎక్కువగా వాడేది ప్రభుత్వాలే. వాటి ఇంధన వ్యయం కనీసం రూ. 1 లక్ష కోట్లు తగ్గుతుంది. జిఎస్‌టి విధించినా ప్రభుత్వాలు మరో రూ. 1.7 లక్ష కోట్లు ఆర్జిస్తాయి. జీవన ఖర్చుల తగ్గుదలతో దేశం లాభపడుతుంది. అధిక ధరతో వెనక్కులాగబడుతున్న వృద్ధి వేగవంతమవుతుంది. ఉత్పత్తి, ఉద్యోగాలు పెరిగి, రూపాయి బలపడి మొత్తం మీద సంతోషం ఉంటుంది. అంతిమంగా అది దేశానికి మంచిపేరు తెస్తుంది, నూతన శకం ఆరంభమవుతుంది. మోడీ దార్శనికతకు విజయంగా గొప్పులు చెప్పుకోవచ్చు. ప్రభుత్వాలు ఈ ప్రయోగానికి సిద్ధపడతాయా?